విజయమ్మ
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సమరదీక్ష కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమె చేపట్టిన ఆమరణదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాకుండా అవమానకరంగా ఆమెను పోలీస్ వ్యాన్లోనే తరలించారు. శిబిరం వద్ద ఉన్న నేతల పట్ల కూడా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.
అయిదు రోజుల నుంచి ఆమె నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నందున విజయమ్మ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రభుత్వ వైద్యులు చెప్పారు. తప్పనిసరిగా ఆమె ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే విజయమ్మ మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకు దీక్షను కొనసాగిస్తానని ఆమె చెప్పారు. ప్రాణాలైనా వదులుతాను గానీ దీక్ష మాత్రం ఆపనని తెగేసి చెప్పారు.
ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఆస్పత్రి లోపలికి పోలీసులు ఎవరినీ అనుమతించడంలేదు.