Navabupeta
-
ఇద్దరిని బలి తీసుకున్న పాముకాటు
సాక్షి, వికారాబాద్ : వేర్వేరు ఘటనల్లో పాముకాటుతో ఇద్దరు మృతిచెందారు.నవాబుపేట మండలం మాదారం గ్రామానికి చెందిన మదిరె శ్యామమ్మ(50) సోమవారం సాయంత్రం తన భర్త చంద్రయ్యతో కలిసి పొలంలో పనులు చేస్తోంది. ఈ సందర్భంగా పొలంలోని చెత్తను తొలగిస్తుండగా అందులో ఉన్న ఓ గుర్తుతెలియని పాము ఆమెను కాటు వేసింది. ఈ విషయాన్ని శ్యామమ్మ గుర్తించలేదు. ఏదైనా కట్టెపుల్ల గుచ్చుకొని ఉండొచ్చని భావించి అలాగే పనులు చేసింది. సాయంత్రం 6 గంటల సమయంలో తన చేతికి ఏదో కాటు వేసినట్లుగా ఉందని ఆమె తన భర్తకు విషయం తెలిపింది. పాము కాటు వేసిన ఆనవాళ్లు కనిపించడంతో వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి శ్యామమ్మ మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. మరో ఘనటనలో.. పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బుల్కాపూర్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. బుల్కాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి సబిత(38) గ్రామ శివారులోని ఓ ప్రైవేట్ విత్తనాల కంపెనీలో పనిచేస్తోంది. రోజు మాదిరిగానే ఆమె కంపెనీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పాముకాటు గురై అక్కడిక్కడే నురుగులు వాంతులు చేసుకుంది. కంపెనీలోని సిబ్బంది ఆమెను వెంటనే శంకర్‌పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి భర్త రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సబితకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. -
తల్లిని చంపి.. గదికి తాళం వేసి..
ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన కూతురు నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం దుర్వాసన రావడంతో ఆలస్యంగా వెలుగులోకి.. నవాబుపేట: తల్లిని ఓ కూతురు దారుణంగా హత్య చేసింది. 4 రోజులపాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నవా బుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన నర్సమ్మ(79), జంగయ్య భార్యాభర్తలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కూతురు పార్వతమ్మను భర్త వదిలేయడంతో కొన్నేళ్లుగా తల్లి వద్దే ఉంటోంది. తరచూ తల్లితో గొడవ పడేది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం కూడా గొడవ పడింది. కర్రతో తలపై బాదడంతో తల్లి రక్తస్రావమై పడిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి వృద్ధురా లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మృతదేహంతో నాలుగు రోజులు తల్లిని హత్య చేసిన పార్వతమ్మ భయాందోళనకు గురై మృతదేహంతో నాలుగు రోజులు గడిపింది. తల్లి ఉన్న గదికి తాళం వేసి వేరేగదిలో ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఇం ట్లో నుంచి దుర్వాసన రావటంతో గురువారం ఇరుగు పొరుగువారు నిలదీశారు. దీంతో అమ్మ ఆత్మహత్య చేసు కుందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానం వచ్చి వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి ఆనవాళ్లను బట్టి కూతురే హత్య చేసినట్లు అనుమానించారు. వెంటనే పోలీ సులకు సమాచారమివ్వడంతో వారొచ్చి విచారణ చేప ట్టారు. చేసేదిలేక చేసిన నేరం ఒప్పుకుంది. కోపంలో 4 రోజుల క్రితమే చంపానని ఒప్పుకుంది. చేరదీసినా చంపేసింది.. పన్నెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పార్వతమ్మకు పెళ్లి చేసింది. కొంతకాలానికే కూతురు వ్యవ హార శైలి నచ్చక భర్త వదిలేశాడు. దీంతో తల్లి చేరదీసి తనతోపాటే ఇంట్లో పెట్టుకుంది. కూలీనాలీ చేసుకుంటూ తల్లీకూతుళ్లు కాలం వెళ్లదీసేవారు. తల్లి వయసు మీద పడినప్పటి నుంచి ఆమెతో తగువు పడటం మొదలుపెట్టింది. డీఎస్పీ విచారణ విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇరుగు పొరుగు వారితో సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. నాడు కొడుకు చేతిలో తండ్రి ఐదేళ్ల క్రితం నర్సమ్మ భర్త జంగయ్యను కన్నకొడుకే హత్య చేశాడు. పెద్ద కుమారుడు నారాయణ తాగిన మైకంలో ఇంట్లోనే కర్రతో మోది దారుణంగా చంపేశాడు. అతనిపై కేసు నమోదవగా ప్రస్తుతం ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తల్లికి ఆసరాగా ఉంటుందనుకున్న కూతురు కూడా అదేబాటలో నడవడంతో గ్రామస్తులు ఆమెపై శాపనార్థాలు పెట్టారు. -
అడవి పందిని ఢీకొన్న బైకు
నవాబుపేట: బైకు అడవిపందిని ఢీకొన్న ప్రమాదంలో ఓ టీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో చోటు చేసకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన మేడిపల్లి రాములు(50) గతంలో వట్టిమీనపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం టీఆర్ఎస్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కుటుంబంతో సహా వికారాబాద్‌లో నివసిస్తున్నాడు. రాము లు మంగళవారం అర్ధరాత్రి వరకు చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించాడు. అనంతరం బైకుపై వికారాబాద్ మండలం పులుసుమామిడి మీదుగా బైకుపై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో పులుసుమామిడి గ్రామ సమీపంలో ఓ అడవిపంది రోడ్డుపై అడ్డుగా వచ్చింది. దీంతో వేగంగా ఉన్న రాములు బైకు అడవిపందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో స్థానికులు విషయం గమనించి రాములును గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి తమ్ముడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. రాములకు భార్య పద్మమ్మ, కొడుకు ప్రశాంతకుమార్, ఓ కూతురు ఉన్నారు. రాములు మృతితో భార్యాపిల్లలు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాదంలో రాములు దుర్మరణంపాలయ్యాడనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు మృతుడి స్వగ్రామం పులుమామిడికి చేరుకొని కుటుంబీకులను పరామర్శిం చారు. రాములు మృతి పార్టీకి తీరని లోటు అని తెలిపారు. వీరితో పాటు ఎంపీపీ పాండురంగారెడ్డి, పీఎసీఎస్ చెర్మైన్ మాణిక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టెపు మల్లారెడ్డి, సర్పంచులు భీంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, గోపాల్, నాయకులు నాగిరెడ్డి, మాణిక్‌రెడ్డి,వెంకట్‌రెడ్డి, సిందం మల్లేషం తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
పక్కదారి పట్టిన పంచాయతీ నిధులు
పట్టించుకోని అధికారులు శివ్వంపేట: పంచాయతీ నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్న సంబందిత వివరాలను సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో సంబందిత ఉన్నతాధికారులు నిర్లక్షయ దోరణి అవలంబిస్తున్నారు. మండలంలోని నవాబుపేట గ్రామ పంచాయతీకి సంబందించిన నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచాయతీ పరిధిలో అధికంగా పరిశ్రమలు ఉండడంతో పంచాయతీకి ఆదాయం భారీగా ఉంది. దీంతోపాటు బీఆర్జీఎఫ్, సాధారణ నిధులు పంచాయతీ ఖాతాలో జమ అవుతుంటాయి. మండలంలోని నవాబుపేట పంచాయతీకే అధిక ఆదాయ వనరులు ఉన్నాయి. దీన్ని ఆసరగా చేసుకొని పంచాయతీకి వచ్చిన నిధులను ఖర్చు చేయడంలో అక్రమాలకు పాల్పడిన విషయాన్ని గతనెలలో జరిగిన గ్రామసభలో సభ్యులు లేవనెత్తారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఇద్దరు కలిసి చేపట్టని పనులకు సైతం రికార్డులు సృష్టించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో 15లక్షల ఆదాయం రాగా అందుకు సంబందించిన ఖర్చులు పూర్తిస్థాయిలో చూపకపోవడం మూలంగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై పూర్తి విచారణ చేపట్టి నిధులను రికవరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతు పంచాయతీ సభ్యులు కలెక్టరేట్లో సైతం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెలరోజులు అవుతున్నా నేటికి ఎలాంటి విచారణ చేపట్టలేదు. అవినీతిలో అధికారులకు సంబందం ఉండడంతోనే పూర్తి వివరాలు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు బయటకు పొక్కకుండా మండల స్థాయి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆరులక్షల అవినీతి.. గత రెండు సంవత్సరాల కాలంలోగ్రామ పంచాయతీకి 15లక్షల ఆదాయం రాగా 6లక్షల వరకు అవినీతి చోటుచేసుకుందని ఉపసర్పంచ్ అశోక్‌రెడ్డి, వార్డు సభ్యులు సంగీత, వెంకటేశ్, నగేష్, ఆంజనేయులు ఆరోపించారు. సర్పంచ్ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డిలు కుమ్మక్కై నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో చేసిన పనులకే మల్లీ రికార్డులు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నివేదిక కోరతాం.. పంచాయతీ నిధుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర నివేదిక కోరనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు ఫోన్‌ద్వారా చెప్పారు. దుర్వినియోగమైన నిధులపై సమగ్ర విచారణ చేపట్టి అవినీతి చోటుచేసుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
వేగంగా రొట్టెల పండగ ఏర్పాట్లు
నెల్లూరు(నవాబుపేట) ప్రసిద్ధిగాంచిన రొట్టెల పండగకు ఏర్పాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ దఫా భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. రొట్టెల పండగ ప్రారంభానికి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పండగను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీబందోబస్తు లక్షలాది మంది భక్తుల రక్షణకు పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ నెల 4 నుంచి 7వరకు బారాషహీద్ దర్గా ప్రాంతం మొత్తం పోలీసులు ఆధీనంలో ఉండనుంది. నగర డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. రొట్టెల పండగకు దాదాపు 1,500 మంది పోలీసులను నియమించారు. వీరిలో ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, వెయ్యి మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, 200 మంది ఏఆర్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. బారాషహీద్ దర్గాలో మూడు పోలీస్ జోన్లు 32 సీసీ కెమెరాలు 6 భారీ స్క్రీన్ల ఏర్పాటు వెయ్యి మందికి పైగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులనిర్వహణబారాషహీద్ దర్గా ప్రాంగణంలో.. మున్సిపల్ అధికారులు మొత్తం 7 జోన్లను ఏర్పాటు చేశారు. మొదటి జోన్లో వాటర్ స్టాల్స్, లేడీస్ డ్రస్సింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. రెండో జోన్లో లేడీస్ టాయిలెట్స్, జెన్స్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. మూడో జోన్లో రెండు మెడికల్ క్యాంప్‌లు, ఒక వాటర్ స్టాల్, వాణిజ్య సంస్థలను నెలకొల్పారు. నాల్గో జోన్లో మెడికల్ క్యాంప్, వాణిజ్య సంస్థలు, బారాషహీద్ దర్గాలు ఉన్నాయి. ఐదో జోన్లో ప్రార్థన ప్రాంతం, రెండు మెడికల్ క్యాంప్‌లు, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ఆరో జోన్లో మెడికల్ క్యాంప్, విద్యుత్ టవర్‌ను ఏర్పాటు చేశారు. ఏడో జోన్ నుంచి దర్గాలోని రొట్టెలు వదిలే ప్రాంతానికి రావచ్చు. ఈ జోన్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పార్కింగ్... దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాహనాల్లో వస్తుంటారు. వారి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు మున్సిపల్ అధికారులు మూడు గ్రౌండ్లను ఏర్పాటు చేశారు. కస్తూర్బా కళాక్షేత్రం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఏసీ స్టేడియంలలో వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ఏసీ స్టేడియంలో వెయ్యి నాలుగు చక్రాల వాహనాలు, మూడువేల ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 600 నాలుగు చక్రాల వాహనాలు, 2000కు పైగా ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. కస్తూర్బా కళాక్షేత్రం గ్రౌండ్స్‌లో 200 నాలుగు చక్రాల వాహనాలు, 1500కు పైగా ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. రవాణా శాఖ ఆధ్వర్యంలో.. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వివిధప్రాంతాల నుంచి దాదాపు 70 బస్సులను ఏర్పాటు నడపనున్నారు. -
‘ఆశ’...నిరాశ
నవాబుపేట: పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, అధికారులకు చేరవేసే ఆశ (అక్రెడిడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్) కార్యకర్తల వెతలు అన్నీఇన్నీ కావు. 2005లో స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త పేరుతో ప్రారంభమై 2007 నుంచి ఆశాలుగా మారారు. జాతీయ ఆరోగ్య గ్రామీణ పథకం ఫేజ్ 2 నిధులతో 2005లో వారు నియమితులయ్యారు. వికారాబాద్ డివిజన్లో ప్రస్తుతం 126 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పదో తరగతి వరకు చదివి ఆరోగ్యంపై అవగాహన కలిగిన మహిళలు ఆశ కార్యకర్తలుగా పని చేయవచ్చు. వీరు సబ్‌సెంటర్లు, పీఎచ్‌సీల పరిధిలోని ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటారు. విధులివీ.... గర్భం దాల్చిన నాటి నుంచి పురుడు పోసుకునేంత వరకు మహిళలకు వైద్య పరంగా సేవలందించేది ఆశాలే. గర్భిణుల పేర ్లనమోదు, పురిటి బిడ్డలకు పది నెలల వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, పిల్లల సంరక్షణ, మాతా శిశు మరణాలను నమోదు చేయడం, కాన్పులు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించడం వీరి ప్రధాన విధులు. అలాగే ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్లపై మహిళలకు, పురుషులకు అవగాహన కల్పించడం, జాతీయ పల్స్‌పోలియో వంటి కార్యక్రమాల నిర్వహణ, వైద్యశాలలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం వంటివి వీరు చేయాల్సి ఉంటుంది. ఆశాలకు వారి పరిధిలోని గ్రామాల్లో అందించే సేవల ఆధారంగా పారితోషికం ఉంటుంది.గర్భిణుల సంఖ్య నమోదుకు, మొదటి రెండు, మూడు తనిఖీలకు రూ. 60 చొప్పున.., తక్కువ బరువు ఉన్న పిల్లల గురించి తెలియజేసినందుకు రూ.75, మాతా శిశు మరణాలను తెలిపినందుకు రూ. 50 చొప్పున...ఇలా ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున ఆశలకు చెల్లించాలి. వీటన్నీంటికి ఎటువంటి టీఏ, డీఏలు ఇవ్వకపోవడం వల్ల వీరికి లభించే పారితోషికంలో మూడొంతులు చార్జీలకు ఖర్చు అవుతున్నాయి. కనీసం కూలీలకు లభించే వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని ఆశాలు ఆవేదన చెందుతున్నారు. నాసిరకం యూనిఫాంలు ఆశా కార్యకర్తలకు ఏడాదిలో రెండు సార్లు జనవరి, జులైలో యూనిఫాంలు పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిలో కూడా అధికారుల చేతివాటం వల్ల నాసిరకం యూనీఫాంలు ఆశాలకు అందుతున్నాయి. ఆరోగ్య కేంద్రంలో సమావేశాలకు హాజరైతే కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు. వేధిస్తున్న అధికారులు ఆశాలు చేసిన పనిని ఏఎన్ఎంలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం వైద్యాధికారి బిల్లును జిల్లా కార్యాలయానికి పంపుతున్నారు. దీంతో అధికారులు తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్నారని , వైద్య అధికారుల సామానులు మోసే సిబ్బందిగా వినియోగించుకుంటున్నారని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా కార్యాలయంలో మూడు నెలలకు అంతకుపైగా అయితేనే పారితోషికాలు విడుదల అవుతున్నాయి. ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ సరిపడా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. -
రీషెడ్యూల్ కోసం తరలి వచ్చిన రైతులు
నవాబుపేట: పంట రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో రైతులు ఒక్కసారిగా బ్యాంకు తరలివచ్చిన సంఘటన సో మవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల పరిధిలో ని న వాబుపేట, ఎత్రాజ్పల్లి గ్రా మాల్లో ఆదివారం రాత్రి పంట రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి నాగలక్ష్మి చాటి ంపు వేయించారు. దాం తో రెం డు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాం కుకు వచ్చారు. అయితే బ్యాంకు మేనేజర్ పోస్టు గత 20 రోజులుగా ఖాళీగా ఉంది. కొత్త మేనేజర్ శ్రీనివాస్ సోమవారం ఉదయ మే వచ్చారు. ఇంత మంది రైతులు వచ్చారేమని మేనేజర్ ఆరా తీయగా రీషెడ్యూల్ కోసమని రైతులు తెలిపారు. తమకు ఇప్పటి వరకు హెడ్ఆఫీస్ నుంచి ఆదేశాలు రాలేదని రైతులతో తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయాధికారిని పిలిచి విషయం చెప్పారు. రీ షెడ్యూల్ చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని ఏవో మేనేజర్‌తో తెలిపారు. 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2013 వరకు రుణాలు తీసుకున్న రైతుల లిస్టు తయారు చేసి వారిని మాత్రమే బ్యాంకుకు పిలిపించాలని వ్యవసాయాధికారి, మేనేజర్ నిర్ణయించారు. లిస్టు తయారు చేసి ఆదర్శ రైతుల ద్వారా సదరు రైతులకు తెలియజేస్తామని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. దాంతో బ్యాంకుకు వచ్చిన రైతులందరూ ఈసురోమని తిరిగి వెళ్లారు. -
ఒక్కసారి వేసుకుంటే 20 ఏళ్ల పాటు దిగుబడులు
నవాబుపేట: కరివేపాకు వేయకుండా కూరలు వండే వారు ఉండరు. అలాగని ఎక్కువమంది రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు రారు. ప్రతి ఇంట్లో నిత్యం అవసరపడే కరివేపాకు తోటల సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు నవాబుపేట రైతులు. ఉద్యాన పంటల్లో ఒకటైన కరివేపాకు తోటలు పెద్దగా ఎక్కడా కనిపించవు. దాన్ని ఒక్కసారి సాగు చేసి చూస్తే గానీ అందులో ఉన్న లాభాల మర్మం తెలియదు. మిగతా ఉద్యాన పంటలు కేవలం ఆరు నెలలు, రెండు నెలలు, 40 రోజులు ఉంటాయి. వాటి పంట కాగానే తీసి వేసి వేరే పంటలు సాగు చేస్తారు. కానీ కరివేపాకు ఒక్కసారి విత్తుకుంటే 20 ఏళ్ల వరకు పంట దిగుబడులు వస్తాయి. 20 ఏళ్ల వరకు మందులు, నీళ్లు పెడితే చాలు పంట కోతకు వస్తూనే ఉంటుంది. దాంతో అన్ని పంటల వలే ప్రతి ఏడాది విత్తనం విత్తే అవసరం ఉండదు. రైతుకు పొలాన్ని మళ్లీ మళ్లీ దున్నడం, విత్తనాలు కొనుగోలు చేయడం వంటివి లేకుండా 20 ఏళ్లవరకు లాభాలు పొందవచ్చు. గుంటూరులో విత్తనాలు లభ్యం కరివేపాకు విత్తనాలు ఎక్కడపడితే అక్కడ లభ్యం కావు. అవి కేవలం గుంటూరులో మాత్రమే లభిస్తాయి. అక్కడ వ్యాపారులు కరివేపాకు చెట్ల నుంచి కరివేపాకు కాయలను (పచ్చివి) అప్పడే తీసుకువచ్చి మార్కెట్లో విక్రయిస్తారు. చెట్ల నుంచి తీసిన విత్తనాన్ని(కాయలను) మూడు రోజుల్లో పొలంలో విత్తాలి. లేనిపక్షంలో ఆ విత్తనాలు మొలకెత్తవని రైతులు పేర్కొంటున్నారు. అందుకు పొలాన్ని ముందుగా సిద్ధం చేసుకొని విత్తనాలు తీసుకువచ్చి నేరుగా విత్తాల్సి ఉంటుంది. విత్తనాల ధర కాస్త ఎక్కువే.. కరివేపాకు విత్తనాల ధర అధికంగానే ఉంటుంది. కిలో విత్తనాలు రూ.80 నుంచి 100 వరకు ఉంటాయి. ఒక ఎకరం సాగు చేయడానికి 3 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు, ఎరువులు కలిపి ఎకరం సాగు చేయడాకి రూ.40 వేలవరకు ఖర్చు అవుతుంది. ఏడాదిలో మూడు కోతలు క రివేపాకు వేసిన మొదటి ఏడాది 6 నెలల తర్వాత కోతకు వస్తుంది. అనంతరం ఏడాదిలో 3 కోతలు (పంట) దిగుబడి వస్తుంది. ఒక్కో కోతకు రూ.40 వేల వరకు లాభాలు పొందవచ్చునని రైతులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో నీరు అవసరం లేదు.. వర్షాకాలంలో సుమారు 6 నెలలు రైతులు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. కరివేపాకు వేళ్లు నేలలోకి అడుగుకుపైగా వెళుతాయి. దాంతో ఒక్కసారి వర్షం పడితే సుమారు 25 రోజుల వరకు మళ్లీ వర్షం పడకున్నా పంట దిగుబడి వస్తుంది. దీంతో రైతులకు నీటి బాధ అధికంగా ఉండదు. -
పనుల్లో దగా.. కాంట్రాక్టర్లు ధగధగ
నవాబుపేట: కోట్ల రూపాయల నిధులు రోడ్లపాలవుతున్నాయి. కొత్త రోడ్డు వేశారన్న ఆనందం పల్లెవాసులకు మున్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు మామూళ్లకు తలొగ్గడంతో కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా పనులు చేసి నిధులు కాజేస్తున్నారు. ఏడాది గడిచేసరికి ఆ రోడ్లు అస్థిత్వాన్ని కూడా కోల్పోయి దశాబ్దాల క్రితం వేసిన రోడ్లలా మారుతున్నాయి. మండలంలో ఆర్అండ్బీ శాఖ పని తీరు అధ్వానంగా మారింది. రూ. 2.84 కోట్లతో నిర్మించిన రోడ్లు ఏడాది తిరగక ముందే శిథిలావస్థకు చేరాయి. వికారాబాద్ మండలం బంగారుమైసమ్మ ఆలయం నుంచి నవాబుపేట మండలం మైతాప్‌ఖాన్‌గూడ వరకు 12 కిలోమీటర్ల పొడవున్నా ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో మరమ్మతులు, రిబీటీ కోసం ప్రభుత్వం ఏడాది కిందట రూ. 2 కోట్లు మంజూరు చేసింది. పనులను నగరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో దక్కించుకున్నారు. వారు కమీషన్ తీసుకొని మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పారు. రెండో కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత పాటించకుండా మరమ్మతు పనులు చేపట్టడంతో ఆరు మాసాల్లోనే రోడ్డు మళ్లీ గుంతలమయంగా మారింది. పనుల్లో నాణ్యత లేదంటూ అధికారులు బిల్లులు నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్ మళ్లీ రోడ్డుపై మరో పూత పూసి బిల్లులు క్లియర్ చేయించుకున్నాడు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి మునుపటిలాగే తయారైంది. రూ. 50 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాలది అదే పరిస్థితి... గతేడాది క్రితం మండల పరిధిలోని పూలపల్లి, ఎల్లకొండ, ఎత్రాజ్పల్లి, మీనపల్లిలాన్, కడ్చర్ల గ్రామాల్లో రూ. 10 లక్షల చొప్పున ఖర్చు చేసి పంచాయతీ భవనాలు నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో అప్పుడు ఈ భవనాలు వర్షానికి ఉరుస్తున్నాయి. వీటి పరిస్థితి చూసి సర్పంచులు ఈ భవనాల్లో కార్యకలాపాలు సాగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. -
‘ఉపాధి’లో అక్రమాలు
నవాబుపేట, న్యూస్‌లైన్: మండలంలో 2013 మార్చి నుంచి 2014 మార్చి వరకు పలు గ్రామాల్లో చేపట్టిన (పూడికతీత, రాతి కట్టలు తదితర పనులు) ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. రూ.3.5 కోట్ల పనులు, పింఛన్లపై వారం రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో వెల్లడైన అంశాలపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల స్థాయి సమావేశం (ప్రజా వేదిక) నిర్వహించారు. ఈ సందర్బంగా తనిఖీ బృందాలు గ్రామాల్లో నిర్వహించిన రికార్డులను సమావేశంలో చదివి వినింపించారు. మండలంలోని అక్నాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్, సీఎస్పీలను తొలగించాలని గ్రామస్తులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీఎస్పీలు డబ్బులు వచ్చినప్పటికీ సకాలంలో ఇవ్వడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. చాలా గ్రామాల్లో మస్టర్, పే ఆర్డర్, ఎంబీలలో ఏపీవో, టీఏల సంతకాలు లేవని తనిఖీ బృందం సభ దృష్టికి తీసుకువచ్చింది. యావాపూర్ ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాదిరెడ్డిపల్లిలో రూ.1400, అక్నాపూర్‌లో రూ.500, లింగంపల్లిలో రూ.700, కేశపల్లిలో రూ. 500, ఆర్కతలలో రూ.1150, ఇలా అన్ని గ్రామాల్లో మొత్తం రూ.9,775 అవినీతి జరిగినట్లు గుర్తించారు. అవినీతికి బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఉపాధి హామీ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగిన గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూలీల డబ్బులు కాజేసిన పూలపల్లి సీఎస్పీ సబిత, మమ్మదాన్‌పల్లి సీఎస్పీ పల్లవిలను విధుల నుంచి తొలగించారు. ఉపాధి హామీలో అక్రమాలకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని జిల్లా విజిలెన్స్ అధికారి గుప్తా హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మీదేవి, ఉష, ఆయా గ్రామాల సర్పంచులు, తనిఖీ బృందం సభ్యులు, కూలీలు పాల్గొన్నారు. -
మరీ ఇంత చులకనా!
నవాబుపేట, న్యూస్‌లైన్: ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అంటే ఇదేనేమో. గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా అన్నీతానై వ్యవహరించే గ్రామ సర్పంచ్ వేతనం అక్షరాల ఆరొందలంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఈ రోజుల్లో వెయ్యి ఓట్లున్న గ్రామంలో సర్పంచ్ పదవి దక్కాలంటే కనీసం ఐదు లక్షలైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. హోరాహోరీ పోరులో పీఠం కోసం అనేక పాట్లు పడాలి. తీరా కుర్చీమీద కూర్చున్నాకగానీ అసలుతత్వం బోధపడదు. ఒకవైపు ఏ పనికీ పైసా విదిల్చని ప్రభుత్వం.. మరోవైపు ‘ఓట్లేస్తే గ్రామానికి ఏమీ చేయవా..’ అంటూ ప్రజల చీవాట్లు. గత అనుభవం ఉన్న వారి సంగతి వదిలేస్తే కొత్తగా ఎన్నికైన వారు మాత్రం ఈ పరిస్థితులను చూసి తలలు పట్టుకుంటున్నారు. పల్లెకు ప్రథమ పౌరులుగా వ్యవహరించే సర్పంచ్‌లకు ఉదయం లేచింది మొదలు గ్రామానికి సంబంధించిన అనేక పనులుంటాయి. పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పించడం, గ్రామంలో పంచాయతీలు చేయడం, మురికి కాలువలు, రోడ్లు.., మంచి నీటి వసతి తదితర సమస్యలు ఊపిరి సలపనివ్వవు. ఇంత చాకిరీ చేస్తున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం రూ.600. ఇవి ఏమాత్రం సరిపోని మాట వాస్తవం. లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలుపొందిన వీరంతా ఇప్పుడు అందుతున్న వేతనం చూసి అవాక్కవుతున్నారు. మరీ ఇంత తక్కువా.. అని వాపోతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి వస్తున్నది రూ.300లే. ఇది కూడా రెండేళ్ల కొకసారి ఇస్తుంటారు. దీనికి ఆయా గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరో రూ.300లు జమ చేస్తారు. మేజర్ పంచాయతీల్లో ప్రభుత్వం రూ.500, పంచాయతీ నుంచి మరో రూ.500 ఇస్తారు. అది కూడా పంచాయతీలో జనరల్ ఫండ్ ఉంటేనే సుమా. మొదటి నుంచీ చిన్నచూపే.. పంచాయతీ కార్యదర్శికి నెలకు రూ.10 వేలకు పైగానే వేతనం అందుతోంది. పారిశుధ్య కార్మికులను రూ. వెయ్యి నుంచి మూడు వేల వరకు ఇస్తున్నారు. అయితే ఇంత తక్కువ వేతనం వస్తున్నా సర్పంచ్‌లు ఏ నాడూ వేతనాలు పెంచాలని ఉద్యమాలు చేయలేదు. ప్రస్తుతం చెక్ పవర్ కోసం చేస్తున్న ఉద్యమంలో జీతాల పెంపు అంశాన్ని చేర్చాలని పలువురు సర్పం చ్‌లు కోరుతున్నారు. కనీసం రూ.10 వేలన్నా ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది అన్యాయం.. గ్రామంలో అన్ని పనులు చక్కబెట్టాలి. నిత్యం మండలానికి వెళ్లిరావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే వేతనం దారి ఖర్చులకు కూడా సరిపోదు. సర్పంచ్‌లు పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అందుకే పనికి తగిన వేతనం ఇవ్వాలి. - భీంరెడ్డి, పులుమామిడి, సర్పంచ్ కనీసం రూ.10 వేలు ఇవ్వాలి కేవలం రూ.600లకు ఈ రోజుల్లో ఏమోస్తుంది. ఇంత తక్కువ జీతం దారుణం. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవాలి. నెలకు కనీసం రూ.10 వేలు చెల్లిస్తేనే కనీస ఖర్చులు పెట్టుకోగలం. - సుధాకర్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు.