సాక్షి, ఉరవకొండ: అనంతపురం జిల్లాలో అత్యంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉరవకొండ నియోజకవర్గంలోనే. చుట్టూ ఎటు చూసినా నల్లరేగడి భూములు. వేల అడుగుల లోతున బోరుబావులు తవ్వించినా.. నీటి చెమ్మ తగలని భూములు. వర్షాధారంపైనే పంటల సాగు. సాగునీటి వనరులంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఇటుగా వచ్చిన హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించడంలో గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కనబరిచింది.
ఫలితంగా దారుణమైన పరిస్థితులను ఈ ప్రాంత రైతులు చవిచూస్తూ వచ్చారు. పంటల సాగు భారమైన ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలోని తట్రకల్లు గ్రామ రైతులు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. కరివేపాకు సాగుతో ఏటా తిరుగులేని ఆదాయం గడిస్తున్నారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ జనాభా 1,800. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయామే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో వంద ఎకరాలు సాగులో ఉండగా.. మొత్తం కరివేపాకు సాగు చేపట్టడం గమనార్హం. ఇక్కడ సాగు చేస్తున్న కరివేపాకును రైతులు ముంబయికి ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
15 సంవత్సరాలుగా ఒకే పంట
తట్రకల్లులో 15 ఏళ్లుగా రైతులు ఒకే రకం పంట సాగు చేపట్టారు. అంతకు ముందు వివిధ రకాల పంటల సాగు చేపట్టి వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన కరివేపాకు సాగు ఆ గ్రామ రైతుల పాలిట కల్పతరువుగా మారింది. గ్రామ రైతులు తమకు చెందిన వంద ఎకరాల్లో కరివేపాకు పంట సాగును బిందు సేద్యం ద్వారా చేపట్టారు. పంట సాగుకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ. లక్ష వరకూ పెట్టుబడులు పెడుతూ ఎకరాకు మూడు క్వింటాళ్ల విత్తనం వేస్తున్నారు. ఏడాదిలో మూడు సార్లు పంట కోతకు వస్తోంది.
నికర ఆదాయం కచ్చితం
కరివేపాకు సాగులో తట్రకల్లు రైతులు ఏనాడూ నష్టపోలేదు. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తోంది. మార్కెట్లో టన్ను కరివేపాకు రూ.9,500 నుంచి రూ.10వేల వరకూ అమ్ముడుపోతోంది. పంటను మార్కెట్‌కు తరలించే భారం కూడా లేకుండా ముంబయికి చెందిన పలువురు వ్యాపారులు నేరుగా తట్రకల్లుకు చేరుకుని పంట కోత కోయించి తీసుకెళుతుంటారు. కోత కోసిన పంటను వాహనాల్లో గుంతకల్లుకు తరలించి, అక్కడి నుంచి రైళ్లలో ముంబయికి చేరవేస్తుంటారు. ఏడాదిలో మూడుసార్లు పంట కోత ద్వారా నికర ఆదాయం కచ్చితంగా వస్తుందని స్థానిక రైతులు అంటున్నారు.
ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం
మహిళ రైతు ఓబులమ్మ పదేళ్లుగా తనకున్న అయిదెకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. పొలంలో ఉన్న బోరు ద్వారా అరకొర నీరు వస్తోంది. ఆ నీటినే పొదుపుగా బిందుసేద్యం ద్వారా వాడుకుంటూ పంట సాగుచేస్తూ వస్తున్నారు. ఎకరాకు అయిదు టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను పంటను రూ.9,500తో విక్రయించినా... ఐదు ఎకరాల్లో రూ.2,37,500 ఒక కోతకు ఆదాయం గడిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి మూడు కోతలకు గానూ రూ.7 లక్షలకు పైగా ఆదాయం అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment