బాధ్యతలు స్వీకరించిన రామరాజు
రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి విజయరామరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించడం ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే..
కోటగుమ్మం(రాజమండ్రి) : పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని రాజమండ్రి సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. శిక్షణ అనంతరం ఆయనకు తొలి పోస్టింగ్ ఇక్కడే కావడం విశేషం. ఏడేళ్ల అనంతరం రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా ఒక ఐఏఎస్ అధికారి వచ్చారు. 2007లో కోన శశిధర్ విధులు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలుగా గ్రూప్-1 ఆఫీసర్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా విజయ రామరాజు విలేకరులతో మాట్లాడారు.
‘‘మా స్వస్థలం విశాఖపట్నం. సీతమ్మధారలో ఉండేవాళ్లం. పదోతరగతి, ఇంటర్ అక్కడే చదివాను. ఐఆర్‌టీఎస్ రైల్వే ట్రాఫిక్ ఆఫీసర్‌గా చేస్తూనే ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. 2012 బ్యాచ్‌కు చెందిన నేను లాల్ బహుదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో శిక్షణ పొందాను. సమస్యలను అర్థం చేసుకొని కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ల సలహాలు తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా. రెవెన్యూ సర్వీసులు కంప్యూ టరీకరించి వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కరిస్తా. పుష్కరాల పనులను పరిశీలించి కొన్నింటికి మార్పులు చేయవలసి వస్తే చేస్తా’’మని విజయరామరాజు తెలిపారు.
రెవెన్యూ అసోసియేషన్ అభినందన
విజయ రామరాజును రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు కలసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు జి.డి. కిషోర్ బాబు, కార్యదర్వి కేవీ రమణ, ట్రెజరర్ పాపారావు, వైస్ ప్రెసిడెంట్ కాంతి ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.