ప్రత్యేక కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌నూ అదే తేదీ వరకు పొడిగించింది. వారి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాశ్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్ బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్‌రామిరెడ్డి, మన్మోహన్‌సింగ్, శామ్యూల్, శ్రీలక్ష్మితో పాటు ఫార్మా కంపెనీల ప్రతినిధుల హాజరు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేయగా... కోర్టు అందుకు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కాగా, అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్ పొడిగింపు
ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో నిందితులు సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3 వరకు పొడిగించింది. వీరందరి రిమాండ్ ముగియడంతో బెంగళూరు జైలు నుంచి గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌లను, చంచల్‌గూడ జైలు నుంచి సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులైన బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజరుకాగా... సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా...అనారోగ్యం కారణంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది.
జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు
Published Sat, Sep 21 2013 4:06 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
Advertisement
Advertisement