సుబ్బన్న: ఏంది రామన్నా ఈ విడ్డూరం.. కుర్చీలు, సోఫాలు ఎత్తుకురావడమేందన్నా.. ఇదంతా నిజమేనంటావా..
రామన్న: నువ్వు మాట్లాడేది మన నాయకుడు కోడెల శివప్రసాద్ గురించేనా ?
సుబ్బన్న: అవును రామన్నా.. ఆయన గురించే.. రెండు, మూడు రోజులుగా ఒకటే వార్తలు ఏవో సామాను ఎత్తుకొచ్చాడంట.
రామన్న: అవునురా.. నిజమే.. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్ సామగ్రి ఇంటికేసుకొచ్చాడు.. ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా..
సుబ్బన్న: ఆ సామానోదే ఇక్కడ మన ఊళ్లో కూడా దొరుకుతాయి కదా.. ఇదేం పాడు బుద్ధన్నా.
రామన్న: ఏం చెప్పమంటావురా.. ఆయన మన నాయకుడు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.. ఐదేళ్లు స్పీకర్‌గా వెలగబెట్టినప్పుడు ఆయన కొడుకు, కూతురు అడ్డగోలు అక్రమాలు, అవినీతి, వసూళ్లు, దందాలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడ్డారు. వాళ్లను తండ్రిగా మందలించాల్సిందిపోయి అధికారంతో కోడెల కొమ్ముకాశారు. చివరకు ఆయన ధనదాహంతో స్పీకర్ పదవికే మచ్చ తెచ్చారు.
సుబ్బన్న: అవునన్నో.. వాళ్ల అక్రమాలు కేసుల రూపంలో గుట్టలు పగులుతున్నాయి. ఇన్నాళ్లకు ఆ కుటుంబం పాపం పండింది. ఇక కోడెల ఇంటి ఛాయలికి కూడా వెళ్లేది లేదన్నా.. ఏమంటావ్..
రామన్న: నువ్వు ఇప్పుడంటున్నావ్.. మనోళ్లంతా ఆయనకు గుడ్ బై చెప్పి చాలా రోజులైంది. కేట్యాక్స్ బాధితుల కన్నీళ్లే వాళ్లకు శాపంగా మారాయి. చివరికి వాళ్ల పాపాలే నీడలా వెంటాడుతున్నాయి.
సాక్షి, గుంటూరు : అధికారం అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన పాపాల పుట్ట పగులుతోంది. ప్రభుత్వం మారిన నెలల వ్యవధిలోనే రోజుకొక అవినీతి బాగోతం బయటపడుతోంది. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా కోడెల కుటుంబం కూడా వారిని నమ్ముకున్నోళ్లను సైతం దోచుకున్నారు. అధికార బలంతో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. గత ఐదేళ్లలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇప్పటికే కే–ట్యాక్స్ వసూలు చేసిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఊరు విడిచి పరారయ్యారు. కోడెల శివప్రసాద్ మాత్రం పక్కనుండే నేతలు సైతం దూరమవడంతో ఏకాకిగా మారారు.
సీనియర్ రాజకీయ నేత అయిన కోడెల శివప్రసాదరావు రాష్ట్రంలో అనేక పదవులు చేపట్టారు. తొలి నుంచి అధికారం అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ వచ్చారు. గత ఐదేళ్లలో ఇవి శృతి మించాయి. స్పీకర్ పదవిలో ఉంటున్నప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ ఆ పదవికే కళంకం తెచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొన్న కుమారుడు కోడెల శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందినకాడికి దోచుకున్నారు. కోడెల కుటుంబం దోపిడీకి బలైన వారిలో అధిక శాతం టీడీపీ వారే కావడం గమనార్హం. ప్రభుత్వం మారిన తర్వాత కే ట్యాక్స్ బాధితులంతా పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కారు. ఉద్యోగాల పేరిట మోసాలు, భూకబ్జాలు, ల్యాండ్ కన్వర్షన్ అనుమతుల విషయంలో బలవంతపు వసూళ్లన్నీ బహిర్గతమయ్యాయి.
రెండు నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతోసహా అతని కుమారుడు, కుమార్తె వారి అనుచరులపై 19 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో శివరామ్, విజయలక్ష్మిలు వారి అనుచరులతో అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా కోర్టు సైతం నిందితులకు బెయిల్ నిరాకరించింది. కే ట్యాక్స్ కేసుల వ్యవహారం మరువక ముందే కోడెల శివరామ్ తన ద్విచక్రవాహన గౌతం షోరూంలో వాహనాల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పన్నును ఎగ్గొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు సచివాలయం మార్పు సమయంలో మాజీ స్పీకర్ కోడెల విలువైన సామగ్రిని అక్రమంగా తరలించుకు వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఛీకొడుతున్న ప్రజానీకం..
ఒకప్పుడు కోడెలను ఆధిరించిన ప్రజలే ప్రస్తుతం ఛీకొడుతున్నారు. సేవ్ సత్తెనపల్లి, క్విట్ కోడెల అంటూ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ప్రజానీకం సాక్షాత్తు చంద్రబాబు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లిలో మొఖం చాటేసిన కోడెల గత కొన్ని రోజులుగా నరసరావుపేటకు వచ్చి పోతున్నారు. కే ట్యాక్స్ బాధితులు ఆగ్రహంగా ఉండటంతో కోడెల రాకపోకలను వారి అనుచరులు గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో గతంలో తన ఎన్‌సీవీ కేబుల్‌ను శివరామ్ దౌర్జన్యంగా ఆక్రమించి కే ఛానల్‌గా మార్చుకున్న వైనంపై ఆ కేబుల్ ఎండీ లాం కోటేశ్వరరావు సోమవారం మాజీ స్పీకర్ కోడెల ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కోడెల బయటకు వచ్చేందుకు సాహసించలేదు. తన అనుచరులకు ఫోన్ చేసి పిలిచినా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పార్టీ నాయకులను, పోలీస్ అధికారులను ప్రాధేయపడినట్లు సమాచారం.
ఒక్కరూ తోడు లేరు
కోడెల కుటుంబం చేసిన (కేట్యాక్స్) బలవంతపు వసూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండటంతో ధైర్యంగా ముందుకొస్తున్నారు. అయితే ఇదంతా తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారని కోడెల రాజకీయంగా సానుభూతి పొందేందుకు హై కమాండ్ వద్ద ప్రయత్నం చేసి భంగపడ్డారు. కోడెల కుటుంబంపై నమోదవుతున్న కేసుల వ్యవహారంలో ఖండన ఇచ్చేందుకు చంద్రబాబు సైతం వెనకాడారు. ఇక జిల్లా టీడీపీ నాయకులైతే ఈ విషయంలో నోరు తెరవడానికి భయపడుతున్నారు.
దీంతో ఒకప్పుడు రాజకీయంగా గిట్టని వారిని కూడా కలిసి తనకు సహకరించాల్సిందిగా కోడెల ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. కేసుల విషయంలో తెలుగుదేశం అధిష్టానం స్పందించకపోవటంతో చివరకు బీజేపీలోకి చేరేందుకు కోడెల ప్రయత్నాలు చేసి భంగపాటుకు గురైనట్లు సమాచారం. తాజాగా కోడెల బాధితుడు లాం కోటేశ్వరరావు తనకు జరిగిన నష్టంపై చేసిన ఆందోళనను సైతం ఎమ్మెల్యే గోపిరెడ్డిపై నెపం నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడెల ప్రయత్నించారు. దీనిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. చివరికి కోడెల ఏకాకిగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment