v. vijay sai reddy
-
పెట్రో ధరలు పెరిగినపుడు వైఎస్ పన్నులు తగ్గించారు
సాక్షి, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెట్రోలు ధరలు పెరిగినపుడు ఆయన ఏం చేశారు? ఇపుడు మీరేం చేస్తున్నారు? అని చంద్రబాబును ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘రోజు రోజుకూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో అటు కేంద్రం... ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎడాపెడా దోచుకోవడం దారుణం. లీటర్ పెట్రోలు ఉత్పత్తికి అయ్యే ఖర్చు సుమారు రూ 30. కానీ వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో వసూలు చేస్తోంది రూ. 45 పైనే. అంతకంటే దారుణం ఉంటుందా? నిత్యావసర సరుకులైన పెట్రోలు, డీజిల్‌తో ప్రభుత్వాలు వ్యాపారం చేయడం సిగ్గు చేటు. ఇదేనా ప్రజా సంక్షేమం? పదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ఏం చేశారు? కేంద్రం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను అమాంతంగా పెంచేస్తే ఆ భారం సామాన్య ప్రజలపై పడకుండా పన్నులను తగ్గించేశారు. అందుకే ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ విషయం మరచి పోయారా చంద్రబాబూ? ఇపుడు మీరేం చేస్తున్నారు?కేంద్రంతో పోటీపడి మరీ పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచుతూ ప్రజలను దండుకుంటూ పోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనంతగా ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వసూలు చేస్తూ ఖజానాను నింపుకుంటున్నారు. నక్కకూ, నాకలోకానికీ పోలికా?’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో విమర్శించారు. మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదా? కేసీఆర్ తన పాలన మీద నమ్మకంతో ముందస్తుకు వెళ్లానని చెబుతున్నారని, చంద్రబాబు మాత్రం అసెంబ్లీ రద్దుకు ఎందుకు జంకుతున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనపై ఆయనకే నమ్మకం లేకపోవడం వల్లే అసెంబ్లీ రద్దుకు జంకుతున్నారని ట్విటర్లో వ్యాఖ్యానించారు. టూరిజం పడకేయడానికి చంద్రబాబే కారణం ఏపీలో పెచ్చరిల్లుతున్న అవినీతి, నేరాల పెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం కారణంగా టూరిజం రంగం పూర్తిగా పడకేసిందని, ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబే కారణమని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో టూరిజం అభివృద్ధికి ఆయన ఏ మాత్రం కృషి చేయలేదు. ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ చంద్రబాబు మనుషులు తక్కువ చేసి చూపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఆస్తుల వేలం ప్రక్రియ జరగాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. అది ఇంతవరకు జరగలేదని చెప్పారు. -
'ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాలి'
-
'ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాలి'
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించింది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తుండగా ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. 'రెండు అంశాలను ఆర్థికమంత్రి దృష్టికి తెస్తా. ఆర్టికల్ 280 గురించి ప్రస్తావించారు. దాని ప్రకారం 14వ ఆర్థిక సంఘం ఇచ్చినవి కేవలం సూచనలు మాత్రమే. దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా, వద్దా అని నిర్ణయించవలసింది ప్రభుత్వమే. ఇప్పటివరకు ఇచ్చిన రాష్ట్రాలన్నింటికీ ప్రభుత్వం నిర్ణయంతోనే ఇచ్చార'ని విజయసాయిరెడ్డి అన్నారు. -
ఔటర్ పై కారు ప్రమాదం విజయసాయిరెడ్డికి గాయాలు
♦ ఘటనలో దుర్గాప్రసాదరాజు తలకూ గాయాలు ♦ ‘అపోలో’లో చికిత్స.. జగన్‌సహా పలువురు నేతల పరామర్శ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డుపై మంగళవారం జరిగిన ప్రమాదంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఎస్.దుర్గాప్రసాదరాజు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. త్రుటిలో ప్రమాదం నుంచి ఇద్దరు నేతలూ క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం వీరు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిరెడ్డి ఎడమ మోకాలికి గాయమైంది. దుర్గాప్రసాదరాజు తలకు ఎడమవైపు గాయాలయ్యాయి. కాకినాడలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్న ప్రత్యేక హోదా సాధన ధర్నాలో పాల్గొనడంకోసం వీరు కారులో మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. అక్కడినుంచి తొలి విమానంలో వీరు రాజమండ్రికి వెళ్లాల్సి ఉంది. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో వెనుకసీట్లో కూర్చున్న ఇరువురు నేతలకు గాయాలయ్యాయి. కారు ముందు సీట్లో కూర్చున్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.దశరథరెడ్డి, డ్రైవర్ సంతోష్‌లకు స్వల్పగాయాలయ్యాయి. హుటాహుటిన అందర్నీ అపోలో ఆసుపత్రికి తరలించగా అత్యవసర చికిత్స చేశారు. సాయిరెడ్డిని కనీసం 3 నుంచి 4 వారాలపాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దుర్గాప్రసాద్రాజుకు తలకు గాయమైందని, ఆయన క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. వైఎస్ జగన్ పరామర్శ.. ప్రమాదవార్త తెలియడంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వెంటనే ఫోన్లో విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాదరాజులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికొచ్చి విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాదరాజులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఈడీ దర్యాప్తుపై నివేదిక కోరండి
