నీటి కొరతపై అధ్యయనం చేయండి: ఉపరాష్ట్రపతి | Vice President Venkaiah Naidu Urges To NITI Aayog In Udayagiri Water | Sakshi
Sakshi News home page

నీటి కొరతపై అధ్యయనం చేయండి: ఉపరాష్ట్రపతి

Published Mon, May 25 2020 3:49 PM | Last Updated on Mon, May 25 2020 6:42 PM

Vice President Venkaiah Naidu Urges To NITI Aayog In Udayagiri Water - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సోమవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి శ్రీ యూపీ సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరువుపీడిత ప్రాంతమైన ఉదయగిరికి తాగు, సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

లాక్ డౌన్ సమయంలో..  ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా (1978లో) ఎన్నికైన ఉదయగిరి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వారు.. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితులను ఉపరాష్ట్రపతికి ఏకరువుపెట్టారు. భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. వరుసగా ఏడో ఏడాదీ సరిగ్గా వర్షాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచైనా లేదా.. సోమశిల ప్రాజెక్టు నుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు ఉపరాష్ట్రపతిని కోరారు.

ఈ నేపథ్యంలో జరిగిన సోమవారం నాటి సమావేశంలో.. ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ అధికారుల బృందం ఉదయగిరిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడితే వాస్తవ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు.

దీనికి అధికారులు స్పందిస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలుచూసుకుని ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి.. సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పర్యటన అనంతరం తదుపరి వివరాలతో మరోసారి కలుస్తామని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావు కూడా పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement