
సాక్షి, విజయవాడ: విజయవాడ ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృత సోదాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఈఎస్‌ఐలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవకతవకలపై ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో ఈఎస్‌ఐ అధికారులను విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విజిలెన్స్ అధికారులు వచ్చి.. వివరాలు అడిగి పత్రాలను పరిశీలిస్తున్నారని ఏపీ ఈఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ సామ్రాజ్యం ‘సాక్షి’కి తెలిపారు. అవినీతి జరిగిందా లేదా అనేది వారి విచారణలో తేలుతుందన్నారు. గతంలో ఈఎస్ఐలో అవకతవకలు జరిగాయని గుర్తించి జాయింట్ కలెక్టర్ మాధవిలత ఇద్దరిని సస్పెండ్ చేశారని తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉదయలక్ష్మీ డ్రగ్స్, టెలీ హెల్త్, పర్చేజస్ డిపార్ట్‌మెంట్లను వెరిఫికేషన్ చేశారని చెప్పారు.