మొండెం లభించిన ఇంటి ఎదుట గుమికూడిన ప్రజలు, ఇస్రార్(ఫైల్)
నిర్మల్‌రూరల్/భైంసా : నిర్మల్ జిల్లాలోని భైంసాలో రెండు రోజుల క్రితం గోనెసంచిలో లభ్యమైన తలకు సంబంధించిన మొండెం ఆదివారం జిల్లా కేంద్రంలో లభించడం కలకలం రేపింది. శుక్రవారం ఓ గుర్తు తెలియని యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు కేవలం తలను మాత్రమే గోనెసంచిలో పెట్టి ఓ మురుగు కాలువలో పడేశారు. అయితే ఆ తలను సామాజిక మాధ్యమాలు, మీడియాలో పోలీసులు ప్రచారం చేయడంతో ఆ యువకుడి సోదరుడు గుర్తించి భైంసా పోలీసులను ఆశ్రయించడంతో ఆచూకీ లభించింది.
మృతుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసి...
మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని నాపూర్ తాలుకా, బాయిగూడ గ్రామానికి చెందిన చౌదరి మహ్మద్ ఇస్రార్‌గా(28)గా గుర్తించినట్లు డీఎస్పీ అందె రాములు, సీఐ జాన్‌దివాకర్ తెలిపారు. ఇస్రార్ 20 రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రానికి బట్టల వ్యాపారం చేయడానికి వచ్చారు. అదే ప్రాంతానికి చెందిన అక్బర్‌తో కలిసి బుధవార్‌పేట్‌లోని అఫ్సర్ కిరాణ సముదాయంపైన ఓగదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. అతని భార్య, కూతురు, కుమారుడు ఉత్తరప్రదేశ్‌లోనే నివాసం ఉంటున్నారు.
మొండెం లభించింది ఇలా...
ఇస్రార్ మొబైల్ రెండు రోజుల నుంచి స్విచ్చాఫ్ రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉండే అతని సోదరుడు ఖలీద్ ఆందోళన చెంది శనివారం నిర్మల్‌కు వచ్చారు. తన అన్న హత్య జరిగిన విషయం తెలుసుకుని భైంసాలో ఉన్న తలను గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. భైంసా సీఐ శ్రీనివాస్ పట్టణ, రూరల్ సీఐలు జాన్‌దివాకర్, జీవన్‌రెడ్డిలతో కలిసి ఇస్రార్ ఉండే గదికి వెళ్లారు. గదికి వేసిఉన్న తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్‌రూంలో ఇస్రార్ మొండెం లభించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోదరుడికి అప్పగించారు.
సహచరుడిపైనే అనుమానం...
ఇస్రార్ హత్యగావించబడినప్పటినుంచి అతని స్నేహితుడు అక్బర్ అలియాస్ అక్రమ్ కనిపించడం లేదు. దీంతో అతనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని మొబైల్ కూడా స్విచ్చాఫ్‌లో ఉంది. ఇద్దరి మధ్య వ్యాపారంలో జరిగిన విబేధాలే కారణమా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా అక్బర్ కోసం గాలిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పట్టణ సీఐ జాన్‌దివాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment