మోపిదేవి బెయిల్పై తీర్పు 16కి వాయిదా
హైదరాబాద్ : మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్ పిటిషన్ను నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యచికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి వెంకటరమణ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి తరఫున ఆయన న్యాయవాది సురేందర్‌రావు గత గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా తాను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ఇటీవల కేర్ ఆసుపత్రి వైద్యులతో పరీక్షలు చేయించుకున్నానని మోపిదేవి తెలిపారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఈ మేరకు కేర్ వైద్యుల అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించారు.
చికిత్సలో భాగంగా డాక్టర్ల పర్యవేక్షణలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లకు తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో తనకు మూడు నెలల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువాదనలు పూర్తవటంతో తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.