ఫైనాన్స్ డెరైక్టర్ ప్రసాదరెడ్డినీ విచారించిన ఈడీ
ఆరు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నలు
అన్నిటికీ వివరంగా సమాధానాలు
నేడు మళ్లీ హాజరు కావాలన్న అధికారులు
ఈ నెలలో విచారించటం ఇది నాలుగోసారి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ముమ్మరంగా విచారణ సాగిస్తోంది. ఈ కేసులో ఈడీ ఆదేశాల మేరకు ఆడిటర్ వి.విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాదరెడ్డి సోమవారం ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. ఖాన్ మార్కెట్‌లోని లోక్‌నాయక్ భవన్‌లో గల ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈడీ అధికారులు వీరిద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ మంగళవారం కూడా కొనసాగనుంది. పెట్టుబడుల విషయమై అనేక కోణాల నుంచి అధికారులు వీరికి శరపరంపరగా ప్రశ్నలను సంధించారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సాయిరెడ్డి, ప్రసాదరెడ్డి సవివరంగా సమాధానాలు ఇచ్చారు. అప్పటికీ సంతృప్తి చెందని ఈడీ అధికారులు మంగళవారం ఉదయం మరోసారి రావాలని చెప్పారు.
దర్యాప్తు ముమ్మరం: జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పిలిచి విచారణ సాగిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలియజేశాయి. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తును జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే తాజా విడత దర్యాప్తును అధికారులు జరుపుతున్నారని, దీన్ని త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు ముఖ్యులను పిలిచి ముమ్మర విచారణను సాగిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. ‘‘దర్యాప్తును సాధ్యమైనంత వేగంగా చేయాలనుకుంటున్నాం. అందుకే ప్రస్తుత దఫా విచారణ చేపట్టాక జగతి పబ్లికేషన్స్ సహా వివిధ సంస్థల ముఖ్యులకు సెప్టెంబర్ 23న సమన్లు ఇచ్చాం. వీటి ప్రకారం అక్టోబర్ 8న ఈడీ కార్యాలయంలో విచారణకు జగతి తరఫున ఫైనాన్స్ డెరైక్టర్ ప్రసాదరెడ్డి హాజరయ్యారు.
ఆ రోజంతా ప్రశ్నిం చాక మర్నాడు కూడా విచారణ కొనసాగించాం. తర్వాత మళ్లీ 15న ప్రసాదరెడ్డి ఈడీ ఎదుట హాజరై మేం అడిగిన పత్రాలను అందజేశారు. ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. తరవాత 23న ప్రసాదరెడ్డి మళ్లీ విచారణకు హాజరయ్యారు. సోమవారం మళ్లీ ఈ నెలలో నాలుగోసారి ప్రసాదరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాయిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నెలలో ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు పిలవటం ద్వారా దర్యాప్తును సాధ్యమైనంత ముమ్మరం చేస్తున్నాం’’ అని ఈడీ వర్గాలు తెలియజేశాయి.
ఏకబిగిన ఈడీ విచారణ.. ఈడీ ఎదుట విజయ సాయిరెడ్డి హాజరు
Published Tue, Oct 29 2013 2:19 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement