బయో ఉత్పత్తుల గోడౌన్‌పై విజిలెన్స్ దాడులు
గుంటూరు క్రైం : బయో ఉత్పత్తులను విక్రయించే కోస్టల్ జిల్లాల బ్రాంచి కార్యాలయం గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా విక్రయాలు కొనసాగిస్తుండడాన్ని గుర్తించారు. రూ.60 లక్షల విలువచేసే 13రకాల బయో ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసి సీజ్‌చేశారు. ఆయా ఉత్పత్తుల శాంపిళ్లను సేకరించారు. బెంగళూరులో తయారైన బయో ఉత్పత్తులకు సంబంధించి కోస్తా జిల్లాలకు సిమ్‌బయాసిస్ ఆగ్రోమేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచి కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో ఉండగా.. ఆర్.అగ్రహారంలో సమీపంలో గోడౌన్ ఉంది. ఈ గోడౌన్‌లో అక్రమంగా బయోఉత్పత్తులు నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావుకు సమాచారం అందడంతో అధికారులను అప్రమత్తం చేశారు. గోడౌన్‌పై దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నిల్వచేసివున్న వివిధ రకాల బయోఉత్పత్తులను పరిశీలించారు. మొత్తం 40 రకాలు ఉండగా వీటిలో రూ.60 లక్షల విలువచేసే 13 రకాల బయో ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతి లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆయా బయో ఉత్పత్తుల విక్రయాలను నిలుపుదలచేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో కె.వెంకట్రావు మాట్లాడుతూ బయో ఉత్పత్తుల తయారీ జరిగిన అనంతరం తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అనుమతి పొందాల్సివుంటుందని ైహైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను సైతం సదరు కంపెనీ ఉల్లంఘిస్తూ అక్రమ విక్రయాలు కొనసాగిస్తోందన్నారు. సేకరించిన శ్యాంపిళ్లను హైదరబాద్‌లోని ల్యాబరేటరీకి పంపుతామని, అవి నాణ్యతాలోపంగా ఉన్నాయని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దాడుల్లో సీఐ ఎ.కిషోర్‌బాబు, ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ శ్రీరాములు, వ్యవసాయాధికారి పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు.