పాము కాటు విషపూరితమైనదా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి | Real Estate Occupying Snake Mound In Rangareddy | Sakshi
Sakshi News home page

పాముల పుట్టల్లోకి.. రియల్‌ పడగ!

Published Thu, Sep 2 2021 9:19 AM | Last Updated on Thu, Sep 2 2021 9:23 AM

Real Estate Occupying Snake Mound In Rangareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రంగారెడ్డి: చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు వచ్చినట్లు.. పాములున్న పుట్టల్లోకి నేడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రవేశించారు. చెట్టు, పుట్టా, గుట్ట తేడా లేకుండా కనిపించిన ఖాళీ భూమినల్లా చదును చేస్తున్నారు. వెంచర్లు చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇంతకాలం మనుషులకు, నివాసాలకు దూరంగా జీవించిన పాములు ప్రస్తుతం ఇళ్ల చుట్టు చేరుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో ఆయా ప్రాంతాల్లోని పాములు పంట పొలాల్లోకి చేరాయి.

దీంతో రైతులు సహా వెంచర్లు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాల వద్ద పహారా కాసే వాచ్‌మెన్‌లు, కూలీలను కాటేస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో పాముకాటు కేసులు భారీగా నమోదవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఆమనగల్‌ మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు చెందిన ఓ రైతు పాముకాటుతో మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది.
చదవండి: భర్తకు వీడియో కాల్‌ చేసి భార్య ఆత్మహత్య 

శివారు మున్సిపాలిటీల్లో వెలగని వీధిదీపాలు.. 
రంగారెడ్డి జిల్లాలోని మెజార్టీ భూభాగం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం సహా, ఐటీ అనుబంధ సంస్థలు అనేకం జిల్లాలో వెలిశాయి. దీంతో ఇక్కడ భూములకు ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చింది. అప్పటి వరకు ఉన్న చెరువులు, కుంటలే కాదు అనేక వ్యవసాయ భూములు సైతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బహుళజాతి కంపెనీల రాకతో వాటికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో అనేక నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. పట్టణాలకు, పల్లెలకు తేడా లేకుండా పోయింది.

శివారులో ఆదిబట్ల, ఆమన్‌గల్, బడంగ్‌పేట్, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, మణికొండ, మీర్‌పేట్, నార్సింగ్, పెద్ద అంబర్‌పేట్, షాద్‌నగర్, శంషాబాద్, శంకర్‌పల్లి, తుక్కుగూడ, తుర్కయాంజాల్‌ మన్సిపాలిటీలు సహా మండల కేంద్రాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన అనేక కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. అపార్ట్‌మెంట్ల ముందు కాపాల ఉన్న వాచ్‌మెన్‌లు అర్థరాత్రి మూత్ర విసర్జన కోసం బయటికి వస్తే పాము కాటుకు బలవుతున్నారు.  
చదవండి: అమెరికా వెళ్లాకే పెళ్లి ...22 లక్షలకు టోకరా

ఆస్పత్రుల్లో సదుపాయాలు కరువు  
పాముకాటుకు గురైన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన వైద్యులు సహా యాంటి స్నేక్‌బైట్‌ మందులు జిల్లాలోని శంషాబాద్, వనస్థలిపురం, కొండాపూర్‌ ఆస్పత్రుల్లో లేకపోవడంతో ఉస్మానియాకు పరుగులు తీస్తున్నారు. దీంతో అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఇటీవల వరదలకు ఖాళీ స్థలాలు, చెట్ల పొదల నుంచి పాములు బయటికి వచ్చి ఇళ్లల్లోకి చేరుతుండటంతో భయంతో సిటిజనులు స్నేక్‌ సొసైటీ సభ్యులను ఆశ్రయిస్తుండటం, వారు వాటిని చంపకుండా పట్టుకుని వెంట తీసుకెళ్లి.. నల్లమల, ఇతర అటవీ ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్రెండ్స్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులు రోజుకు సగటున 30 పాములను పట్టుకెళ్తుండటం కొసమెరుపు.  

పాము కాటుతో రైతు మృతి 
ఆమనగల్లు: మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు చెందిన రైతు నేనావత్‌ గోర్యానాయక్‌ (55) బుధవారం పాముకాటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం తండా సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద గుడిసెలో పనిముట్లు తీస్తుండగా పాముకాటు వేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన గోర్యానాయక్‌ను కుటుంబ సభ్యులు ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఒకటి రెండు కాట్లు ఉంటే విషపూరితమైనది: డాక్టర్‌ శ్రవణ్‌కుమార్, జనరల్‌ ఫిజీషియన్‌ 

►కాటు వేసిన పాము విషపూరితమైనదా? కాదా? అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. 
►ఒకటి లేదా రెండు కాట్లు ఉంటే విష పూరితమైందని, మూడు అంతకంటే ఎక్కువ ఉంటే విషరహితమైందిగా భావించాలి.  
► నిజానికి పాము కోరల్లో 0.5 ఎంఎల్‌ నుంచి 2 ఎంఎల్‌ విషం ఉంటుంది.  
►పాము కాటు వేసిన 3 గంటల్లోపే చికిత్సను ప్రారంభించాలి.  
►లేదంటే విషం శరీరమంతా విస్తరించి చనిపోయే ప్రమాదం ఉంది.  
► విషపూరిత సర్పం కరిచిన వెంటనే గాయంపైన అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. 
►ప్రతి పది నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి.  
►సూదిలేని సిరంజిని తీసుకొని పాము కాటువేసిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. 
► మొదట రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది.  
►దాన్ని విషతుల్యమైన రక్తమని భావించి ఆ మేరకు వేగంగా ఆస్పత్రికి చేరుకుని చికిత్స చేయించుకోవాలి.  
►పాముకాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురై రక్త ప్రసరణ పెరిగి విషం శరీరమంతా వ్యాపించి చనిపోతున్నారు.  
►ఆ వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement