ఆత్రేయ నాటకాల మీద ఆధికారిక సమీక్ష | Aatreya drama reviews | Sakshi
Sakshi News home page

ఆత్రేయ నాటకాల మీద ఆధికారిక సమీక్ష

Published Mon, Feb 1 2016 12:39 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Aatreya drama reviews

ఆత్రేయ అంటే విద్యార్థి దశనుంచీ అభిమానం పెంచుకున్న పి.ఎస్.రెడ్డి, ఆయనను అనుకరిస్తూ పైడిపాల అనే గోత్రనామాన్ని తన కలంపేరుగా నిర్ణయించుకున్నారు. ‘ఆత్రేయ అభిమానిగా ఆయన నాటక సాహిత్యంపై వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలనూ ఖండిస్తూ, ఎత్తిపోతల పరిశోధనల్ని నిరసిస్తూ, సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన పుస్తకాన్ని వెలువరించాలనే తపన ఈ రచనకు ప్రేరణ’ అని ముందుమాటలో తెలియజేశారు. గ్రీకు చరిత్రకారుడు తూసిడైడస్ ‘చరిత్ర రచనకు సత్యశోధన ప్రాణం’ అంటాడు. ఆత్రేయ గురించి అవాస్తవాలతోనూ, అపోహలతోనూ కూడిన గొల్లపూడి మారుతిరావులాంటి ప్రముఖుల రచనలలోని డొల్లతనాన్ని నిర్ద్వంద్వంగా బయటపెట్టిన పైడిపాల కృషి అభినందనీయం.

ఈ పుస్తకంలో ఆత్రేయ రచించిన పది నాటకాలూ, పదిహేను నాటికలలోని ఇతివృత్తాలనూ, పాత్రలనూ, సన్నివేశాలనూ క్లుప్తంగా వివరించారు. ఆధునిక తెలుగు నాటక స్వరూప, స్వభావాలను ఎంతగానో ప్రభావితం చేసిన ‘ఎన్.జి.ఓ.’, రకరకాల భయాలతో కూడిన వ్యక్తుల మనస్తత్వ చిత్రణతో కొత్తపోకడలు పోయిన ‘భయం’, మతకలహాల నేపథ్యంలో గాంధీజీ హత్యను ముందుగానే ఊహించిన ‘ఈనాడు’ మొదలైన నాటకాలను విశ్లేషించిన తీరు సమగ్రంగా ఉంది. కేవలం దురభిమానంతో నిండిన స్తోత్రపాఠాలు పాఠకులను పక్కదారి పట్టిస్తాయి. అలా కాకుండా ఈ గ్రంథకర్త తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా ఖండించారు. ఆత్రేయ ఓ పట్టాన అంగీకరించలేకపోయినా, ఆయన రాసిన ‘కప్పలు’ నాటకం జె.బి.ప్రీస్ట్‌లీ రచించిన ‘లెబర్నమ్ గ్రోవ్’ నాటకానికి అనుసృజన అనే విషయాన్ని తులనాత్మకమైన పరిశీలనతో చక్కగా నిరూపించారు.

ఆత్రేయ ప్రాథమికంగా నటుడూ, దర్శకుడూ కావడం వల్ల రంగస్థలానుభవం ఆయన నాటక రచయితగా రాణించడానికి బాగా తోడ్పడింది. సార్వజనీనమైన ఇతివృత్తాలను ఎన్నుకోవడం కూడా ఆత్రేయ విజయాలకు మూలకారణమైంది. సుదీర్ఘమైన ఉపన్యాసాలతో విసుగు పుట్టించకుండా పాత్రోచితమైన, క్లుప్తమైన సంభాషణలతో సన్నివేశాన్ని రక్తికట్టించడం ఆత్రేయ ప్రత్యేకత! అంతవరకూ వచ్చిన సంస్కరణవాద నాటకాల నుంచి విముక్తి కలిగించి ఆధునిక తెలుగు నాటకానికి ఆత్రేయ సామాజిక స్పృహను సంతరింపజేశారు. ఇలాంటి అనేక విశేషాలతోపాటు ఆత్రేయను ప్రభావితం చేసిన నలభైలనాటి తెలుగు నాటకరంగం తీరుతెన్నులను రచయిత సందర్భోచితంగానూ, సవివరంగానూ పొందుపరిచారు.

ఇంత చక్కని పుస్తకంలో ఎదురైన అచ్చుతప్పులు మాత్రం మంచి భోజనంలో పంటికింద రాళ్లలా తగులుతూ చిరాకు కలిగించాయి.    
అదృష్టదీపక్, 94405 28155

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement