సాక్షి, వికారాబాద్ : వేర్వేరు ఘటనల్లో పాముకాటుతో ఇద్దరు మృతిచెందారు.నవాబుపేట మండలం మాదారం గ్రామానికి చెందిన మదిరె శ్యామమ్మ(50) సోమవారం సాయంత్రం తన భర్త చంద్రయ్యతో కలిసి పొలంలో పనులు చేస్తోంది. ఈ సందర్భంగా పొలంలోని చెత్తను తొలగిస్తుండగా అందులో ఉన్న ఓ గుర్తుతెలియని పాము ఆమెను కాటు వేసింది. ఈ విషయాన్ని శ్యామమ్మ గుర్తించలేదు. ఏదైనా కట్టెపుల్ల గుచ్చుకొని ఉండొచ్చని భావించి అలాగే పనులు చేసింది. సాయంత్రం 6 గంటల సమయంలో తన చేతికి ఏదో కాటు వేసినట్లుగా ఉందని ఆమె తన భర్తకు విషయం తెలిపింది. పాము కాటు వేసిన ఆనవాళ్లు కనిపించడంతో వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి శ్యామమ్మ మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరో ఘనటనలో..
పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బుల్కాపూర్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. బుల్కాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి సబిత(38) గ్రామ శివారులోని ఓ ప్రైవేట్ విత్తనాల కంపెనీలో పనిచేస్తోంది. రోజు మాదిరిగానే ఆమె కంపెనీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పాముకాటు గురై అక్కడిక్కడే నురుగులు వాంతులు చేసుకుంది. కంపెనీలోని సిబ్బంది ఆమెను వెంటనే శంకర్‌పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి భర్త రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సబితకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment