నవాబుపేట, న్యూస్‌లైన్: ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అంటే ఇదేనేమో. గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా అన్నీతానై వ్యవహరించే గ్రామ సర్పంచ్ వేతనం అక్షరాల ఆరొందలంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఈ రోజుల్లో వెయ్యి ఓట్లున్న గ్రామంలో సర్పంచ్ పదవి దక్కాలంటే కనీసం ఐదు లక్షలైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. హోరాహోరీ పోరులో పీఠం కోసం అనేక పాట్లు పడాలి. తీరా కుర్చీమీద కూర్చున్నాకగానీ అసలుతత్వం బోధపడదు. ఒకవైపు ఏ పనికీ పైసా విదిల్చని ప్రభుత్వం.. మరోవైపు ‘ఓట్లేస్తే గ్రామానికి ఏమీ చేయవా..’ అంటూ ప్రజల చీవాట్లు.
గత అనుభవం ఉన్న వారి సంగతి వదిలేస్తే కొత్తగా ఎన్నికైన వారు మాత్రం ఈ పరిస్థితులను చూసి తలలు పట్టుకుంటున్నారు. పల్లెకు ప్రథమ పౌరులుగా వ్యవహరించే సర్పంచ్‌లకు ఉదయం లేచింది మొదలు గ్రామానికి సంబంధించిన అనేక పనులుంటాయి. పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పించడం, గ్రామంలో పంచాయతీలు చేయడం, మురికి కాలువలు, రోడ్లు.., మంచి నీటి వసతి తదితర సమస్యలు ఊపిరి సలపనివ్వవు. ఇంత చాకిరీ చేస్తున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం రూ.600. ఇవి ఏమాత్రం సరిపోని మాట వాస్తవం. లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలుపొందిన వీరంతా ఇప్పుడు అందుతున్న వేతనం చూసి అవాక్కవుతున్నారు. మరీ ఇంత తక్కువా.. అని వాపోతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి వస్తున్నది రూ.300లే. ఇది కూడా రెండేళ్ల కొకసారి ఇస్తుంటారు. దీనికి ఆయా గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరో రూ.300లు జమ చేస్తారు. మేజర్ పంచాయతీల్లో ప్రభుత్వం రూ.500, పంచాయతీ నుంచి మరో రూ.500 ఇస్తారు. అది కూడా పంచాయతీలో జనరల్ ఫండ్ ఉంటేనే సుమా.
మొదటి నుంచీ చిన్నచూపే..
పంచాయతీ కార్యదర్శికి నెలకు రూ.10 వేలకు పైగానే వేతనం అందుతోంది. పారిశుధ్య కార్మికులను రూ. వెయ్యి నుంచి మూడు వేల వరకు ఇస్తున్నారు. అయితే ఇంత తక్కువ వేతనం వస్తున్నా సర్పంచ్‌లు ఏ నాడూ వేతనాలు పెంచాలని ఉద్యమాలు చేయలేదు. ప్రస్తుతం చెక్ పవర్ కోసం చేస్తున్న ఉద్యమంలో జీతాల పెంపు అంశాన్ని చేర్చాలని పలువురు సర్పం చ్‌లు కోరుతున్నారు. కనీసం రూ.10 వేలన్నా ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
ఇది అన్యాయం..
గ్రామంలో అన్ని పనులు చక్కబెట్టాలి. నిత్యం మండలానికి వెళ్లిరావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే వేతనం దారి ఖర్చులకు కూడా సరిపోదు. సర్పంచ్‌లు పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అందుకే పనికి తగిన వేతనం ఇవ్వాలి.
- భీంరెడ్డి, పులుమామిడి, సర్పంచ్
కనీసం రూ.10 వేలు ఇవ్వాలి
కేవలం రూ.600లకు ఈ రోజుల్లో ఏమోస్తుంది. ఇంత తక్కువ జీతం దారుణం. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవాలి. నెలకు కనీసం రూ.10 వేలు చెల్లిస్తేనే కనీస ఖర్చులు పెట్టుకోగలం.
- సుధాకర్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు.
మరీ ఇంత చులకనా!
Published Tue, Oct 22 2013 1:41 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement