సాక్షి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గంలో ఓటమిని జీర్ణించుకోలేక పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. పరిటాల కుటుంబ అరాచకాలపై శనివారం వారు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రామగిరి మండలం నసనకోటలో ఈ నెల 4న వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వెంకటాపురం నుంచి పరిటాల శ్రీరామ్ అనుచరులు ట్రాక్టర్‌లు, వాహనాలలో 50 మందికి పైగా వచ్చి మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బోయ సూర్యం అనే వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర జరిగిందని, అయితే చనిపోయాడనుకోని అతడిని వదిలేసి వెళ్లారని వివరించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని, ప్రాణభయంతో ఇళ్లలోకి పరుగులు తీశామని తెలిపారు.
ఉనికి కోసమే దాడులు
రామగిరి మండలంలో ఉనికి కోల్పోతున్నామనే కారణంతోనే పరిటాల శ్రీరామ్ ఈ దాడులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో కూడా పేరూరు బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చితకబాదారని గుర్తు చేశారు. రామగిరి మండలం తమకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా చంపుతామని బెదిరిస్తున్నారని, అరాచకశక్తిలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నసనకోట గ్రామస్తులు ముత్యాలప్ప, కేశవనారాయణ, రామలింగారెడ్డి, బండారు లింగన్న, ముత్యాలు, మహిళలు రత్న, సావిత్రమ్మ, ముత్యాలమ్మ, రంగమ్మ, పి. ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి : పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు
Comments
Please login to add a commentAdd a comment