గ్యాంగ్‌ వార్‌; వెలుగులోకి కొత్త విషయాలు | Vijayawada Gang War Case; Murder Case Registered On Pandu | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌వార్‌ కేసు కొలిక్కి!

Published Fri, Jun 5 2020 7:58 AM | Last Updated on Fri, Jun 5 2020 11:07 AM

Vijayawada Gang War Case; Murder Case Registered On Pandu - Sakshi

టిక్‌టాక్‌ వీడియోలో పండు(ఫైల్‌)

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరంలోని పటమట డొంక రోడ్డులో ఆదివారం జరిగిన గ్యాంగ్‌వార్‌ ఘటనలో మాజీ రౌడీషీటర్‌ సందీప్‌పై మారణాయుధాలతో దాడికి పాల్పడిన 13 మంది నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పండుపై దాడికి పాల్పడ్డ తోట సందీప్‌ వర్గానికి చెందిన మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.  

ఆధిపత్య పోరే కారణం.. 
యనమలకుదురులో ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి పంచాయతీ జరుగుతున్న చోటకు మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు రావడం జీర్ణించుచుకోలేకపోయిన సందీప్‌.. అదే రోజు పండుతో ఫోన్‌లో తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. పండు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో ఫోన్‌లోనే ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం గ్యాంగ్‌వార్‌కు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆదివారం ఉదయమే పండు ఓ ముప్‌పై మందికిపైగా యువకుల్ని వెంటేసుకొని వచ్చి పటమట డొంకరోడ్డులోని సందీప్‌ షాప్‌ వద్ద దాడికి యత్నించగా.. ఆ సమయంలో రహదారిపై బ్లూకోట్స్‌ సిబ్బంది సైరన్‌ మోగిస్తూ రావడంతో చాలా మంది పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని సమాచారం. పరస్పర సవాళ్ల నేపథ్యంలో సాయంత్రం చర్చి వెనుక ఉన్న ఖాళీ స్థలానికి చేరుకుని ఒకరిపై ఒకరు రాడ్లు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.  

పోలీసుల అదుపులో పండు గ్యాంగ్‌..  
సందీప్‌ మృతికి కారణమైన పండుతోపాటు అతని గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. గ్యాంగ్‌వార్‌లో తీవ్రంగా గాయపడిన పండు ప్రస్తుతం గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతనిని పోలీసులు ఇప్పటి వరకు విచారించలేదు. పండు కోలుకోగానే అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నారనేది సమాచారం. పండు గ్యాంగ్‌లో పటమట, సనత్‌నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాలకు చెందిన యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు అల్లరిచిల్లరిగా తిరిగేవారని, పండు నిత్యం వీళ్లకు అవసరమైనవి సరఫరా చేస్తుండటంతో అతను ఏ పని చెప్పినా ముందూ వెనుక చూడకుండా రంగంలోకి దిగేవారని పోలీసుల విచారణలో గుర్తించారని తెలుస్తోంది. గ్యాంగ్‌ సభ్యులపై ఐపీసీ 143, 148, 302, 307, 324 సెక్షన్లతోపాటు కోవిడ్‌–19 చట్టానికి సంబంధించిన 188, 269 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పండు పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియోల పై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. పండుపై సినిమాల ప్రభావం, బెజవాడ రౌడీగా ఎదగాలన్న ఆలోచనా ధోరణే గ్యాంగ్ వార్ కి దారితీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సందీప్‌ గ్యాంగ్‌లో ఇద్దరు రౌడీషీటర్లు..  
పండు ముప్‌పై మందికి పైగా యువకుల్ని వెంటేసుకొని రావడంతో సందీప్‌ కూడా తన అనుచరులతోపాటు మంగళగిరికి చెందిన రౌడీషీటర్లు మేకతోటి కిరణ్‌కుమార్, ఆకురాతి వెంకట రఘునాథ్‌ అలియాస్‌ ఏవీఎస్‌లను కూడా గ్యాంగ్‌వార్‌కు పిలిపించారు. వీడియో ఫుటేజీలో వీరిని గుర్తించిన పోలీసులు వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సందీప్‌ తరఫున గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

సెటిల్‌మెంట్ల అడ్డా.. పటమట
భూ తగాదాలు.. కుటుంబ కలహాలు.. కాల్‌మనీ కేసులు.. క్రికెట్‌ బెట్టింగ్‌లు.. కళాశాల గొడవలకు సంబంధించి నగరంలో ఎలాంటి సెటిల్‌మెంట్లకైనా పటమటే అడ్డా. బెజవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడలో జరిగిన వివాదాలన్నింటిలోనూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కొందరి నేతల హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదివారం మృతి చెందిన మాజీ రౌడీషీటర్‌ సందీప్‌ కూడా రియల్టర్‌ నాగబాబు ఓ అపార్ట్‌మెంట్‌ వివాదంలో పంచాయతీకి తీసుకెళ్లగా.. అది కాస్త గ్యాంగ్‌వార్‌కు దారితీసింది.  

నాగబాబు ఎవరంటే..  
పటమటకు చెందిన నాగబాబు ఓ సాధారణ రియల్టర్‌. చిన్న స్థలాలు కొని ప్లాట్లు వేసి విక్రయిస్తుంటాడు. ఇతనికి టీడీపీ ముఖ్య నాయకులతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో స్థల వివాదాలు అధికం. నాగబాబు దృష్టికి భూ వివాదాలు రాగానే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, నగర టీడీపీ ముఖ్య నేతల వద్ద పంచాయతీ పెట్టించేవాడు. నాయకులు సెటిల్‌మెంట్లు చేయడం ప్రతిఫలంగా నాగబాబుకు ఎంతో కొంత కమీషన్‌ ముట్టజెప్పేవారని సమాచారం. ఇలా చిన్నచిన్న పంచాయతీలతో వచ్చే కమీషన్‌తో పబ్బం గడుపుకునే నాగబాబు తర్వాత జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తూర్పు, మధ్య నియోజకవర్గ ముఖ్యనేతలు, తెలుగుయువత జిల్లా నాయకుని సహాయ సహకారాలతో స్వయంగా పంచాయతీలు చేసే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తోంది.  

సందీప్, పండులు పావులుగా.. 
తను సొంతంగా పంచాయతీలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి సందీప్, పండులను నాగబాబు ఉపయోగించుకుంటూ వచ్చారని పోలీసుల తాజా పరిశీలనలో వెల్లడైందని సమాచారం. నాగబాబు ఏదైనా పంచాయతీ చేస్తే స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రౌడీïÙటర్లను రంగంలోకి దించేవాడని, ఈ గ్యాంగ్‌లను, ముఖ్యంగా యువతను తీసుకొచ్చే పనిని సందీప్, పండులకు అప్పగించేవాడని పోలీసులు గుర్తించారు. తెలుగు యువత జిల్లా నాయకుడు దిశానిర్దేశం చేయడం, నాగబాబు అమలుచేసే వాడని తెలుస్తోంది. గత వారం కూడా ఇలాగే యనమకుదురులోని ధనేకుల శ్రీధర్, ప్రదీప్‌రెడ్డిలకు చెందిన అపార్ట్‌మెంట్‌ పంచాయతీకి నాగబాబు సందీప్‌ను తీసుకెళ్లగా.. పండు కూడా ప్రదీప్‌రెడ్డి తరఫున వెళ్లడం జరిగింది. నాగబాబు, సందీప్‌లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు.   దీంతో పండుకు వార్నింగ్‌ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్‌ ఫోన్‌లో బెదిరించే యత్నం చేశాడు.  మాటామాటా పెరగడం.. సవాళ్లు,  ప్రతిసవాళ్లతో చివరకు గ్యాంగ్‌ వార్‌కు దారితీసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement