వేటూరి పురస్కారాన్ని భాస్కరభట్ల రవికుమార్‌కు అందజేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ ఎంపీ, కళాపీఠం సభ్యులు
సాక్షి, విజయనగరం : తాత చెప్పిన కథలు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి.. 25 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించాను.. 20 ఏళ్లు పూర్తయింది.. ఆత్రేయ స్మారక కళాపీఠం 20వ వార్షికోత్సవం.. నా కెరీర్ రెండూ 20 ఏళ్లు పూర్తిచేసుకున్నాయి.. విజయనగరం గడ్డపై వేటూరి పురస్కారం పొందడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఆత్రేయ స్మారక కళాపీఠం వార్షికోత్సవం బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. కళాపీఠం ప్రతినిధులు, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చేతుల మీదుగా భాస్కరభట్లకు దుశ్సాలువ కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, బంగారు ఉంగరం, పురస్కారపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీత భాస్కరభట్ల మాట్లాడుతూ కొత్తగా పాటలు రాసేవారందరూ వేటూరి పాటలను కనీసం వెయ్యి చదవాలన్నారు. తనను బాగాప్రోత్సహించి ఇటీవల కాలం చేసిన తన తల్లికి ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తనకు చిన్నప్పటి నుంచి తాత చెప్పిన నీతికథలు, సాహిత్యపద్యాలే ఈ స్థాయికి తీసుకువచ్చాయన్నారు. తను కవితలు రాసి పోస్ట్ చేయాలంటే తల్లే ఎక్కువగా ప్రేరేపించేదన్నారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా అందుకు తగినట్లుగా యువకిరణాన్ని వెతికి పట్టుకుని పురస్కారం ఇవ్వడం ఆనందదాయకమన్నారు. కళాపీఠం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటూరి పురస్కారం రవికుమార్‌కి ఇస్తున్నప్పటికీ ఇది విజయనగర వాసులందరూ ఇస్తున్న పురస్కారంగానే చూడాలన్నారు. సమాజ హిత కార్యక్రమాలకు తామెప్పుడూ ముందుంటామనే భరోసాను కలి్పంచారు. ఈ సందర్భంగా పలువురు గాయనీ,గాయకులు ఆలపించిన చిత్రగీతాలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. నర్తనశాల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గంటి మురళి, బి.రాధికారాణి, భోగరాజు సూర్య లక్ష్మయ్య, ఉప్పు ప్రకాశ్ డాక్టర్ ఎమ్.వెంకటేశ్వరరావు, ఇఆర్.సోమయాజులు, అనిల్ కుమార్, డాక్టర్ ఎ.గోపాలరావు, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment