నవాబుపేట, న్యూస్‌లైన్: మండలంలో 2013 మార్చి నుంచి 2014 మార్చి వరకు పలు గ్రామాల్లో చేపట్టిన (పూడికతీత, రాతి కట్టలు తదితర పనులు) ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. రూ.3.5 కోట్ల పనులు, పింఛన్లపై వారం రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో వెల్లడైన అంశాలపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల స్థాయి సమావేశం (ప్రజా వేదిక) నిర్వహించారు. ఈ సందర్బంగా తనిఖీ బృందాలు గ్రామాల్లో నిర్వహించిన రికార్డులను సమావేశంలో చదివి వినింపించారు.
మండలంలోని అక్నాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్, సీఎస్‌పీలను తొలగించాలని గ్రామస్తులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీఎస్‌పీలు డబ్బులు వచ్చినప్పటికీ సకాలంలో ఇవ్వడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. చాలా గ్రామాల్లో మస్టర్, పే ఆర్డర్, ఎంబీలలో ఏపీవో, టీఏల సంతకాలు లేవని తనిఖీ బృందం సభ దృష్టికి తీసుకువచ్చింది. యావాపూర్ ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మాదిరెడ్డిపల్లిలో రూ.1400, అక్నాపూర్‌లో రూ.500, లింగంపల్లిలో రూ.700, కేశపల్లిలో రూ. 500, ఆర్కతలలో రూ.1150, ఇలా అన్ని గ్రామాల్లో మొత్తం రూ.9,775 అవినీతి జరిగినట్లు గుర్తించారు. అవినీతికి బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఉపాధి హామీ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగిన గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూలీల డబ్బులు కాజేసిన పూలపల్లి సీఎస్‌పీ సబిత, మమ్మదాన్‌పల్లి సీఎస్‌పీ పల్లవిలను విధుల నుంచి తొలగించారు. ఉపాధి హామీలో అక్రమాలకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని జిల్లా విజిలెన్స్ అధికారి గుప్తా హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మీదేవి, ఉష, ఆయా గ్రామాల సర్పంచులు, తనిఖీ బృందం సభ్యులు, కూలీలు పాల్గొన్నారు.
‘ఉపాధి’లో అక్రమాలు
Published Thu, Jun 5 2014 12:04 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement