సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. అయినా బాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చాడో.. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎంపీ కేశినేని నాని గురువారం మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు తానే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టానని చెప్పారు. పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించేవాడని ప్రస్తావించారు. ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడని విమర్శించారు.
2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే ఆలోచనతో కాంగ్రెస్‌తో బాబు కలిశాడని దుయ్యబట్టారు. పనికిరాని కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన అని ఆరోపించారు. అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశాడని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడని గుర్తుచేశారు. ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడినట్లు తెలిపారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీయే కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment