భూప్రకంపన జోన్ లో విజయవాడ
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందనే దానిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి ఎక్కువ అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం భూప్రకంపన జోన్ లో ఉందంటూ భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థ(జీఎస్ఐ) శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఇక్కడ భూమి కంపించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతం
భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థకు చెందిన హైదరాబాద్ లోని భూకంపనాల అధ్యయన దక్షిణవిభాగం ఈ విషయాన్ని తెలిపింది. నైరుతి గుణదల, మంగళగిరిలోని కొండ ప్రాంతాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని జూన్ లో సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఒక అంతస్థు భవనాలు నిర్మించడానికి కూడా ఇవి అనువైన ప్రాంతాలు కాదని స్పష్టం చేసింది. ఇంద్రకీలాద్రి కొండల్లోని తూర్పు ఘాట్ ప్రాంతానికి భూకంపనాల ముప్పు ఉందని పేర్కొంది. నిడమర్రు నైరుతి ప్రాంతం, తాడేపల్లి తూర్పువైపు, నున్న దక్షిణ ప్రాంతంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనూ భూకంపనాలకు అవకాశముందని జీఎస్ఐ తెలిపింది.
విజయవాడకు 300 కిలోమీటర్ల పరిధిలో భూప్రకంపనాలు సంభవించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకులు అంచనా వేశారు. అయితే భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయనేది కచ్చితంగా చెప్పలేమని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకరాలు డాక్టర్ నీలిమా సత్యం అన్నారు. ఉపద్రవం వచ్చినప్పుడు మాత్రమే దాని తీవ్రత తెలసుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన- భూకంప ముప్పు ఉన్న 63 నగరాల్లో విజయవాడ కూడా ఉందని తెలిపారు. పర్యావరణ అసమతుల్యత, అపక్రమత కారణంగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువని వివరించారు.