నెల్లూరు(క్రైమ్): గోనెసంచిలో మృతదేహం కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. స్నేహితుడు తనతోనే ఉండాలని, అతడి భార్య జైలుకు వెళ్లాలనే కుట్రతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి స్థానిక ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. పొదలకూరురోడ్డుకు చెందిన జహీర్ బాషా డైకస్‌రోడ్డులో మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో ఎ.కావ్య అలియాస్ షేక్ సమీరా పనిచేస్తోంది. ఆమెకు అప్పటికే వివాహమై భర్త నుంచి దూరంగా ఉంటోంది.
కాగా జహీర్, కావ్య సన్నిహితంగా ఉండేవారు. జహీర్‌కు అప్పటికే అస్మా అనే యువతితో వివాహమైంది. ఎలాగైనా స్నేహితుడు తనతోనే ఉండాలని భావించిన కావ్య ఈ విషయాన్ని తన స్నేహితురాలైన వెంగళరావ్‌నగర్‌కు చెందిన కృష్ణవేణికి తెలియజేసింది. ఆమె ద్వారా యూట్యూబ్‌లో వశీకరణ పూజలు చేస్తామని వీడియోలు చేసిన ఏలూరు జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన మణికంఠ (33) గురించి తెలుసుకుంది. గతేడాది ఇద్దరూ కలిసి అతడిని సంప్రదించారు. దీంతో మణికంఠ నెల్లూరుకు రాగా కావ్య, కృష్ణవేణి కలిశారు.
హత్య చేసి..
జహీర్ తనతోనే ఉండిపోయేలా వశీకరణ చేయాలని కావ్య మణికంఠను కోరగా మందు చేసి ఇచ్చాడు. అది పనిచేయలేదని మహిళలు భావించారు. దీంతో మణికంఠను హత్య చేసి ఆ నేరాన్ని జహీర్ భార్యపై నెట్టేస్తే అతను తనతోనే ఉండిపోతాడని కావ్య పథకం రచించింది. ఈ విషయాన్ని కృష్ణవేణి, తన కుమార్తె సాయిప్రియకు తెలియజేసింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో మణికంఠకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అప్పటికి అతను చనిపోకపోవడంతో గొంతునులిమి హత్య చేశారు. కావ్య తన కుమార్తె చేత అస్మాపై అనుమానం వచ్చేలా సూసైడ్ నోట్ రాయించి మృతుడి జేబులో పెట్టారు.
అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి స్కూటీపై తీసుకెళ్లి గౌతమ్‌నగర్ రెండో వీధిలో పడేసింది. దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి జేబులో లభ్యమైన లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో మణికంఠది హత్యేనని తేలడంతో కేసును మార్చి విభిన్న కోణాల్లో దర్యాపు చేపట్టారు.
నగదు డ్రా చేసి..
మణికంఠ హత్య అనంతరం కావ్య మృతుడి ఏటీఎం కార్డు ద్వారా రూ.3.50 లక్షలను విడతల వారీగా నగదు డ్రా చేసింది. అందులో రూ.లక్ష నగదు స్నేహితురాలికి ఇచ్చి మిగిలిన నగదుతో బంగారం కొనుగోలు చేసింది. సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను హత్య చేసింది కావ్య అని గుర్తించారు. ఆమెకు సాయిప్రియ, కృష్ణవేణి సహకరించారని గుర్తించి శనివారం రాత్రి వారందరినీ అరెస్ట్ చేశారు.
25 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు ఏటీఎం కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన పోలీసు« అధికారులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై రమే‹Ùబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment