గడ్డి తింటున్నారా.. అధికారులపై ఎంపీ దుర్భాషలు
తెలుగుదేశం పార్టీ నాయకుల ఓవరాక్షన్‌తో అధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయవాడ ఆర్టీయే కార్యాలయం వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. రవాణా శాఖ కమిషనర్, డీటీసీలు అవినీతిపరులు అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఆరోపించారు. గడ్డి తింటున్నారా అంటూ అధికారులను దుర్భాషలాడారు. కమిషనర్, డీటీసీలను ఘెరావ్ చేయడమే కాక.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు జతకలిశారు.
అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్‌ను ఎమ్మెల్యే బోండా ఉమా నెట్టేశారు. ప్రైవేటు బస్సులకు అక్రమంగా అనుమతులు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దానివల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తోందో మీకు తెలుసా అని కేశినేని నాని అధికారులపై మండిపడ్డారు. ప్రైవేటు బస్సులకు యాక్సిడెంట్లు జరిగితే ఆ నిందలు టీడీపీ ప్రభుత్వం మీద పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుతో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. అయితే చివరకు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో ఎంపీ కేశినేని నానికి క్షమాపణలు చెప్పించారు. దాంతో వివాదం సర్దుమణిగింది.