► వేంకటేశ్వరస్వామి వారి పనుల్లోనూ కమీషన్ డిమాండ్
► సొమ్ము ఇవ్వలేదని నిర్మాణ పనులు నిలిపివేత
► కూలీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్‌కు బెదిరింపు
► నరసరావుపేటలో పెచ్చుమీరిన టీడీపీ యువనేత ఆగడాలు
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా ఉంది ఆ యువనేత తీరు. దశాబ్ద కాలం తర్వాత అధికారం రావడంతో తనివి తీరా దోచుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే తన హవా సాగిస్తున్నారు. రెండేళ్లుగా రెండు నియోజకవర్గాల్లో అన్నీ తానై నడిపిస్తున్నారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, పంచాయితీలు చేస్తూ అందినకాడికి దోపిడీ చేస్తున్నారు. తాజాగా దేవుడి సొమ్ముపై కూడా ఆ నేత కన్ను పడింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వ్యూహాన్ని రచించాడు. కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదనే సాకుతో పనులు నిలిపివేసి తన ప్రతాపాన్ని చూపించాడు. సాక్షాత్తూ వేంకటేశ్వరుని నిధులతో చేపట్టిన పనుల్లోనూ వాటా కోరటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. - సాక్షి, గుంటూరు
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలో యువనేత ఆగడాలకు అంతులేకుండా పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కోటప్పకొండ దిగువన దాదాపు రూ.6 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం, వేదపాఠశాలను నిర్మిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో టీడీపీ యువనేత తనదైన శైలిలో కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపించినా యువనేత వైఖరి కారణంగా ముందుకు రాలేదు.
పనులు నిలిపివేత.....
కొన్ని నెలల తర్వాత గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. కొద్ది రోజులకే అధికార పార్టీ యువనేత పనులను నిలిపి వేయించాడు. తన కమీషన్ ఇచ్చిన తరువాతే పనులు చేయాలని స్పష్టం చేశాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్‌ను బెదిరించారు. యాత్రికుల వసతి గృహం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ నుంచే రూ.25 లక్షలు డిమాండ్ చేయగా ఆ సమయంలో రూ.5 లక్షలు కాంట్రాక్టర్ చెల్లించినట్టు తెలిసింది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. నెల రోజుల్లో పూర్తికావస్తుండటంతో తనకు రావాల్సిన కమీషన్ కోసం యువనేత మరోసారి బెదరింపులకు దిగాడు.
పోలీసుస్టేషన్‌కు కూలీల తరలింపు...
శనివారం నిర్మాణ పనుల్లో ఉన్న 9మంది కూలీలను పోలీసులు తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆదివారం మధ్నాహ్నం వరకు స్టేషన్‌లోనే వారిని ఉంచినట్టు సమాచారం. భోజనాలకు బయటకు పంపగా వారు పరారైనట్టు తెలిసింది. సాక్షాత్తూ త్రికోటేశ్వర స్వామి సన్నిదిలో శ్రీ వేంకటేశ్వరుని నిధులతో జరుగుతున్న పనుల్లో కూడా కమీషన్ కోసం యువనేత కక్కుర్తిపడటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. కూలీలను తీసుకొచ్చిన దానిపై రూరల్ ఎస్‌ఐ జేసీహెచ్ వెంకటేశ్వర్లను వివరణ అడగ్గా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా వారిని స్టేషన్‌కు తీసుకువచ్చినట్టు చెప్పడం విశేషం.
యువనేత కక్కుర్తి
Published Mon, Jun 27 2016 1:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement