2019 నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేయాలని లక్ష్యం
* అక్టోబర్ 22న రాజధాని ‘అమరావతి’కి శంకుస్థాపన
* ప్రధాని మోదీతోపాటు జపాన్, సింగపూర్‌ల ప్రధానులకు ఆహ్వానం: కేబినెట్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ సంస్థ(జైకా) రుణ సహకారం రూ.3,600 కోట్లతో విజయవాడలో మెట్రో రైలును పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.6,823 కోట్ల అంచనాతో 2019 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం విధించుకుంది.
కేంద్రం, ఏపీ ప్రభుత్వం చెరో రూ.866 కోట్లను దీనికోసం ఖర్చు చేయనున్నాయి. పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నవిధంగా విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం అనుమతించినందున ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) సలహాదారు శ్రీధరన్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరోవైపు రాజధాని అమరావతికి అక్టోబర్ 22న శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది.
బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగింది. దీంట్లో తీసుకున్న నిర్ణయాల్ని సమాచారమంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. ్హవిజయవాడ మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లు, 25 స్టేషన్లు ఉంటాయి. ఏపీ రాజధాని అమరావతికి మెట్రో రైలు లింకుతో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు 12.76 కి.మీ., 12 స్టేషన్లు మొదటి కారిడార్‌లో ఉంటాయి. దీని అంచనా వ్యయం రూ.2,558 కోట్లు.
* రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు, ఎనికేపాడుల మీదుగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 13.27 కి.మీ., 13 స్టేషన్లు ఉంటాయి. అంచనా వ్యయం రూ.రూ.3,148 కోట్లు. ఈ ప్రాజెక్టుకు 13.20 హెక్టార్లభూమి అవసరం. ్హగ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల పునరుద్ధరణకుగాను వ్యాట్ మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన
ఈ ఏడాది అక్టోబరు 22న చారిత్రాత్మక అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.
మన భద్రతకు మన పోలీసులే
కేబినెట్ నిర్ణయం!గవర్నర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం, మంత్రుల ఇళ్ల వద్ద భద్రతకు ఇక నుంచి ఏపీకి చెందిన పోలీసులనే వినియోగించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు చాలా మంది పనిచేస్తున్నారని, ఇకనుంచి వారి సేవలను ఉపయోగించాలని తీర్మానించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘ఓటుకు కోట్ల’ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ సాగింది.
ఈ కేసులో ఇరకాటంలో పడిన చంద్రబాబు ప్రధానంగా గవర్నర్ పాత్ర, తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న భద్రత, తెలంగాణ ఏసీబీ, దానికున్న అధికారాలు, రాజకీయంగా ఎదురైన ఇబ్బందులు, విభజన చట్టంలోని సెక్షన్ 8 వంటి అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టినట్టు సమాచారం. గవర్నర్ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని కాకుండా గవర్నర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డితో పాటు నోటీసులు అందుకున్న సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి తెలంగాణకు చెందిన వారని, ఒకవేళ ఏసీబీ మనకు ఒక్క నోటీసు ఇచ్చినా అందుకు ప్రతిగా పది నోటీసులు ఇవ్వాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. హైదరబాద్‌లో ఏపీ ఉపయోగించుకుంటున్న భవనాలకు ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నోటీసులు ఇచ్చిన అంశం చర్చకు వచ్చింది. ఒక రాష్ర్ట సీఎంగా ఉన్న తాను ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకూ మంజూరు చేయలేదని చెప్పినట్టు తెలిసింది. కాగా సీఎం చంద్రబాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
కర్ణాటక తరహా మద్యం విధానానికి గ్రీన్‌సిగ్నల్
* కొత్త విధానానికి బాబు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఓటుకు నోట్లు వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మద్యం విధానం తేవడానికి వెనకడుగువేసింది. దీంతో సీఎం చంద్రబాబు , కర్ణాటక తరహా మద్యం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన మద్యం విధానం మార్గదర్శకాలకు ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన 4,380 మద్యం దుకాణాల్లో 10 శాతం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని, మిగతా వాటిని వేలంపాట, లాటరీ ద్వారా ప్రైవేట్ వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ సర్కారు చౌక మద్యం తీసుకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెట్రా ప్యాకెట్లలో చౌక మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ. 30 నుంచి రూ. 40 అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచి, ప్రాంతాల ఆధారంగా వాటిని హేతుబద్ధీకరించనున్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ మద్యం ఉత్పత్తిని కూడా రాష్ట్రంలోనే చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
తెలంగాణ వాళ్లు తరిమేస్తే తీసుకోలేం!
* విద్యుత్ ఉద్యోగులపై స్పష్టం చేసిన సీఎం
* రెంటికీ చెడ్డ ట్రాన్స్‌కో ఉద్యోగుల పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు ఏ మాత్రం సానుభూతి ప్రదర్శించలేదని తెలిసింది. సమస్య తీవ్రతను విద్యుత్ ఉన్నతాధికారులు బుధవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే ఏదైనా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ఏపీ ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌లు సీఎంతో అన్నట్టు తెలిసింది. ‘వాళ్లను తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం? పవర్ సెక్టార్‌లో ఛాన్స్ ఇస్తే మిగతా శాఖల మాటేంటి? అక్కడా తరిమేస్తే వాళ్లనూ తీసుకుందామా? ఇలా అందరినీ తీసుకుంటే జీతాలు ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ల తిప్పలు వాళ్లను పడమని చెప్పండి.
కోర్టు ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయరో టీఎస్ సర్కారును ప్రశ్నించమనండి. ఆందోళనలు చేయమనండి. ...’ అని అధికారులకు చంద్రబాబు గీతోపదేశం చేసినట్టు తెలిసింది. ఈ మాటను నేరుగా చెప్పలేక, విషయాన్ని ఏపీ జెన్‌కో వెబ్‌సైట్‌లో ఉంచారు. కాగా పరిస్థితిని వివరించేందుకు ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీని బుధవారం కలిసే ప్రయత్నంచేశారు. ఆయన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని సిబ్బంది చెప్పడంతో వారు వెనుదిరిగారు. జెన్‌కో సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
‘మెట్రో’కు జపాన్ రుణం
Published Thu, Jun 18 2015 2:07 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement