అర్ధవీడు: ప్రియురాలికి ఇమ్మన్న ప్రేమలేఖ చించివేశాడని విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్సపొందుతున్న బాలుడు మృతిచెందగా శనివారం బంధువులు మృతదేహంతో ఆందోళకు దిగారు. అర్ధవీడు మండలం అంకభూపాలెంకు చెందిన 7వ తరగతి విద్యార్థి మెట్ల రవితేజపై మరో యువకుడు ఈనెల 7న పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజను గుంటూరు ప్రభుత్వ వైద్యశాల చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తెస్తున్నారని తెలిసి మృతుడి బంధువులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఘటనకు కారణమైన ఇంటర్ విద్యార్థిని కఠినంగా శిక్షించాలని, రవితేజ మృతి సమయంలో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఘటనలో మరి కొందరు ఉన్నారని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి బస్సులను నిలిపివేశారు. సమీపంలోని చీమలేటిపల్లె వద్ద సైతం ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న మార్కాపురం సీఐ భీమానాయక్, కంభం, మార్కాపురం రూరల్ ఎస్సైలు రామానాయక్, మల్లికార్జునలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో అర్ధవీడు వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.
నిందితుడిని కోర్టులో హాజరు పరిచామని ఇంక ఎవరిపైనైనా అనుమానాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి, చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. ఇంతలో మృతదేహం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో గ్రామానికి తెచ్చినపుడు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా మృతుడి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామ పెద్దలు, బంధువులతో సీఐ, ఎస్సైలు, ఉపవిద్యాశాఖాధికారి పీసీహెచ్ వెంకటరెడ్డి, ఎంఈఓ వెంకటేశ్వరనాయక్‌లు బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు విద్యాశాఖ ద్వారా కలెక్టర్‌కు నివేదిక పంపించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తృప్తి చెందని రవితేజ బంధువులు మళ్లీ మృతదేహాన్ని అర్ధవీడు చర్చి సమీపంలోని రోడ్డుపై ఉంచి అర్ధరాత్రి వరకు బైఠాయించారు. తమ డిమాండ్‌లు పరిష్కరించేదాకా ధర్నా విరమించేదిలేదని జోరు వానలోనూ ఆందోళన చేశారు. ఎట్టకేలకు రాత్రి 11 గంటల తర్వాత మార్కాపురం ఆర్డీవో పెంచల కిషోర్, డీఎస్పీ రామాంజనేయులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment