జగనే సీఎం
- విజన్ విజయవాడ సాధిస్తా
- క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతా
- ‘పైలా’ చేరిక శుభసూచకం
- వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్
వైఎస్సార్ సీపీకి ప్రజాదరణ వెల్లువలా వస్తోందని, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం బెంజిసర్కిల్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, జైసమైక్యాంధ్ర పార్టీలకు చెందిన వందలాది మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమని ప్రజలు విశ్వసిస్తున్నారని కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. నగరానికి చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రముఖులంతా నేడు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు సేవలందించిన పైలా సోమినాయుడు, బాయిన వెంకట్రావు లాంటివారు తన సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి రావడం శుభసూచకమన్నారు. వీరిని పార్టీలోకి తీసుకుంటున్నట్లు తాను జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పానన్నారు. వీరి చేరికతో తాను పార్టీలో ఒక అడుగు ముందుకు వేశానని సంతోషం వ్యక్తం చేశారు. వీరందరి సలహాలు, సంప్రదింపులతో ‘విజన్ విజయవాడ’ లక్ష్యంగా పని చేస్తానన్నారు. నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడమే తన ధ్యేయమన్నారు.
విజయవాడ అబివృద్ధికి బ్లూప్రింట్ తయారుచేసి ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతక్రమంలో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు.
జనాదరణగల నేత జగన్..
పార్టీ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆకర్షణ కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, ఆదరణ చిరస్థాయిగా ఉంటుందన్నారు. మహానేత ైవె ఎస్ రాజశే ఖరరెడ్డి చేపట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన పేద ప్రజలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు.
నాలుగేళ్లు రాజన్న కుటుంబానికి దూరం
పార్టీలో చేరిన పైలా సోమినాయుడు మాట్లాడుతూ.. తాను 1986 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లుగా తాను రాజన్న కుటుంబానికి దూరంగా ఉన్నానని విచారం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ఆదరణ, కోనేరు రాజేంద్రప్రసాద్ స్ఫూర్తితో తాను వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా చేరానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారని చెప్పారు.