
పరవాడ పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారి రేవతి
సాక్షి విశాఖపట్నం , నెట్‌వర్క్: విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల పనితీరు, ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బృందాలు అనంతగిరి, గొలుగొండ, నర్సీపట్నం, రావికమతం, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, దేవరాపల్లి పీహెచ్‌సీల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నదీ లేనిదీ పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలు ఎలా అందిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, ల్యాబ్, మందుల గదులను పరిశీలించారు. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిలెన్స్ అధికారిణి పైల రేవతి ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.ప్రమీలను పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలపై ఆరా తీశారు. నిత్యం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న ఆస్పత్రి పరిసరాల మెరుగుకు చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారి రేవతి సూచించారు.
గొలుగొండలో విజిలెన్స్ అధికారి సత్యకుమార్ వైద్యాధికారి పద్మప్రియను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతగిరిలో సీఐ మల్లికార్జున్ నేతృత్వంలోని అధికారులు వైద్యాధికారి షాహినాబేగంతో మాట్లాడి పూర్తిస్థాయిలో మందులున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. డీఎస్పీ పీఎం నాయుడుతో కూడిన బృందం రావికమతం పీహెచ్‌సీలో తనిఖీలు చేపట్టింది. సరఫరా అయిన మందులు, వాటిలో కాలం చెల్లినవి ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యాధికారి, స్టాఫ్‌నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సహా సగం మంది సిబ్బంది విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదని గుర్తించారు. రాంబిల్లి, అచ్యుతాపురం పీహెచ్‌సీలను విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు తనిఖీ చేశారు. అంతకు ముందు విజిలెన్స్ అధికారి సత్యవతి రికార్డులు పరిశీలించారు. ముందుగా తయారుచేసుకున్న చెక్‌లిస్ట్ ప్రకారం వివిధ అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలు, వసతిగృహాల్లో నెలవారీ వైద్య శిబిరాలు నిర్వహించిందీ లేనిదీ తెలుసుకున్నారు. డెంగ్యూ, విష జ్వరాలప్పుడు గ్రామాల్లో చేపట్టిన వైద్యశిబిరాల్లో వినియోగించిన మందుల వివరాలు అడిగారు. ఆస్పత్రి కోసం కొనుగోలు చేసిన పరికరాలను ఆమె పరిశీలించారు.
నర్సీపట్నం మండలం వేములపూడి పీహెచ్‌సీలో విజిలెన్స్ జియాలజిస్ట్ బైరాగినాయుడు తనిఖీలు చేపట్టారు. మందులు, స్టాక్ రిజిస్టర్‌ను సరి చూశారు. ఎంత మంది సిబ్బంది, ఎక్కడెక్కడ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నదీ వైద్యాధికారి ఎ.సౌమ్యను అడిగి తెలుసుకున్నారు. వివిధ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందని వైనాన్ని తెలుసుకున్నారు. అన్ని వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment