Aatreya
-
ఆత్రేయ గారు చేసే పనులకు కడుపు కాలిపోయేది.. పాటలు రాయమంటే ఏసీ రూమ్లో గురక పెట్టి పడుకునేవాడు..
-
భాస్కరభట్లకు వేటూరి పురస్కారం
సాక్షి, విజయనగరం : తాత చెప్పిన కథలు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి.. 25 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించాను.. 20 ఏళ్లు పూర్తయింది.. ఆత్రేయ స్మారక కళాపీఠం 20వ వార్షికోత్సవం.. నా కెరీర్ రెండూ 20 ఏళ్లు పూర్తిచేసుకున్నాయి.. విజయనగరం గడ్డపై వేటూరి పురస్కారం పొందడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఆత్రేయ స్మారక కళాపీఠం వార్షికోత్సవం బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. కళాపీఠం ప్రతినిధులు, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చేతుల మీదుగా భాస్కరభట్లకు దుశ్సాలువ కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, బంగారు ఉంగరం, పురస్కారపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత భాస్కరభట్ల మాట్లాడుతూ కొత్తగా పాటలు రాసేవారందరూ వేటూరి పాటలను కనీసం వెయ్యి చదవాలన్నారు. తనను బాగాప్రోత్సహించి ఇటీవల కాలం చేసిన తన తల్లికి ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తనకు చిన్నప్పటి నుంచి తాత చెప్పిన నీతికథలు, సాహిత్యపద్యాలే ఈ స్థాయికి తీసుకువచ్చాయన్నారు. తను కవితలు రాసి పోస్ట్ చేయాలంటే తల్లే ఎక్కువగా ప్రేరేపించేదన్నారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా అందుకు తగినట్లుగా యువకిరణాన్ని వెతికి పట్టుకుని పురస్కారం ఇవ్వడం ఆనందదాయకమన్నారు. కళాపీఠం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటూరి పురస్కారం రవికుమార్కి ఇస్తున్నప్పటికీ ఇది విజయనగర వాసులందరూ ఇస్తున్న పురస్కారంగానే చూడాలన్నారు. సమాజ హిత కార్యక్రమాలకు తామెప్పుడూ ముందుంటామనే భరోసాను కలి్పంచారు. ఈ సందర్భంగా పలువురు గాయనీ,గాయకులు ఆలపించిన చిత్రగీతాలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. నర్తనశాల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గంటి మురళి, బి.రాధికారాణి, భోగరాజు సూర్య లక్ష్మయ్య, ఉప్పు ప్రకాశ్ డాక్టర్ ఎమ్.వెంకటేశ్వరరావు, ఇఆర్.సోమయాజులు, అనిల్ కుమార్, డాక్టర్ ఎ.గోపాలరావు, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఆత్రేయ నాటకాల మీద ఆధికారిక సమీక్ష
ఆత్రేయ అంటే విద్యార్థి దశనుంచీ అభిమానం పెంచుకున్న పి.ఎస్.రెడ్డి, ఆయనను అనుకరిస్తూ పైడిపాల అనే గోత్రనామాన్ని తన కలంపేరుగా నిర్ణయించుకున్నారు. ‘ఆత్రేయ అభిమానిగా ఆయన నాటక సాహిత్యంపై వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలనూ ఖండిస్తూ, ఎత్తిపోతల పరిశోధనల్ని నిరసిస్తూ, సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన పుస్తకాన్ని వెలువరించాలనే తపన ఈ రచనకు ప్రేరణ’ అని ముందుమాటలో తెలియజేశారు. గ్రీకు చరిత్రకారుడు తూసిడైడస్ ‘చరిత్ర రచనకు సత్యశోధన ప్రాణం’ అంటాడు. ఆత్రేయ గురించి అవాస్తవాలతోనూ, అపోహలతోనూ కూడిన గొల్లపూడి మారుతిరావులాంటి ప్రముఖుల రచనలలోని డొల్లతనాన్ని నిర్ద్వంద్వంగా బయటపెట్టిన పైడిపాల కృషి అభినందనీయం. ఈ పుస్తకంలో ఆత్రేయ రచించిన పది నాటకాలూ, పదిహేను నాటికలలోని ఇతివృత్తాలనూ, పాత్రలనూ, సన్నివేశాలనూ క్లుప్తంగా వివరించారు. ఆధునిక తెలుగు నాటక స్వరూప, స్వభావాలను ఎంతగానో ప్రభావితం చేసిన ‘ఎన్.జి.ఓ.’, రకరకాల భయాలతో కూడిన వ్యక్తుల మనస్తత్వ చిత్రణతో కొత్తపోకడలు పోయిన ‘భయం’, మతకలహాల నేపథ్యంలో గాంధీజీ హత్యను ముందుగానే ఊహించిన ‘ఈనాడు’ మొదలైన నాటకాలను విశ్లేషించిన తీరు సమగ్రంగా ఉంది. కేవలం దురభిమానంతో నిండిన స్తోత్రపాఠాలు పాఠకులను పక్కదారి పట్టిస్తాయి. అలా కాకుండా ఈ గ్రంథకర్త తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా ఖండించారు. ఆత్రేయ ఓ పట్టాన అంగీకరించలేకపోయినా, ఆయన రాసిన ‘కప్పలు’ నాటకం జె.బి.ప్రీస్ట్లీ రచించిన ‘లెబర్నమ్ గ్రోవ్’ నాటకానికి అనుసృజన అనే విషయాన్ని తులనాత్మకమైన పరిశీలనతో చక్కగా నిరూపించారు. ఆత్రేయ ప్రాథమికంగా నటుడూ, దర్శకుడూ కావడం వల్ల రంగస్థలానుభవం ఆయన నాటక రచయితగా రాణించడానికి బాగా తోడ్పడింది. సార్వజనీనమైన ఇతివృత్తాలను ఎన్నుకోవడం కూడా ఆత్రేయ విజయాలకు మూలకారణమైంది. సుదీర్ఘమైన ఉపన్యాసాలతో విసుగు పుట్టించకుండా పాత్రోచితమైన, క్లుప్తమైన సంభాషణలతో సన్నివేశాన్ని రక్తికట్టించడం ఆత్రేయ ప్రత్యేకత! అంతవరకూ వచ్చిన సంస్కరణవాద నాటకాల నుంచి విముక్తి కలిగించి ఆధునిక తెలుగు నాటకానికి ఆత్రేయ సామాజిక స్పృహను సంతరింపజేశారు. ఇలాంటి అనేక విశేషాలతోపాటు ఆత్రేయను ప్రభావితం చేసిన నలభైలనాటి తెలుగు నాటకరంగం తీరుతెన్నులను రచయిత సందర్భోచితంగానూ, సవివరంగానూ పొందుపరిచారు. ఇంత చక్కని పుస్తకంలో ఎదురైన అచ్చుతప్పులు మాత్రం మంచి భోజనంలో పంటికింద రాళ్లలా తగులుతూ చిరాకు కలిగించాయి. అదృష్టదీపక్, 94405 28155