ఒక్కసారి వేసుకుంటే 20 ఏళ్ల పాటు దిగుబడులు
నవాబుపేట: కరివేపాకు వేయకుండా కూరలు వండే వారు ఉండరు. అలాగని ఎక్కువమంది రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు రారు. ప్రతి ఇంట్లో నిత్యం అవసరపడే కరివేపాకు తోటల సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు నవాబుపేట రైతులు. ఉద్యాన పంటల్లో ఒకటైన కరివేపాకు తోటలు పెద్దగా ఎక్కడా కనిపించవు. దాన్ని ఒక్కసారి సాగు చేసి చూస్తే గానీ అందులో ఉన్న లాభాల మర్మం తెలియదు. మిగతా ఉద్యాన పంటలు కేవలం ఆరు నెలలు, రెండు నెలలు, 40 రోజులు ఉంటాయి.
వాటి పంట కాగానే తీసి వేసి వేరే పంటలు సాగు చేస్తారు. కానీ కరివేపాకు ఒక్కసారి విత్తుకుంటే 20 ఏళ్ల వరకు పంట దిగుబడులు వస్తాయి. 20 ఏళ్ల వరకు మందులు, నీళ్లు పెడితే చాలు పంట కోతకు వస్తూనే ఉంటుంది. దాంతో అన్ని పంటల వలే ప్రతి ఏడాది విత్తనం విత్తే అవసరం ఉండదు. రైతుకు పొలాన్ని మళ్లీ మళ్లీ దున్నడం, విత్తనాలు కొనుగోలు చేయడం వంటివి లేకుండా 20 ఏళ్లవరకు లాభాలు పొందవచ్చు.
గుంటూరులో విత్తనాలు లభ్యం
కరివేపాకు విత్తనాలు ఎక్కడపడితే అక్కడ లభ్యం కావు. అవి కేవలం గుంటూరులో మాత్రమే లభిస్తాయి. అక్కడ వ్యాపారులు కరివేపాకు చెట్ల నుంచి కరివేపాకు కాయలను (పచ్చివి) అప్పడే తీసుకువచ్చి మార్కెట్‌లో విక్రయిస్తారు. చెట్ల నుంచి తీసిన విత్తనాన్ని(కాయలను) మూడు రోజుల్లో పొలంలో విత్తాలి. లేనిపక్షంలో ఆ విత్తనాలు మొలకెత్తవని రైతులు పేర్కొంటున్నారు. అందుకు పొలాన్ని ముందుగా సిద్ధం చేసుకొని విత్తనాలు తీసుకువచ్చి నేరుగా విత్తాల్సి ఉంటుంది.
విత్తనాల ధర కాస్త ఎక్కువే..
కరివేపాకు విత్తనాల ధర అధికంగానే ఉంటుంది. కిలో విత్తనాలు రూ.80 నుంచి 100 వరకు ఉంటాయి. ఒక ఎకరం సాగు చేయడానికి 3 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు, ఎరువులు కలిపి ఎకరం సాగు చేయడాకి రూ.40 వేలవరకు ఖర్చు అవుతుంది.
ఏడాదిలో మూడు కోతలు
క రివేపాకు వేసిన మొదటి ఏడాది 6 నెలల తర్వాత కోతకు వస్తుంది. అనంతరం ఏడాదిలో 3 కోతలు (పంట) దిగుబడి వస్తుంది. ఒక్కో కోతకు రూ.40 వేల వరకు లాభాలు పొందవచ్చునని రైతులు పేర్కొంటున్నారు.
వర్షాకాలంలో నీరు అవసరం లేదు..
వర్షాకాలంలో సుమారు 6 నెలలు రైతులు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. కరివేపాకు వేళ్లు నేలలోకి అడుగుకుపైగా వెళుతాయి. దాంతో ఒక్కసారి వర్షం పడితే సుమారు 25 రోజుల వరకు మళ్లీ వర్షం పడకున్నా పంట దిగుబడి వస్తుంది. దీంతో రైతులకు నీటి బాధ అధికంగా ఉండదు.