ప్రత్యేక కోర్టులో ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి పిటిషన్ దర్యాప్తు పూర్తికాకుండా తుది విచారణతో మా హక్కులకు భంగం కౌంటర్ దాఖలుకు ఈడీని ఆదేశించిన ప్రత్యేక కోర్టు హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌లో దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించేలా ఆదేశించాలని ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జిషీట్ల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో వారి దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చే యాలని కోరారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో నేర విచారణ చట్టం సెక్షన్ 156 (3) రెడ్‌విత్ 159 కింద ఆయన సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ‘‘ఒక అంశంపై దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా తుది విచారణ ప్రారంభిస్తే నిందితుల హక్కులకు విఘాతం కలుగుతుంది. అందువల్ల దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించేలా ఈడీని ఆదేశించండి’’ అని సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి నివేదించారు. ‘‘ఒక అంశానికి సంబంధించి దర్యాప్తు పూర్తయింది. చార్జిషీట్ దాఖలు చేశాం. భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి చార్జిషీట్లు దాఖలు చేయం’’ అని ఈడీ తరఫు న్యాయవాది నివేదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి టి.రజని.. సాయిరెడ్డి అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు. -
ఏకబిగిన ఈడీ విచారణ.. ఈడీ ఎదుట విజయ సాయిరెడ్డి హాజరు
ఫైనాన్స్ డెరైక్టర్ ప్రసాదరెడ్డినీ విచారించిన ఈడీ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నలు అన్నిటికీ వివరంగా సమాధానాలు నేడు మళ్లీ హాజరు కావాలన్న అధికారులు ఈ నెలలో విచారించటం ఇది నాలుగోసారి సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ముమ్మరంగా విచారణ సాగిస్తోంది. ఈ కేసులో ఈడీ ఆదేశాల మేరకు ఆడిటర్ వి.విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాదరెడ్డి సోమవారం ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. ఖాన్ మార్కెట్లోని లోక్‌నాయక్ భవన్లో గల ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈడీ అధికారులు వీరిద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ మంగళవారం కూడా కొనసాగనుంది. పెట్టుబడుల విషయమై అనేక కోణాల నుంచి అధికారులు వీరికి శరపరంపరగా ప్రశ్నలను సంధించారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సాయిరెడ్డి, ప్రసాదరెడ్డి సవివరంగా సమాధానాలు ఇచ్చారు. అప్పటికీ సంతృప్తి చెందని ఈడీ అధికారులు మంగళవారం ఉదయం మరోసారి రావాలని చెప్పారు. దర్యాప్తు ముమ్మరం: జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పిలిచి విచారణ సాగిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలియజేశాయి. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తును జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే తాజా విడత దర్యాప్తును అధికారులు జరుపుతున్నారని, దీన్ని త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు ముఖ్యులను పిలిచి ముమ్మర విచారణను సాగిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. ‘‘దర్యాప్తును సాధ్యమైనంత వేగంగా చేయాలనుకుంటున్నాం. అందుకే ప్రస్తుత దఫా విచారణ చేపట్టాక జగతి పబ్లికేషన్స్ సహా వివిధ సంస్థల ముఖ్యులకు సెప్టెంబర్ 23న సమన్లు ఇచ్చాం. వీటి ప్రకారం అక్టోబర్ 8న ఈడీ కార్యాలయంలో విచారణకు జగతి తరఫున ఫైనాన్స్ డెరైక్టర్ ప్రసాదరెడ్డి హాజరయ్యారు. ఆ రోజంతా ప్రశ్నిం చాక మర్నాడు కూడా విచారణ కొనసాగించాం. తర్వాత మళ్లీ 15న ప్రసాదరెడ్డి ఈడీ ఎదుట హాజరై మేం అడిగిన పత్రాలను అందజేశారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశాం. తరవాత 23న ప్రసాదరెడ్డి మళ్లీ విచారణకు హాజరయ్యారు. సోమవారం మళ్లీ ఈ నెలలో నాలుగోసారి ప్రసాదరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాయిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నెలలో ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు పిలవటం ద్వారా దర్యాప్తును సాధ్యమైనంత ముమ్మరం చేస్తున్నాం’’ అని ఈడీ వర్గాలు తెలియజేశాయి. -
విజయసాయి రెడ్డి బెయిల్‌పై తీర్పు 8కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును ఈనెల 8కి వాయిదా వేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు. విజయసాయిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు కేవలం దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగానే సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసిందని ప్రస్తావించారు. దాదాపు నాలుగు నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆయనపై సీబీఐ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవని అన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏ చిన్న ఆధారాన్నీ సీబీఐ చూపించట్లేదని, బెయిల్‌ను అడ్డుకోవాలనే సీబీఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కోర్టుకు నివేదించారు. జగన్మోహన్రెడ్డి, సాయిరెడ్డి ఒకే జైలులో ఉంటే ఆధారాలను మాయం చేసేందుకు కుట్ర పన్నే అవకాశం ఉందన్న సీబీఐ వాదనను ఈ కోర్టు తోసిపుచ్చిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో సాయిరెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు విధించిన షరతులను ఏనాడూ ఉల్లంఘించలేదని నివేదించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. బెయిల్ అనేది ప్రాథమిక హక్కు అని, దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులను నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. అయితే సండూర్ కంపెనీకి చెందిన రికార్డులను సీబీఐకి ఇవ్వరాదని ఆ సంస్థ జీఎం మురళిపై సాయిరెడ్డి ఒత్తిడి తెచ్చారని, దాల్మియా ఉద్యోగి సంజయ్మిత్రాపైనా ఇదే తరహా ఒత్తిడి చేశారని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర నివేదించారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి... తన తీర్పును ఈనెల 8కి వాయిదా వేశారు. -
బెయిల్‌కు సాయిరెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దర్యాప్తు తుది దశలో ఉందన్న కారణంగానే సుప్రీం కోర్టు తన బెయిల్‌ను రద్దు చేసిందని, ఆ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో 2012 జనవరి 2న సీబీఐ తనను అరెస్టు చేసిందని, దర్యాప్తు పూర్తి చేసి మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 13న బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. అయితే సీబీఐ ఆ బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిందని, దానిని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఆ తర్వాత దర్యాప్తు తుదిదశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు తన బెయిల్‌ను రద్దు చేసిందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని సీబీఐ కోర్టును ఆదేశించిందని తెలిపారు. దాంతో జూన్ 5న ఇదే కోర్టు ముందు లొంగిపోయానని చెప్పారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని పేర్కొంటూ సీబీఐ మెమో దాఖలు చేసిందని తెలిపారు. పారదర్శకమైన తుది విచారణ(ట్రయల్) జరగాలంటే నిందితులకు బెయిల్ ఇవ్వాలని, నిందితులు బయట ఉంటేనే వారి వాదనను సమర్థవంతంగా వినిపించుకునే అవకాశం ఉందని సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తుచేశారు. తాను ప్రత్యక్షంగా, పరోక్షంగా దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని, అన్ని రికార్డులను సీబీఐ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నందున ఆధారాల తారుమారు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని వివరించారు. ఇదే కేసులో మొదటి నిందితుడిగా ఉన్న జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరైందని తెలిపారు. కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్ మంజూరు చేయాలని సాయిరెడ్డి కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు. బెయిలివ్వండి: సునీల్‌రెడ్డి పిటిషన్ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 21 నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నానని, ఆ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఎన్.సునీల్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సునీల్‌రెడ్డి తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మార్ కేసులో సహ నిందితుడు ఇచ్చిన వాం గ్మూలం ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించారని సునీల్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా రిమాండ్‌లో ఉన్న వారందరికీ ఇదే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను 27కు వాయిదా వేశారు. -
జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు
ప్రత్యేక కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్నూ అదే తేదీ వరకు పొడిగించింది. వారి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాశ్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్కమల్ బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, మన్మోహన్సింగ్, శామ్యూల్, శ్రీలక్ష్మితో పాటు ఫార్మా కంపెనీల ప్రతినిధుల హాజరు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా... కోర్టు అందుకు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కాగా, అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది. ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్ పొడిగింపు ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో నిందితులు సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3 వరకు పొడిగించింది. వీరందరి రిమాండ్ ముగియడంతో బెంగళూరు జైలు నుంచి గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌లను, చంచల్‌గూడ జైలు నుంచి సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులైన బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజరుకాగా... సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా...అనారోగ్యం కారణంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. -
వైఎస్ జగన్ రిమాండ్ 20 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్సింగ్, శ్యామూల్, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా... ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఇదే కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి దాఖలు చేసుకున్న తాత్కాలిక బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది. ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్ పొడిగింపు ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. వీరందరి రిమాండ్ ముగియడంతో బెంగుళూరు జైలు నుంచి గాలి జనార్ధన్‌రెడ్డి, అలీఖాన్‌లను, చంచల్‌గూడ జైలు నుంచి సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజరుకాగా... ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ హాజరుకాగా... అనారోగ్యం కారణంగానే ఐఏ ఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దీన్ని కోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.