త్వరలో సీఎం వద్దకు పంచాయితీ
స్ట్రాంవాటర్ డ్రెయినేజ్ పనులు పబ్లిక్ హెల్త్ విభాగానికి కట్టబెట్టిన మంత్రి నారాయణ!
కార్పొరేషన్‌కే అప్పగించాలంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
విజయవాడ : స్ట్రాం వాటర్ డ్రెయినేజ్ (వరద నీరు) నిధులు తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ఎట్టకేలకు నిధుల్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఒత్తిడి వల్లే పబ్లిక్ హెల్త్ విభాగానికి పనుల్ని కట్టబెడుతున్నట్లు సమాచారం.
నగరపాలక సంస్థ చేపట్టాల్సిన పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. రాకరాక వచ్చిన నిధులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటలకు దారితీయడం ఇప్పుడు కార్పొరేషన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చిన్నబుచ్చుకున్నారు
స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మేలో రూ.461 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలివిడతగా రూ.110 కోట్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని తొక్కిపట్టింది. నిబంధనల నేపథ్యంలో ఎట్టకేలకు ఇటీవలే విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ నాని, మేయర్ శ్రీధర్ చొరవ చూపారు. ఏ దశలోనూ కృషి చేయని మంత్రి నారాయణ ఇప్పుడు పెత్తనం చేయడాన్ని స్థానికనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించారు. 100 కి.మీ మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు పనుల్ని పబ్లిక్‌హెల్త్ విభాగానికి అప్పగించడంతో కార్పొరేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు.
ఎందుకంత ప్రేమ!
రూ.62 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40 వేల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్లద్వారానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది.
దీనికి ఆ డ్రెయిన్ల సామర్థ్యం చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్‌టౌన్, సర్కిల్-3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈక్రమంలో స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. పబ్లిక్‌హెల్త్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు, ఒక డీఈ, ఇద్దరు ఏఈలు మాత్రమే ఉన్నారు. ఎస్‌ఈ గుంటూరు జిల్లాలో ఉంటారు. నగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్, ఇద్దరు ఎస్‌ఈలు, 8 మంది ఈఈలు, 21మంది డీఈలు, 40 మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది అధికారులు కార్పొరేషన్లో ఉండగా పబ్లిక్‌హెల్త్ విభాగానికి పనుల బాధ్యతల్ని మంత్రి అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది.
అనుమానమే..
కేంద్రం నిధులతో చేపట్టబోయే పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిధులు మురిగిపోతాయి. ప్రతి ఆరునెలలకు ఓ సారి నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుబట్టే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పనులు పూర్తవుతాయనే నమ్మకం తమకు లేదన్నది స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయంగా తెలుస్తోంది.