మెదక్‌లో విజయశాంతి సుడిగాలి పర్యటన | Vijayasanti tour in Medak | Sakshi
Sakshi News home page

మెదక్‌లో విజయశాంతి సుడిగాలి పర్యటన

Published Mon, Oct 7 2013 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Vijayasanti tour in Medak

మెదక్ టౌన్, న్యూస్‌లైన్: మెదక్ ఎంపీ విజయశాంతి ఆదివారం మెదక్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆమెకు పట్టణ శివారులోని ద్వారకా గార్డెన్‌‌స వద్ద యువజన కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలుకుతూ పట్టణంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె రాందాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణ శివారులోని పిట్లంబేస్ చెరువు కట్టపై గల దర్గాతోపాటు పట్టణంలోని  సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా అభిమానులతో కరచాలనం చేస్తూ ఫొటోలు దిగారు.
 
 అంతకు ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శశధర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్, డీసీసీ కార్యదర్శులు అస్గర్, దుర్గాప్రసాద్, అశోక్, రెడ్డిగారి నర్సింహారెడ్డి, సీడీసీ డెరైక్టర్ ఆంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్లు గంటరాజు, మధుసూదన్‌రావు, అమరసేనారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.ఆంజనేయులుగౌడ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కొండశ్రీను, నాయకులు శివరామకృష్ణ, పురం వెంకటనారాయణ, కాలేక్, ఎల్లయ్య, విజయ్, సలీం, అమీర్, నయీం, జీవన్, పవన్, ఏఎంసీ రామాయంపేట వైస్ చైర్మన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఎంపీకీ వినతుల వెల్లువ
 సోమవారం మెదక్ వచ్చిన ఎంపీ విజయశాంతికి పట్టణ ప్రజలు పలు సమస్యలపై  పెద్ద ఎత్తున వినతి పత్రాలను సమర్పించారు. జిల్లాలో ఉర్దూ మీడియం పాఠశాలలో 369 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి కృషి చేయాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఖాజామొహినొద్దీన్, రహీమొద్దీన్ తదితరులు వినతి పత్రం సమర్పించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో గత 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న  పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్, కాలనీ అధ్యక్షుడు డెన్నిస్ ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. మెదక్‌లోని అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని  కోరుతూ దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు కొల్చారం యాదగిరితోపాటు పలువురు దళిత సంఘాల నేతలు ఎంపీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తనను ఆదుకోవాలని  పూలశేఖర్ ఎంపీకి విజ్ఞప్తి చేశారు.

 పార్లమెంటులో బిల్లు మాత్రమే మిగిలింది
 పాపన్నపేట: తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్లమెంటులో బిల్లు మాత్రమే పెట్టాల్సి ఉందని, 2014 జనవరిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. దేవీ శరన్నవరా త్రోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఏడుపాయల దుర్గామాతను డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాకుండా ఎంతోమంది సమైక్యవాదులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అడ్డుపడినా ఇచ్చిన మాటకోసం సోనియాగాంధీ కట్టుబడ్డారన్నారు.
 
 తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది తమ ప్రాణాలను బలిపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగం వృధా కాలేదన్నారు.  కొంతమంది తెలంగాణ విషయంలో పిచ్చి పిచ్చి సవాళ్లు విసురుతున్నారని వాటిని వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఏడుపాయల్లో భక్తుల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతర తరువాత ఏడుపాయల ప్రసిద్ధి చెందిందన్నారు.  ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడుపాయల అభివృద్ధి కోసం ఎంపీ తన నిధులను వినియోగించాలని కోరారు. అంతర్గత రోడ్లతోపాటు ఏడుపాయల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, గోపాల్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు పాల్గొన్నారు.
 
 దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
 ఆదివారం రాత్రి ఏడుపాయలకు చేరుకున్న ఎంపీ విజయశాంతి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పూజారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏడుపాయల దుర్గామాత విశిష్టతను మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి వివరించారు.
 
 ఎల్లాపూర్‌లో ప్రొటోకాల్ రగడ
 తమ గ్రామ సర్పంచ్ మల్లీశ్వరికి  తెలియకుండా ఎంపీ పర్యటన చేపట్టి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎంపీ పర్యటనను కొంతమంది ఎల్లాపూర్‌లో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement