Bhaskarabhatla Ravikumar
-
భాస్కరభట్లకు వేటూరి పురస్కారం
సాక్షి, విజయనగరం : తాత చెప్పిన కథలు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి.. 25 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించాను.. 20 ఏళ్లు పూర్తయింది.. ఆత్రేయ స్మారక కళాపీఠం 20వ వార్షికోత్సవం.. నా కెరీర్ రెండూ 20 ఏళ్లు పూర్తిచేసుకున్నాయి.. విజయనగరం గడ్డపై వేటూరి పురస్కారం పొందడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఆత్రేయ స్మారక కళాపీఠం వార్షికోత్సవం బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. కళాపీఠం ప్రతినిధులు, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చేతుల మీదుగా భాస్కరభట్లకు దుశ్సాలువ కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, బంగారు ఉంగరం, పురస్కారపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత భాస్కరభట్ల మాట్లాడుతూ కొత్తగా పాటలు రాసేవారందరూ వేటూరి పాటలను కనీసం వెయ్యి చదవాలన్నారు. తనను బాగాప్రోత్సహించి ఇటీవల కాలం చేసిన తన తల్లికి ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తనకు చిన్నప్పటి నుంచి తాత చెప్పిన నీతికథలు, సాహిత్యపద్యాలే ఈ స్థాయికి తీసుకువచ్చాయన్నారు. తను కవితలు రాసి పోస్ట్ చేయాలంటే తల్లే ఎక్కువగా ప్రేరేపించేదన్నారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా అందుకు తగినట్లుగా యువకిరణాన్ని వెతికి పట్టుకుని పురస్కారం ఇవ్వడం ఆనందదాయకమన్నారు. కళాపీఠం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటూరి పురస్కారం రవికుమార్కి ఇస్తున్నప్పటికీ ఇది విజయనగర వాసులందరూ ఇస్తున్న పురస్కారంగానే చూడాలన్నారు. సమాజ హిత కార్యక్రమాలకు తామెప్పుడూ ముందుంటామనే భరోసాను కలి్పంచారు. ఈ సందర్భంగా పలువురు గాయనీ,గాయకులు ఆలపించిన చిత్రగీతాలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. నర్తనశాల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గంటి మురళి, బి.రాధికారాణి, భోగరాజు సూర్య లక్ష్మయ్య, ఉప్పు ప్రకాశ్ డాక్టర్ ఎమ్.వెంకటేశ్వరరావు, ఇఆర్.సోమయాజులు, అనిల్ కుమార్, డాక్టర్ ఎ.గోపాలరావు, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
భాస్కరభట్లకు మాతృవియోగం
రాజమహేంద్రవరం : ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కరభట్ల పెద్ద కుమారుడు. విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం జరిగాయి. ఆమె చితికి భాస్కరభట్ల నిప్పంటించారు. పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు భాస్కరభట్లకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: సీతాకోకచిలుక ... సోయగాల చినుక ముద్దు ముద్దుగున్నవే నువ్వు ఓసి కన్నెగోపిక తుళ్లి తుళ్లి పడక కొంగు ముడివేసుకో నువ్వు ఆమె: కొనికా కెమెరాలో బందీలే అవుదామా కొల్లేటి సరసుల్లో స్నానాలే చేద్దామా బృం: జింగిచక హ జింగి జింగిచక (4) ॥ చరణం : 1 అ: ఓ రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి నింగిని చూసేద్దామా జాబిలమ్మను చేరి జోల పాడేద్దామా ఆ: చేపలనడిగి మొప్పలు తెచ్చి ఈతలు కొట్టేదాము సాగరాలే దాటి సాటి లేరందాము అ: మొదటి చూపుకే అలలా పుట్టుకొచ్చు ఈ ప్రేమ ఆ: చివరి వరకు ఊపిరిగా తోడు ఉండదా ప్రేమ అ: ఓ... పంచెవన్నెల చిలక రెక్కపై పచ్చతోరణం ప్రేమ ఆ: తామరాకుపై నీటిబొట్టులా తళుకుమంటది ప్రేమ ॥ చరణం : 2 అ: ఓ వానజల్లులో దోసిలి పట్టి గజగజ వణికేద్దామా పడవల బొమ్మలు చేసి చిటుకున వదిలేద్దామా ఆ: చిరుతల వేగం అరువుకు అడిగి గబగబ ఉరికేద్దాము ఊరులన్నీ తిరిగి జోరు చూపిద్దాము అ: రెండు గుండెల నడుమ రాయబారమీ ప్రేమ ఆ: నిండుకుండలా ఎపుడూ తొణికిపోదు ఈ ప్రేమ అ: ఓ... కోనసీమలో కొబ్బరాకులా ముద్దుగుంటది ప్రేమ ఆ: అరకు లోయలో చిలిపిగాలిలా కమ్ముకుంటది ప్రేమ ॥ చిత్రం : ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : భాస్కరభట్ల రవికుమార్ సంగీతం : చక్రి, గానం : చక్రి, కౌసల్య, బృందం -
మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!
నాకు చిన్నప్పటి నుండి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాటల్లో నేను ఎక్కువగా విన్న పాట శ్రీకారం (1996)లో ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’. మానవీయ కోణంలో, బతుకుపట్ల భరోసా ఇచ్చి, ఆశావాదం నింపే పాటలను రాయడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి పాటలను చూసే నేను ఆయనను గురువుగా భావిస్తాను. యువతరానికి ఒక సందేశాన్ని, సందేశంలా కాకుండా ఎలా చెబితే యువతరం వెంటనే స్పందిస్తుందో మనసుకు తాకే సరళమైన పదాలతో రాయడం ఆయన శైలి. ఈ మధ్య యువతరంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వల్ల ప్రతి చిన్న విషయానికి నీరసించి నీరుగారడం కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల వలనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ అత్యాచారానికి గురై, మానసిక వేదనకు లోనవుతుంది. ‘ఇక నాకు చావే శరణ్యం’ అనుకొని ఆత్మహత్య చేసుకోబోయే తరుణంలో హీరో ఆమెను ఓదారుస్తూ, ధైర్యం నింపి బతుకుమీద ఆశ కలిగేటట్లు చేస్తాడు. ఆ సందర్భంలో వచ్చిన పాటే ఇది. మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు/ కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు/ ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది/ వేటాడు వేళతో పోరాడమన్నది... అనే పల్లవిలో మొదటి వాక్యమే అద్భుతమైన స్టేట్ మెంట్. మనసుకు బాధగా ఉందని, ఇక మరణం ఒకటే దారి అనుకొని వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ పాట వినాలి. నీ కన్నీళ్లను తుడిచేవారు ఏ ఒక్కరూ లేరని చితిమంటలకు స్వాగతం పలకకూడదు. నిండుగా నూరేళ్లు సంతోషంగా జీవించాలి. జీవించినంత కాలం ఎటువంటి సమస్యలు వచ్చినా, కాలానికి ఎదురెళ్లి పోరాడి కాలాతీతవ్యక్తులుగా నిలిచిపోవాలి. అప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది. కలసి రాని కాలమెంత కాటేస్తున్నా చలి చిదిమేస్తున్నా/ కూలిపోదు వేరు ఉన్న తరువేదైనా తనువే మోడైనా/ మాను జన్మకన్న మనిషి ఎంత మిన్న/ ఊపిరిని పోసే ఆడదానివమ్మా/ బేలవై నువ్వు కూలితే నేలపై ప్రాణముండదమ్మా... అనే మొదటి చరణంలో ఆరారు కాలాలు రకరకాలు ఋతువులు మారుతున్నా, చచ్చేంత చలి చిదిమేస్తున్నా మోడైన చెట్టు తనకు తాను కూలిపోదు. ఆ చెట్టు కంటే గొప్ప బతుకు మనిషిదే కదా! ఈ లోకమనే మహావృక్షానికి తల్లి వేరువు నువ్వు... నువ్వే కూలిపోతే భూమ్మీద ప్రాణి అనేదే ఉండదు. జీవరాశికి పుట్టుకకు కారణమైన ఆడదానివి నువ్వు... నువ్వే చావును ఆశ్రయిస్తే అది ఎంతవరకు సమంజసం. ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు పరిమార్చవే కీడు/ కాళివైతే కాలి కింద అణుగును చూడు నిను అణిచేవాడు/ మృత్యువును మించే హాని ఎక్కడుంది/ ఎంత గాయమైనా మాని తీరుతుంది/ అందుకే పద ముందుకే లోకమే రాదా నీ వెనకే... అనే రెండవ చరణంలో నీ ఆయుష్షునీ చావులా కాకుండా ఆయుధంగా మార్చుకుంటే ఏ కీడు దరిజేరదు. నువు కాళికవై పోరాడితే నిను అణిచేవాడు ఎప్పటికీ నీ కాలి కిందే ఉంటాడు. సృష్టిలో మనిషికి హానికారమైనది మరణమొక్కటే దాని ముందు ఎంతగాయమైనా చిన్నదే కదా! ఏదో ఒకరోజు మానుతుంది కదా అందుకే ఎటువంటి ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తే అది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. నిన్ను చూసి ఈ లోకం గర్విస్తుంది. జీవితంలో ఓడిపోయానని, సమస్యలు చుట్టుముట్టాయని ఆత్మహత్యకు పాల్పడేవారికి ఈ పాట ఒక మేలుకొలుపు. ఈ పాట వింటే ఆత్మహత్యలు ఆగిపోతాయని నా నమ్మకం. ఈ పాటకు ఇళయరాజా బాణీ, జేసుదాస్ స్వరం మరింత బలం చేకూర్చాయనడంలో అతిశయోక్తి లేదు. - సంభాషణ: నాగేశ్ -
భాస్కరుడి లలితగీతం
ఆమెని చూడగానే... ‘గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే!’ అని పాడుకుంది అబ్బాయి మనసు. ‘బొమ్మని గీస్తే నీలా ఉంది..?’ అని కూడా అనుకుంది. ‘రామసక్కని బంగారుబొమ్మ...’ అంటూ స్పీడ్ పెంచేసి ‘సారొస్తారొస్తారే.. వస్తారొస్తారొస్తారే...’ అని అమ్మాయిచేతా అనిపించింది. ఆ అబ్బాయి భాస్కరభట్ల రవికుమార్. ఆ అమ్మాయి అతని అర్ధాంగి లలిత. పాటల రచయితగా ఆయన శ్రీకారం చుట్టకముందే ప్రేమకు పల్లవి, చరణంలా వారు కలిసిపోయారు. కృతికి హంసపాదులా, గీతానికి శ్రుతితప్పడంలా కాపురంలో అప్పుడప్పుడూ వచ్చే అన్యోన్య కలహాల్లో... పరిస్థితిని చక్కదిద్దేలా సర్దుబాట్లూ అవసరమే!’’ అని చెప్పిన ఈ జంట పాడిన యుగళగీతమే ఈవారం మనసే జతగా... అబ్బాయి పుట్టింది శ్రీకాకుళంలో. ఐదుగురు తోబుట్టువుల మధ్య పెరిగింది రాజమండ్రిలో. సినిమా జర్నలిస్ట్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం. ఆ తర్వాత సినీ గీత రచయితగా ప్రయాణం. అమ్మాయి స్వస్థలం వరంగల్. ఇంటికి పెద్దకూతురు. ప్రాంతాలు వేరు. భావాలు వేరు. కులాలు వేరు. ఆర్థిక పరిస్థితులు వేరు. అనుకోకుండా కలుసుకున్నారు. మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి (ఆగస్టు 13, 1998) పెళ్లి చేసుకున్నారు. వీరికి అమంత, సంహిత ఇద్దరు సంతానం. ఇద్దరివైపు మాటవరసకు పలకరింపులే తప్ప, సహాయ సహకారాలు లేవు. ‘అభిరుచుల నుంచి అభిప్రాయాల దాకా అన్నింటా భిన్నం’ అంటున్న వీరు పదిహేనేళ్లుగా కలిసుంటున్నారు. నీ కళ్లతోటి నా కళ్లలోకి చూస్తేనే చంద్రోదయం... ‘ఈ పాటలాగే నా మనసెరిగి నడుచుకుంటూ నా జీవితంలో వెన్నెలలు నింపిన వ్యక్తి భార్యగా లభించడం నా అదృష్టం. పదిహేనేళ్ల క్రితం లలిత నా జీవితంలోకి అడుగుపెట్టి ఉండకపోతే ఈ రోజు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవాడిని. పెళ్లయినకొత్తలోనే గీత రచయిత కావాలనే నా అభిలాషను అర్థం