ఒక భక్తుడు.. 144 లడ్డూలు!
'ఏం నాయనా.. లడ్డూ కావాలా..?' అంటూ అడిగి మరీ వడ్డించడానికి అదేం సాదా సీదా లడ్డూ కాదు! వరల్డ్ మోస్ట్ ఫేమన్. అందుకే మరి.. కోట్ల సంఖ్యలో వచ్చే భక్తులకు సరిపడా అందించాలనే ఉద్దేశంతో పరిమిత సంఖ్యలో అందజేస్తూంటారు ఆలయ నిర్వాహకులు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మనం మాట్లాడుకుంటోంది తిరుమల- తిరుపతి ఏడుకొండలవాడి ప్రసాదం.. నేతి లడ్డూ గురించేనని!
వెంకన్న దర్శనం అనంతరం టోకెన్ల ద్వారా పొందాల్సిన అంతటి ప్రశస్తమైన ప్రసాదం లడ్డూలు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 144 లడ్డూల్ని కలిగి ఉన్న ఓ భక్తుణ్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రాథోడ్గా అతణ్ని గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది.. పరిమితికి మించి లడ్డులు ఎలా దొరికాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గతంలోనూ వార్తలు వినవచ్చిన నేపథ్యంలో కోనేటిరాయుడి అమూల్యమైన ప్రసాదం కొందరు అక్రమంగా పొందుతుండటంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.