విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:తాతకు పింఛను అందలేదా! ఇక ఆ భయం లేదు. వేలిముద్రల కారణంగా ఆగిపోతున్న పింఛను కష్టాలకు ఇక చెక్ చెప్పనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక నుంచి వేలి ముద్రలు పడని వారికి వారి మనవడు లేదా ఇతర రక్త సంబంధీకుల వేలిముద్రలను తీసుకుని ఇవ్వొచ్చు. దీంతో ఆ తాత పింఛను పునరుద్ధరణ అవుతుంది. జిల్లాలో బయోమెట్రిక్ విధానంతో చాలామంది పింఛ న్లు ఆగిపోయిన విషయం విదితమే. ముఖ్యంగా వయ సు రీత్యా చేతివేలు అరిగిపోవడంతో వృద్ధుల వేలిముద్రలు పడక సమస్య ఉత్పన్నమవుతోంది. అటువంటివారందరికీ బయోమెట్రిక్ లేదన్న కారణంతో పింఛన్లు నిలిచిపోయూయి. వృద్ధులే కాక.. వికలాంగులు,
వితంతువుల పింఛన్లు కూడా బయోమెట్రిక్ పుణ్యమాని ఆగిపోయూయి. జిల్లాలో 2,78,283 పింఛన్లున్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 1,29,512, చేనేత కార్మిక 2,576, వితంతు పింఛన్లు 84,410 ఉన్నాయి. ఇవి కాక.. వికలాంగ పింఛన్లు 36,626, వైఎస్‌ఆర్ అభయ హస్తం పింఛన్లు 24,343 ఉన్నాయి. బయోమెట్రిక్ కారణంతో డిసెంబర్ నుంచి చాలామందికి పింఛన్లు అందడం లేదు. ఇటువంటి పింఛన్లు జిల్లావ్యాప్తంగా 10,286కు పైగా ఉన్నాయి. దీంతో వారంతా మండల, జిల్లా కార్యాలయూల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రాలు అందిస్తున్నారు. ప్రతి నెలా బయోమెట్రిక్ ద్వారా వేయించాల్సిన వేలిముద్రలు సరిగా పడకపోవడం వల్లే వీరి పింఛన్లు నిలిచిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. వృద్ధులకు వయసురీత్యా, వితంతువులు, వికలాంగులకు కూడా ఇతరత్రా కూలి పనుల వల్ల చేతివేళ్లు అరిగిపోరుు వేలిముద్రలు పడడం లేదు.
ఒక వేళ పడినా అవి బయోమెట్రిక్ సిస్టంలో తేడాగా వస్తోంది. దీంతో వారి పింఛన్లు నిలిచిపోతున్నాయి. ఈ జాబితాలను జిల్లా అధికారులు మండలాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు పంపిస్తున్నారు. ఈ జాబితాల నుంచి వేలిముద్రలను తీసుకుని వారికి పింఛన్లు మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సారి మెసెంజర్ విధానంలో కొత్తగా వేలి ముద్రలు పడని వారికి వారి మనవళ్ల వేలి ముద్రలు గానీ, ఇతర రక్త సంబంధీకుల వేలిముద్రలుగానీ తీసుకుని పింఛ న్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోస్టాఫీసుల్లో ఈ తరహా వేలిముద్రలు తీసుకుంటున్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో ఈ విధానం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
రక్త సంబంధీకుల వేలిముద్రలు
తీసుకుంటున్నాం
జిల్లాలో వేలిముద్రలు సరిగా పడనివారిని గుర్తించి వారి జాబితాలను ఎంపీడీఓ, కమిషనర్లకు అంది స్తున్నాం. వారిద్వారా ఈ వేలిముద్రలు పడని వారి కి వారి ఇళ్లలో ఉన్న మనవడు, కుమారుడు వంటి రక్త సంబంధీకుల వేలిముద్రలు తీసుకుని మళ్లీ పునరుద్ధరించనున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పింఛ న్లు అందలేదని ఆందోళన చెందనక్కరలేదు. వారి వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడంతో పాటు సర్వర్‌లో అప్‌డేట్ కాకపోవడం వంటి కారణాలతో ఇవి నిలిచిపోయాయి. ఇక వాటిని వచ్చే నెలనుంచి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-ప్రసాద్, ఏపీఓ, పింఛన్ల విభాగం,
డీఆర్‌డీఏ, విజయనగరం
బయోమెట్రిక్ భయం లేదిక!
Published Sun, Jun 8 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM
Advertisement
Advertisement