చేసుకొని, ఉద్యోగం వదులుకోమని సలహా ఇచ్చింది. ఆ సమయంలో లలిత ఇచ్చిన సహకారం ఎన్నటికీ మరవలేను. ఇల్లు గడవడానికి ఇతరత్రా ఆదాయవనరులేవీ లేవు. సెకండ్ హ్యాండ్ ఇంగ్లిష్ పుస్తకాలు, మాగజీన్లను మీద కొనుక్కొస్తే, వాటిని లలితే తెలుగు అనువాదం చేసి ఇచ్చేది. వాటికి నేను లీడ్ రాసి, ఫొటో జత చేసి అన్ని పత్రికాఫీసులకు తిరిగేవాడిని. అలా మంచి ఆదాయం సంపాదించాం. దాంతో ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకున్న అభిరుచికి పదునుపెట్టే అవకాశం, సమయం దొరికింది. ఐదారు నెలలు ఇద్దరం కలిసి కష్టపడ్డాం. తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో నాకు ఓ ఆధారం దొరికింది. అప్పటినుంచి తను ఇంటిని చక్కదిద్దుకుంటుంటే... నేను పాటలు రాసుకుంటూ జాలీగా గడిపేస్తున్నా. ఆలుమగలు ఒకరికోసం ఒకరుగా ఉంటే, ఎంతటి కష్టమైనా దూదిపింజే అవుతుందని స్వానుభవంతో తెలుసుకున్నాను’’ అంటూ తమ సంసార ప్రయాణపు తొలి అడుగులో పంచుకున్న కష్టసుఖాలను వివరించారు. అడుగునవుతాను నీ వెంట నేను... ‘‘ఈ పదాల అల్లికలాగే ఇన్నేళ్లూ ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉన్నాం. అప్పుడప్పుడు మా మధ్య చోటుచేసుకునే చిన్న చిన్న గ్యాపులను మా ఇద్దరిలో ఎవరో ఒకరం పూరించుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాం’’ అంటూ తమ సంసారంలోని సరాగాలను వినిపించారు లలిత. ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం... ‘పదహారేళ్ల క్రితం.. అచ్చు మా మనసు భాష ఇలాగే ఉంది. అప్పటికి నేను సినిమా జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వరంగల్‌లో ఓ సినిమా హీరోయిన్ హాజరయ్యే ఫంక్షన్‌ని కవర్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ లలితను చూశాను. అప్పటికే బి.ఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది తను. ఫంక్షన్ మొత్తం తానే అయినట్టుగా తిరుగుతున్న లలిత నాకు బాగా నచ్చింది. హైదరాబాద్ వచ్చాక అడ్రస్ కనుక్కొని ఉత్తరం రాశాను’ అంటూ తమ ప్రేమ ప్రయాణాన్ని భాస్కరభట్ల చెబుతుంటే లలిత అందుకుని - ‘‘ఆఫీస్‌కు వెళ్లేసరికి వారానికి రెండు, మూడు ఉత్తరాలు నా కోసం రెడీగా ఉండేవి. ఉత్తరాలు రాస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ అక్షరాలు, పదాలు నన్ను అమితంగా ఆకట్టుకునేవి. తిరుగు ఉత్తరాలు రాసేలా చేశాయి. ఫలితంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నమ్మకం కలిగింది. ఓ రోజు పెళ్లి పట్ల తన అభిప్రాయం తెలపమని నేనే రాశాను. వచ్చి కలిశారు. అవి జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కులాలు, ఉద్యోగాలు, సర్దుబాట్లు... ఇద్దరం మాట్లాడుకొని, ఇంట్లోవారు ఒప్పుకోకపోతే స్నేహంగానైనా ఉండాలనుకుని వెళ్లిపోయాం. కాని మరుసటి రోజు ఉదయమే ఈయన వచ్చి, పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్నారు. వారిని ఒప్పించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది’’ అంటూ ఉద్వేగంతో చెప్పారు లలిత. తోడునీడల పందిరి... ఇల్లు ఆహ్లాదంగా కనిపించాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఒకరి బాధకు ఒకరి ఓదార్పు కావాలి. దీని గురించి ప్రస్తావిస్తూ- ‘‘ఎప్పుడైనా రికార్డింగ్‌లో నా పాట ఓకే కాకపోతే, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు లలిత ఇచ్చే మనోధైర్యం మాటల్లో చెప్పలేనిది. ‘నీ పాట వినే అదృష్టం వారికి లేదు. వదిలేయ్ నాన్నా’ అంటుంది. ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. మరో పెద్ద ఛాయిస్ వస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. ఇలా చాలా విషయాల్లో లలిత మా అమ్మను తలపిస్తుంది’’ అన్నారు భాస్కరభట్ల. బాధ్యతల బంధం... ‘‘ఇన్నేళ్ల జీవితంలో అల్లకల్లోలమయిన పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కారణం ఈయన ప్లానింగ్. మమ్మల్నెప్పుడూ సెక్యూర్డ్‌గా ఉంచాలనుకుంటారు. పనిలోనూ, డబ్బు విషయంలోనూ చాలా పక్కాగా ఉంటారు. ఇద్దరికిద్దరం కానుకలు ఇచ్చుకోవాలి, బాధ్యతలు వదిలించుకోవాలి... అనుకోం. ఇంటి సరుకులు తేవడం దగ్గర్నుంచి, అవసరమైన వస్తువుల వరకూ పిల్లలనూ వెంట తీసుకెళ్లి తెచ్చుకుంటాం. ఆ సమయంలో పిల్లలకు ఏ వస్తువు ఎంతవరకు అవసరం అనేది తెలిసి వస్తుందని మా ఇద్దరి నమ్మకం. అవసరం ఉందనుకుంటే రూపాయికి వచ్చే వస్తువు పదివేలైనా పెడతాం. అవసరం కానిదనుకుంటే పదివేల రూపాయల వస్తువు రూపాయికి వస్తుందన్నా కొనం. డబ్బు ఎంతవరకు, ఎలా ఖర్చుపెట్టాలనేది మా పద్ధతుల ద్వారా పిల్లలకు తెలియచేస్తుంటాం. వాళ్లూ చక్కగా అర్థం చేసుకుంటారు. గొప్పకోసం పెద్ద పెద్ద స్కూల్స్‌లో వేయాలనుకోం. బాగా చదవాలని అనుకుంటాం. మా నిర్ణయాలు, అలవాట్ల వల్ల పిల్లలు స్కూల్లో అన్నింటా ముందుంటారు. భార్యాభర్తల బంధం బాగుంటేనే పిల్లల ఎదుగుదల ఆశించిన విధంగా ఉంటుంది’’ అని వివరించారు లలిత. ‘‘భార్యాభర్తల మాటపట్టింపులను మూడోవ్యక్తికి చెప్పకూడదు. ఎందుకంటే అవి ఎక్కువసేపు నిలబడవు. నెమ్మదిగా సర్దుబాట్లు చేసుకొని, అన్యోన్యంగా ఉంటాం. మూడో వ్యక్తికి చెప్పడం వలన వారి దగ్గర చులకన అవుతాం. అలాగే కోపతాపాలు, భావోద్వేగాలు చోటుచేసుకోవడం సహజమే. మనసెరిగి సర్దుకుపోవడమే సమంజసం’’ అని తెలిపిన ఈ జంట. - నిర్మలారెడ్డి, సాక్షిఫీచర్స్ ప్రతినిధి ‘నా పాటలకు మొదటి శ్రోత లలితే! పదాల అల్లికలో నేను కుస్తీ పడుతుంటే తను అందించిన పలుకులెన్నో ఉన్నాయి. - భాస్కరభట్ల ఈయన మదిలో కొత్తపదం తట్టిందంటే ఎంత పనిలో ఉన్నా వదిలేసి రావలసిందే! పనికన్నా పదం ముఖ్యం కాబట్టి మొదటి ప్రాధాన్యత పదానికే ఇస్తుంటాను. - లలిత