
బెయిల్‌కు సాయిరెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దర్యాప్తు తుది దశలో ఉందన్న కారణంగానే సుప్రీం కోర్టు తన బెయిల్‌ను రద్దు చేసిందని, ఆ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో 2012 జనవరి 2న సీబీఐ తనను అరెస్టు చేసిందని, దర్యాప్తు పూర్తి చేసి మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 13న బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. అయితే సీబీఐ ఆ బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిందని, దానిని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఆ తర్వాత దర్యాప్తు తుదిదశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు.
ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు తన బెయిల్‌ను రద్దు చేసిందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని సీబీఐ కోర్టును ఆదేశించిందని తెలిపారు. దాంతో జూన్ 5న ఇదే కోర్టు ముందు లొంగిపోయానని చెప్పారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని పేర్కొంటూ సీబీఐ మెమో దాఖలు చేసిందని తెలిపారు. పారదర్శకమైన తుది విచారణ(ట్రయల్) జరగాలంటే నిందితులకు బెయిల్ ఇవ్వాలని, నిందితులు బయట ఉంటేనే వారి వాదనను సమర్థవంతంగా వినిపించుకునే అవకాశం ఉందని సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తుచేశారు. తాను ప్రత్యక్షంగా, పరోక్షంగా దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని, అన్ని రికార్డులను సీబీఐ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నందున ఆధారాల తారుమారు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని వివరించారు. ఇదే కేసులో మొదటి నిందితుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైందని తెలిపారు. కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్ మంజూరు చేయాలని సాయిరెడ్డి కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.
బెయిలివ్వండి: సునీల్‌రెడ్డి పిటిషన్
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 21 నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నానని, ఆ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఎన్.సునీల్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సునీల్‌రెడ్డి తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మార్ కేసులో సహ నిందితుడు ఇచ్చిన వాం గ్మూలం ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించారని సునీల్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా రిమాండ్‌లో ఉన్న వారందరికీ ఇదే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను 27కు వాయిదా వేశారు.