వేగంగా రొట్టెల పండగ ఏర్పాట్లు
నెల్లూరు(నవాబుపేట)
ప్రసిద్ధిగాంచిన రొట్టెల పండగకు ఏర్పాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ దఫా భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. రొట్టెల పండగ ప్రారంభానికి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పండగను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీబందోబస్తు
లక్షలాది మంది భక్తుల రక్షణకు పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ నెల 4 నుంచి 7వరకు బారాషహీద్ దర్గా ప్రాంతం మొత్తం పోలీసులు ఆధీనంలో ఉండనుంది. నగర డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. రొట్టెల పండగకు దాదాపు 1,500 మంది పోలీసులను నియమించారు. వీరిలో ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, వెయ్యి మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, 200 మంది ఏఆర్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు.
బారాషహీద్ దర్గాలో మూడు పోలీస్ జోన్‌లు 32 సీసీ కెమెరాలు 6 భారీ స్క్రీన్‌ల ఏర్పాటు వెయ్యి మందికి పైగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులనిర్వహణబారాషహీద్ దర్గా ప్రాంగణంలో..
మున్సిపల్ అధికారులు మొత్తం 7 జోన్లను ఏర్పాటు చేశారు. మొదటి జోన్‌లో వాటర్ స్టాల్స్, లేడీస్ డ్రస్సింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. రెండో జోన్‌లో లేడీస్ టాయిలెట్స్, జెన్స్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. మూడో జోన్‌లో రెండు మెడికల్ క్యాంప్‌లు, ఒక వాటర్ స్టాల్, వాణిజ్య సంస్థలను నెలకొల్పారు. నాల్గో జోన్‌లో మెడికల్ క్యాంప్, వాణిజ్య సంస్థలు, బారాషహీద్ దర్గాలు ఉన్నాయి. ఐదో జోన్‌లో ప్రార్థన ప్రాంతం, రెండు మెడికల్ క్యాంప్‌లు, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ఆరో జోన్‌లో మెడికల్ క్యాంప్, విద్యుత్ టవర్‌ను ఏర్పాటు చేశారు.
ఏడో జోన్ నుంచి దర్గాలోని రొట్టెలు వదిలే ప్రాంతానికి రావచ్చు. ఈ జోన్‌లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
పార్కింగ్...
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాహనాల్లో వస్తుంటారు. వారి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు మున్సిపల్ అధికారులు మూడు గ్రౌండ్లను ఏర్పాటు చేశారు. కస్తూర్బా కళాక్షేత్రం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఏసీ స్టేడియంలలో వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.
ఏసీ స్టేడియంలో వెయ్యి నాలుగు చక్రాల వాహనాలు, మూడువేల ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 600 నాలుగు చక్రాల వాహనాలు, 2000కు పైగా ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.
కస్తూర్బా కళాక్షేత్రం గ్రౌండ్స్‌లో 200 నాలుగు చక్రాల వాహనాలు, 1500కు పైగా ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో..
దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వివిధప్రాంతాల నుంచి దాదాపు 70 బస్సులను ఏర్పాటు నడపనున్నారు.