సాక్షి, విజయవాడ : తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ఆరేళ్లుగా ఈఎస్‌ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్లుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలనుంచి మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం రూ. 89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ లో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. మిగతా రూ. 51 కోట్లను దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు వాస్తవ ధర కంటే 132 శాతం అధనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. (ఈఎస్‌ఐ స్కాం: తవ్వేకొద్దీ దేవికారాణి అక్రమాలు)
తెలంగాణ ఈఎస్‌ఐ స్కాంలో ముఖ్యపాత్ర పోషించిన సరఫరాదారులే ఈ స్కాంలో కూడా ఉన్నట్లు తేలింది. అప్పటి డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ లోపాటు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్యపాత్ర పోషించారని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తన వాళ్లకు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఈఎస్‌ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. (దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల)
ఈఎస్‌ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. (హెచ్ఐవీ, డయాబెటిస్ కిట్లలో చేతివాటం)
Comments
Please login to add a commentAdd a comment