SPSR Nellore Double Murder: ఎవరు? ఎందుకు? | Couple Found Brutally Murdered in SPSR Nellore | Sakshi
Sakshi News home page

SPSR Nellore Double Murder: ఎవరు? ఎందుకు?

Published Mon, Aug 29 2022 8:37 AM | Last Updated on Mon, Aug 29 2022 8:37 AM

Couple Found Brutally Murdered in SPSR Nellore - Sakshi

కృష్ణారావు, సునీత (ఫైల్‌)

నెల్లూరు(క్రైమ్‌): ఆ దంపతులను గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం నెల్లూరులో కలకలం రేపింది. ఈ హత్యలను ఎవరు? ఎందుకు చేశారని తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. ఎన్టీఆర్‌ జిల్లా జగయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం ఇందుగపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి కృష్ణారావు (54), వాసిరెడ్డి సునీత (50)లు దంపతులు. వారికి సాయిచంద్, గోపీచంద్‌ పిల్లలు.

దంపతులు సుమారు 26 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికొచ్చారు. తొలినాళ్లలో కరెంటాఫీస్‌ సెంటర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటూ అదే ప్రాంతంలో శ్రీరామ్‌ క్యాంటీన్‌ (హోటల్‌)ను ప్రారంభించారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి వివాహాలు చేశారు. పెద్ద కుమారుడు పోస్టల్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు గోపీచంద్‌ రాంజీనగర్‌లో నివాసముంటూ పొగతోటలో మధుర హోటల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా కృష్ణారావు పడారుపల్లి అశోక్‌నగర్‌ (ఏఎన్‌ఆర్‌ కల్యాణ మండపం సమీపంలో) డూప్లెక్స్‌ హౌస్‌ను నిర్మించాడు. ఆరేళ్లుగా భార్యతో కలిసి అక్కడ నివాసముంటున్నాడు. అందరితో మర్యాదపూర్వకంగా ఉండేవారు. ఎవరితోనూ విభేదాల్లేవు. రోజూ తెల్లవారుజామున ఐదు గంటలకు కృష్ణారావు ఇంటి నుంచి హోటల్‌కు వెళ్లేవాడు. భార్య ఇంట్లో పనులు పూర్తి చేసి ఉదయం 11 గంటలకు హోటల్‌కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేది. కృష్ణారావు మాత్రం రాత్రి 11.30 గంటలకు ఇంటికొచ్చేవాడు. 

ఆమె కేకలు వేయడంతో..
అదే ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి రమణమ్మ రోజూ ఉదయం కృష్ణారావు దంపతులకు పాలు పోసేది. ఎప్పటిలాగే రమణమ్మ ఆదివారం ఉదయం పాలు పోసేందుకు వెళ్లింది. వరండాలో కృష్ణారావు మృతిచెంది ఉండడాన్ని గమనించిన ఆమె కేకలు వేస్తూ అక్కడి నుంచి వీధిలోకి పరుగులు తీసింది. స్థానికులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. స్థానికుల ద్వారా పడారుపల్లిలో నివాసముంటున్న కృష్ణారావు అన్న సుధాకర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన ద్వారా మృతుడి కుమారుడు గోపీచంద్‌కు విషయం చెప్పారు. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా రక్తపుమడుగులే దర్శనమిచ్చాయి. 

నగదు కోసం మాత్రమేనా..
కృష్ణారావు స్కూటీని ఇంటి బయట పార్క్‌ చేసి లోనికి వచ్చే సమయంలో వరండాలో హతమార్చారు. మృతుడి జేబులోనో.. చేతులోనో ఉండాల్సిన బైక్‌ తాళాలు కప్‌బోర్డులో ఉండడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంటిపై గదిలోని బీరువాలో హోటల్‌కు సంబంధించిన రోజువారి కలెక్షన్‌ను, ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు ఉంచుతారని బంధువులు పేర్కొన్నారు. కింద పడకగదిలోని బీరువాలో బంగారు ఆభరణాలుంటాయి. దాన్ని పగులగొట్టేందుకు దుండగులు యత్నించారు.

అయితే సాధ్యం కాకపోవడంతో పైగదిలోని బీరువాను పగులగొట్టారు. అందులో ఉన్న నగదు మాత్రమే అపహరించారా? డాక్యుమెంట్లనూ తీసుకెళ్లారా? అనే అంశాలపై స్పష్టత లేదు. హత్యలు దోపిడీలో భాగమేనని అందరూ భావిస్తున్నా ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలోనూ ఇదే ఇంట్లో దొంగలు చోరీకి యత్నించారు. తాళం పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు 
ఘటనా స్థలాన్ని ఎస్పీ సీహెచ్‌ విజయారావు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్య కేసు ఛేదించాలని ఆదేశించారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ, సీసీఎస్‌ డీఎస్పీలు అబ్దుల్‌ సుభాన్, శివాజీరాజ్‌ల పర్యవేక్షణలో వేదాయపాళెం, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌లు కె.నరసింహారావు, గంగాధర్‌లు తమ సిబ్బందితో కలిసి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి ఆరాతీస్తున్నారు. గోపీచంద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జీజీహెచ్‌లో ప్రభుత్వ వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించగా వారు తమ స్వగ్రామానికి తరలించారు. సోమవారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఖాళీ స్థలం వరకు వెళ్లి.. 
క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. హత్య జరిగిన ఇంటి నుంచి పోలీసు జాగిలం సమీపంలోని ఖాళీ స్థలం వరకు వెళ్లి వెనుదిరిగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా రక్తపుమరకలతో ఉన్న కత్తి, సవకకర్రను, అపహరణకు గురైన రెండు సెల్‌ఫోన్లలో ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. 

ఏం జరిగిందంటే.. 
శనివారం రాత్రి కృష్ణారావు ఆదివారం హోటల్‌కు అవసరమైన కూరగాయలు తీసుకురావాలని అక్కడ పనిచేసే మణికి సూచించాడు. 11.30 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని తన వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తి వంశీని స్కూటీలో ఎక్కించుకుని నిప్పో సెంటర్‌లో వదిలిపెట్టి ఇంటికెళ్లాడు. అప్పటికే గుర్తుతెలియని దుండగులు సునీతను హత్య చేశారు. పైఅంతస్తులోని బీరువాను తెరిచి నగదు దోచుకుని వెనుదిరిగారు. ఈక్రమంలోనే కృష్ణారావు ఇంటికి చేరుకుని స్కూటీని బయట పార్క్‌ చేసి లోనికెళ్తుండగా వరండాలో దుండగులు అతడిని అడ్డుకుని గొంతుకోసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతుల సెల్‌ఫోన్లతో పరారయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement