మెట్రో సాధ్యమే | Vijayawada - Guntur - Tenali between the Metro Rail | Sakshi
Sakshi News home page

మెట్రో సాధ్యమే

Published Fri, Jun 20 2014 1:56 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

మెట్రో సాధ్యమే - Sakshi

మెట్రో సాధ్యమే

  • ఉడా నివేదిక
  •  విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు
  •  మార్గం నిర్మాణానికి అంతా అనుకూలం
  •  ప్రతి కిలోమీటరుకు రూ.200 కోట్ల వ్యయం
  •  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందజేత
  • ఇప్పటివరకు ప్రకటనకే పరిమితమైన మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారం ఒక అడుగు ముందుకు పడింది. వీజీటీఎం ఉడా పరిధిలో రైలు మార్గం నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ఉడా అధికారులు నివేదిక అందించారు. ఇది ప్రాథమిక నివేదికే అయినా ప్రాజెక్టు మంజూరైతే పనులు ప్రారంభించిన నాలుగేళ్ల వ్యవధిలో పూర్తిచేసే అవకాశముందని తెలుస్తోంది.
     
    సాక్షి, విజయవాడ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ సుధీర్‌కృష్ణ నేతృత్వంలోని కేంద్ర కమిటీ బుధవారం విజయవాడ నగరం, గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది.

    విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని కమిటీ బుధవారమే సమీక్ష అనంతరం ప్రకటించింది. దీని కంటే ముందే ఈ మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడా కూడా మెట్రో ఇక్కడ అనుకూలమే అని అధికారులకు నివేదిక అందజేసింది. కేంద్ర కమిటీ పర్యటనకు ముందే నివేదికను సిద్ధం చేయాలని ఉడా అధికారులను ఆదేశాలు రావడంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్‌కృష్ణకు అందజేశారు.
     
    నిర్మాణ వ్యయం రూ.19,400 కోట్లు...

    విజయవాడ నుంచి గుంటూరుకు 30 కిలోమీటర్లు, గుంటూరు నుంచి తెనాలికి 23 కిలోమీటర్లు, తెనాలి నుంచి విజయవాడకు 44 కిలోమీటర్లు దూరం ఉంది. మెట్రో రైలు నిర్మాణానికి ప్రతి కిలోమీటరుకు సగటున రూ.200 కోట్ల వ్యయం అవుతుంది. ఈ క్రమంలో మూడు ప్రాంతాల మధ్య 97 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మించాల్సి ఉంటుంది. అంటే నిర్మాణానికి రూ.19,400 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇది కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే. ఇది కాకుండా అవసరమైన చోట్ల భూసేకరణ, ఇతర కార్యక్రమాల నిర్వహణకు మరింత బడ్జెట్ అవసరమవుతుంది.
     
    కేంద్రానికి ఉడా సమర్పించిన నివేదికలో విజయవాడ, గుంటూరు నగరాల పరిస్థితితో పాటు తెనాలి ప్రాంత ప్రజల జీవన పరిస్థితి, అక్కడ ఉన్న స్థలాల లభ్యత మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి పనులు ఉడా పరంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉడా విస్తీర్ణం, పరిధి, ఇలా అన్ని అంశాలను పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు రైల్వే జంక్షన్లుగా ఉన్నాయి. విజయవాడ మీదుగా వందల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక రెండు రైల్వే డివిజన్లు కూడా ఆర్థికంగా పరిపుష్టంగానే ఉన్నాయి. 10 లక్షల జనాభా దాటిన ప్రతి నగరంలో మెట్రో రైలు నిర్మించే అవకాశం ఉంది.

    ప్రాథమిక నివేదికే...
     
    వీజీటీఎం ఉడా పరిధిలోని మూడు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెట్రో రైలు నిర్మాణం సాధ్యమా కాదా అనే అంశంపైనే అధికారులు ఈ నివేదిక సిద్ధం చేశారు. నివేదికలో మెట్రో నిర్మాణానికి ఇక్కడ అంతా అనువుగా ఉందని వివరించారు. అందుకు తగిన కారణాలను కూడా పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు అందిన ప్రతిపాదనల ఆధారంగా ఆ శాఖ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రాజెక్టు మంజూరైతే పనులు ప్రారంభించిన నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేసే అవకాశం ఉంది. తాము ప్రాథమిక నివేదిక మాత్రమే సమర్పించామని ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement