తల్లిని చంపి.. గదికి తాళం వేసి..
ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన కూతురు
నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం
దుర్వాసన రావడంతో ఆలస్యంగా వెలుగులోకి..
నవాబుపేట: తల్లిని ఓ కూతురు దారుణంగా హత్య చేసింది. 4 రోజులపాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నవా బుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన నర్సమ్మ(79), జంగయ్య భార్యాభర్తలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కూతురు పార్వతమ్మను భర్త వదిలేయడంతో కొన్నేళ్లుగా తల్లి వద్దే ఉంటోంది. తరచూ తల్లితో గొడవ పడేది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం కూడా గొడవ పడింది. కర్రతో తలపై బాదడంతో తల్లి రక్తస్రావమై పడిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి వృద్ధురా లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
మృతదేహంతో నాలుగు రోజులు
తల్లిని హత్య చేసిన పార్వతమ్మ భయాందోళనకు గురై మృతదేహంతో నాలుగు రోజులు గడిపింది. తల్లి ఉన్న గదికి తాళం వేసి వేరేగదిలో ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఇం ట్లో నుంచి దుర్వాసన రావటంతో గురువారం ఇరుగు పొరుగువారు నిలదీశారు. దీంతో అమ్మ ఆత్మహత్య చేసు కుందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానం వచ్చి వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి ఆనవాళ్లను బట్టి కూతురే హత్య చేసినట్లు అనుమానించారు. వెంటనే పోలీ సులకు సమాచారమివ్వడంతో వారొచ్చి విచారణ చేప ట్టారు. చేసేదిలేక చేసిన నేరం ఒప్పుకుంది. కోపంలో 4 రోజుల క్రితమే చంపానని ఒప్పుకుంది.
చేరదీసినా చంపేసింది..
పన్నెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పార్వతమ్మకు పెళ్లి చేసింది. కొంతకాలానికే కూతురు వ్యవ హార శైలి నచ్చక భర్త వదిలేశాడు. దీంతో తల్లి చేరదీసి తనతోపాటే ఇంట్లో పెట్టుకుంది. కూలీనాలీ చేసుకుంటూ తల్లీకూతుళ్లు కాలం వెళ్లదీసేవారు. తల్లి వయసు మీద పడినప్పటి నుంచి ఆమెతో తగువు పడటం మొదలుపెట్టింది.
డీఎస్పీ విచారణ
విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇరుగు పొరుగు వారితో సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
నాడు కొడుకు చేతిలో తండ్రి
ఐదేళ్ల క్రితం నర్సమ్మ భర్త జంగయ్యను కన్నకొడుకే హత్య చేశాడు. పెద్ద కుమారుడు నారాయణ తాగిన మైకంలో ఇంట్లోనే కర్రతో మోది దారుణంగా చంపేశాడు. అతనిపై కేసు నమోదవగా ప్రస్తుతం ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తల్లికి ఆసరాగా ఉంటుందనుకున్న కూతురు కూడా అదేబాటలో నడవడంతో గ్రామస్తులు ఆమెపై శాపనార్థాలు పెట్టారు.