విజయసాయి రెడ్డి బెయిల్‌పై తీర్పు 8కి వాయిదా | Vijay Sai reddy' s bail plea hearing adjourned to Oct 8 | Sakshi
Sakshi News home page

విజయసాయి రెడ్డి బెయిల్‌పై తీర్పు 8కి వాయిదా

Published Sat, Oct 5 2013 6:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Vijay Sai reddy' s bail plea hearing adjourned to Oct 8

సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును ఈనెల 8కి వాయిదా వేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు. విజయసాయిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు కేవలం దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగానే సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసిందని ప్రస్తావించారు. దాదాపు నాలుగు నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆయనపై సీబీఐ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవని అన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏ చిన్న ఆధారాన్నీ సీబీఐ చూపించట్లేదని, బెయిల్‌ను అడ్డుకోవాలనే సీబీఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కోర్టుకు నివేదించారు.
 
  జగన్‌మోహన్‌రెడ్డి, సాయిరెడ్డి ఒకే జైలులో ఉంటే ఆధారాలను మాయం చేసేందుకు కుట్ర పన్నే అవకాశం ఉందన్న సీబీఐ వాదనను ఈ కోర్టు తోసిపుచ్చిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో సాయిరెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు విధించిన షరతులను ఏనాడూ ఉల్లంఘించలేదని నివేదించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. బెయిల్ అనేది ప్రాథమిక హక్కు అని, దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులను నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. అయితే సండూర్ కంపెనీకి చెందిన రికార్డులను సీబీఐకి ఇవ్వరాదని ఆ సంస్థ జీఎం మురళిపై సాయిరెడ్డి ఒత్తిడి తెచ్చారని, దాల్మియా ఉద్యోగి సంజయ్‌మిత్రాపైనా ఇదే తరహా ఒత్తిడి చేశారని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర నివేదించారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి... తన తీర్పును ఈనెల 8కి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement