Curry leaves crop cultivation
-
ఇలా సాగు చేస్తే కరివేపాకుతో మంచి ఆదాయం
-
జీవితాన్ని మార్చేసిన కరివేపాకు
సాక్షి, ఉరవకొండ: అనంతపురం జిల్లాలో అత్యంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉరవకొండ నియోజకవర్గంలోనే. చుట్టూ ఎటు చూసినా నల్లరేగడి భూములు. వేల అడుగుల లోతున బోరుబావులు తవ్వించినా.. నీటి చెమ్మ తగలని భూములు. వర్షాధారంపైనే పంటల సాగు. సాగునీటి వనరులంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఇటుగా వచ్చిన హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించడంలో గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కనబరిచింది. ఫలితంగా దారుణమైన పరిస్థితులను ఈ ప్రాంత రైతులు చవిచూస్తూ వచ్చారు. పంటల సాగు భారమైన ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలోని తట్రకల్లు గ్రామ రైతులు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. కరివేపాకు సాగుతో ఏటా తిరుగులేని ఆదాయం గడిస్తున్నారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ జనాభా 1,800. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయామే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో వంద ఎకరాలు సాగులో ఉండగా.. మొత్తం కరివేపాకు సాగు చేపట్టడం గమనార్హం. ఇక్కడ సాగు చేస్తున్న కరివేపాకును రైతులు ముంబయికి ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఒకే పంట తట్రకల్లులో 15 ఏళ్లుగా రైతులు ఒకే రకం పంట సాగు చేపట్టారు. అంతకు ముందు వివిధ రకాల పంటల సాగు చేపట్టి వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన కరివేపాకు సాగు ఆ గ్రామ రైతుల పాలిట కల్పతరువుగా మారింది. గ్రామ రైతులు తమకు చెందిన వంద ఎకరాల్లో కరివేపాకు పంట సాగును బిందు సేద్యం ద్వారా చేపట్టారు. పంట సాగుకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ. లక్ష వరకూ పెట్టుబడులు పెడుతూ ఎకరాకు మూడు క్వింటాళ్ల విత్తనం వేస్తున్నారు. ఏడాదిలో మూడు సార్లు పంట కోతకు వస్తోంది. నికర ఆదాయం కచ్చితం కరివేపాకు సాగులో తట్రకల్లు రైతులు ఏనాడూ నష్టపోలేదు. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తోంది. మార్కెట్లో టన్ను కరివేపాకు రూ.9,500 నుంచి రూ.10వేల వరకూ అమ్ముడుపోతోంది. పంటను మార్కెట్కు తరలించే భారం కూడా లేకుండా ముంబయికి చెందిన పలువురు వ్యాపారులు నేరుగా తట్రకల్లుకు చేరుకుని పంట కోత కోయించి తీసుకెళుతుంటారు. కోత కోసిన పంటను వాహనాల్లో గుంతకల్లుకు తరలించి, అక్కడి నుంచి రైళ్లలో ముంబయికి చేరవేస్తుంటారు. ఏడాదిలో మూడుసార్లు పంట కోత ద్వారా నికర ఆదాయం కచ్చితంగా వస్తుందని స్థానిక రైతులు అంటున్నారు. ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం మహిళ రైతు ఓబులమ్మ పదేళ్లుగా తనకున్న అయిదెకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. పొలంలో ఉన్న బోరు ద్వారా అరకొర నీరు వస్తోంది. ఆ నీటినే పొదుపుగా బిందుసేద్యం ద్వారా వాడుకుంటూ పంట సాగుచేస్తూ వస్తున్నారు. ఎకరాకు అయిదు టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను పంటను రూ.9,500తో విక్రయించినా... ఐదు ఎకరాల్లో రూ.2,37,500 ఒక కోతకు ఆదాయం గడిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి మూడు కోతలకు గానూ రూ.7 లక్షలకు పైగా ఆదాయం అందుతోంది. -
ఒకే పంట సరికాదు! ఏ పంటైనా దిగుల్లేదు!
ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం.. వీటితో ఏ పంటలోనైనా నిస్సందేహంగా మంచి నికరాదాయం పొందడం సాధ్యమేనా? అని అంటే.. ముమ్మాటికీ సాధ్యమేనంటున్నారు యువ రైతు శ్రీనివాసరెడ్డి. ఏడేళ్ల అనుభవం ఆయనకు ఇచ్చిన భరోసా ఏమిటంటే.. ఏదో ఒక పంటకే రైతు పరిమితం కాకూడదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పంటల/తోటల సరళిని మార్చుకుంటూ వెళ్లడమే ఉత్తమ మార్కెటింగ్ వ్యూహమని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ కరివేపాకు సాగులో.. ఏడాదికి ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నికరాదాయం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ పంటనైనా పండించొచ్చన్న భరోసాతో ఈ యువ రైతు గొప్ప ఆశావహ జీవితాన్ని నిర్మించుకోవడంపై ‘సాగుబడి’ కథనం. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన రైతు బాదం మల్లారెడ్డి, పద్మల కుమారుడైన శ్రీనివాసరెడ్డి బీకాం చదివి మట్టినే నమ్ముకొని జీవితాన్ని పండించుకుంటున్నాడు. తాతల కాలం నాటి 18 ఎకరాల సొంత భూమిలో ఏడేళ్లుగా మనసుపెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యాన పంటల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం.. యూట్యూబులో వీడియోలు చూడటం, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలు చదవడం ద్వారా నేలతల్లి ఆరోగ్యమే రైతు, దేశ సౌభాగ్యమని గుర్తించి తదనుగుణంగా ధైర్యంగా ఏడేళ్ల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో కరివేపాకు, 11 ఎకరాల్లో దానిమ్మ, ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. కివీ పండ్ల సాగుపై తాజాగా దృష్టిసారిస్తున్నారు. కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర ఎకరంలో ఏడేళ్ల క్రితం కరివేపాకు నాటి జీవామృతం, ఘనజీవామృతంతో సాగు ప్రారంభించిన తొలి ఏడాదే సత్ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. బోదె పద్ధతిలో కరివేపాకు సాగు చేపట్టిన శ్రీనివాసరెడ్డి క్రమంగా పదెకరాలకు విస్తరించారు. అయితే, కరివేపాకుకు మార్కెట్ విస్తరించకపోవడంతో గత మూడేళ్లుగా దానిమ్మ వైపు దృష్టి మరల్చారు. కరివేపాకు ఏటా 3 కోతల్లో ఎకరానికి మొత్తం 18 టన్నుల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అత్యధికంగా కిలోకు రూ. 25 ధర పలుకుతుంది. ఎండాకాలంలో హాస్టళ్లు మూతపడతాయి, ఆకు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అడిగే వారే ఉండరు. ఏదేమైనా మొత్తంగా సగటున కిలోకు రూ. పది ధర పలుకుతుందని, ఎకరానికి ఏటా రూ. లక్షన్నర వరకు నికరాదాయం పొందుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రసాయనిక సేద్యంలో రూ. 50 వేలు అధికంగా ఖర్చవుతుందన్నారు. 11 ఎకరాల్లో దానిమ్మ సాగు దానిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని కొందరు రైతులు దానిమ్మ పంటకు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదని నిరాశపరిచారు. అయితే, నిరాశ చెందకుండా మూడేళ్ల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. ఏడాదిన్నర క్రితం 3 ఎకరాలు, 2 నెలల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. రసాయనిక మందులు వాడకుండా జీవామృతం, ద్రావణాలు, కషాయాలతోనే రెండు కోతల్లో ఖర్చులు వచ్చాయి. ఈ దఫా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. బోర్లు అడుగంటి, బావి నీరు కూడా చాలకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో రెండెకరాలు కొనుగోలు చేసి బోర్లు వేసి పైప్లైన్ ద్వారా బావిలోకి ఆ నీటిని తరలించి.. బావి నుంచి 18 ఎకరాలకు డ్రిప్ ద్వారా నీటి తడులు పెడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు శ్రీనివాసరెడ్డి వద్ద ఆరు దేశీ ఆవులున్నాయి. కరివేపాకుకు 15 రోజులకోసారి జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తారు. వారానికోసారి వేపనూనె, నీమాస్త్రం.. 20 రోజులకోసారి ముడినూనెల పిచికారీ చేయడం వల్ల కరివేపాకు మంచి నాణ్యత, రంగు వస్తున్నాయని తెలిపారు. తండ్రి మల్లారెడ్డి ఆవుల సంరక్షణ బాధ్యతలు చూస్తూ కుమారునికి సూచనలు, సలహాలు అందిస్తుంటారు. ఏడేళ్లుగా ప్రకృతి సాగు వల్ల భూసారం పెరిగింది. పొలంలో ఎక్కడ మట్టి తీసి చూసినా తమ విసర్జితాలతో భూసారం పెంచే వానపాములు కనిపిస్తాయి. ఆవుల మూత్రం, పేడతో తానే కాక ఇతరులకు ద్రావణాలు, కషాయాలు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పుడూ ఒకే ఉద్యాన పంటపై ఆధారపడటం కన్నా అనేక పంటలపై దృష్టిపెట్టడం రైతుకు శ్రేయస్కరమని ఆయన విశ్వాసం. ఏడాది క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఇప్పుడు కివీ పండ్ల సాగుపై దృష్టిసారిస్తున్నానన్నాడు. శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రైతులు స్వయంగా వచ్చి, సోషల్ మీడియా ద్వారా కూడా సలహాలు తీసుకుంటూ ఉండటం విశేషం. – మేడగం రామాంజనేయరెడ్డి ,సాక్షి, దర్శి, ప్రకాశం జిల్లా డ్రాగన్ ఫ్రూట్ తోటలో శ్రీనివాసరెడ్డి.. బావిలోకి బోరు నీరు.. పొలం వానపాముల మయం -
ఒక్కసారి వేసుకుంటే 20 ఏళ్ల పాటు దిగుబడులు
నవాబుపేట: కరివేపాకు వేయకుండా కూరలు వండే వారు ఉండరు. అలాగని ఎక్కువమంది రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు రారు. ప్రతి ఇంట్లో నిత్యం అవసరపడే కరివేపాకు తోటల సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు నవాబుపేట రైతులు. ఉద్యాన పంటల్లో ఒకటైన కరివేపాకు తోటలు పెద్దగా ఎక్కడా కనిపించవు. దాన్ని ఒక్కసారి సాగు చేసి చూస్తే గానీ అందులో ఉన్న లాభాల మర్మం తెలియదు. మిగతా ఉద్యాన పంటలు కేవలం ఆరు నెలలు, రెండు నెలలు, 40 రోజులు ఉంటాయి. వాటి పంట కాగానే తీసి వేసి వేరే పంటలు సాగు చేస్తారు. కానీ కరివేపాకు ఒక్కసారి విత్తుకుంటే 20 ఏళ్ల వరకు పంట దిగుబడులు వస్తాయి. 20 ఏళ్ల వరకు మందులు, నీళ్లు పెడితే చాలు పంట కోతకు వస్తూనే ఉంటుంది. దాంతో అన్ని పంటల వలే ప్రతి ఏడాది విత్తనం విత్తే అవసరం ఉండదు. రైతుకు పొలాన్ని మళ్లీ మళ్లీ దున్నడం, విత్తనాలు కొనుగోలు చేయడం వంటివి లేకుండా 20 ఏళ్లవరకు లాభాలు పొందవచ్చు. గుంటూరులో విత్తనాలు లభ్యం కరివేపాకు విత్తనాలు ఎక్కడపడితే అక్కడ లభ్యం కావు. అవి కేవలం గుంటూరులో మాత్రమే లభిస్తాయి. అక్కడ వ్యాపారులు కరివేపాకు చెట్ల నుంచి కరివేపాకు కాయలను (పచ్చివి) అప్పడే తీసుకువచ్చి మార్కెట్లో విక్రయిస్తారు. చెట్ల నుంచి తీసిన విత్తనాన్ని(కాయలను) మూడు రోజుల్లో పొలంలో విత్తాలి. లేనిపక్షంలో ఆ విత్తనాలు మొలకెత్తవని రైతులు పేర్కొంటున్నారు. అందుకు పొలాన్ని ముందుగా సిద్ధం చేసుకొని విత్తనాలు తీసుకువచ్చి నేరుగా విత్తాల్సి ఉంటుంది. విత్తనాల ధర కాస్త ఎక్కువే.. కరివేపాకు విత్తనాల ధర అధికంగానే ఉంటుంది. కిలో విత్తనాలు రూ.80 నుంచి 100 వరకు ఉంటాయి. ఒక ఎకరం సాగు చేయడానికి 3 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు, ఎరువులు కలిపి ఎకరం సాగు చేయడాకి రూ.40 వేలవరకు ఖర్చు అవుతుంది. ఏడాదిలో మూడు కోతలు క రివేపాకు వేసిన మొదటి ఏడాది 6 నెలల తర్వాత కోతకు వస్తుంది. అనంతరం ఏడాదిలో 3 కోతలు (పంట) దిగుబడి వస్తుంది. ఒక్కో కోతకు రూ.40 వేల వరకు లాభాలు పొందవచ్చునని రైతులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో నీరు అవసరం లేదు.. వర్షాకాలంలో సుమారు 6 నెలలు రైతులు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. కరివేపాకు వేళ్లు నేలలోకి అడుగుకుపైగా వెళుతాయి. దాంతో ఒక్కసారి వర్షం పడితే సుమారు 25 రోజుల వరకు మళ్లీ వర్షం పడకున్నా పంట దిగుబడి వస్తుంది. దీంతో రైతులకు నీటి బాధ అధికంగా ఉండదు.