ముస్తాబైన ప్రత్తిపాడు గ్రామ సచివాలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరేలా గ్రామ స్వరా జ్యం సాధించాలన్న ఆకాంక్షలను నిజం చేస్తూ బుధవారం నుంచి గ్రామ సచివాలయాల వ్యవస్థ పని ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 938 గ్రామ సచివాలయాలకు 666 సచివాలయాలు సిద్ధమయ్యాయని, 794 సచివాలయాలకు ఇంటర్‌నెట్ కనెక్షన్ కూడా సిద్ధం చేశామన్నారు. ప్రతి మండలంలోనూ ఒక గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి మండలంలో గ్రామ సచివాలయాలకు ఎంపిక అయిన ఉద్యోగులందరూ అక్కడికి చేరుకుని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. వారందరూ వారికి కేటాయిం చిన సచివాలయాలకు వెళ్లి అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. వారు స్వయంగా చూసిన తర్వాత ఏమైనా లోపాలను గుర్తిస్తే వాటిని వెంటనే సరిచేస్తామని కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు.
నియామక పత్రాలు.. పోస్టింగులు
జిల్లావ్యాప్తంగా 4,475 మందికి నియామకపత్రాలతో పాటు పోస్టింగ్‌లు కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ఏఎన్‌ఎంలకు సంబంధించి నియామక ప్రక్రియ జరుగుతోందని, వారి వద్ద నుంచి ఆప్షన్స్ తీసుకుని మూడో తేదీ నాటికి పోస్టింగ్‌లు కూడా ఇస్తామన్నారు. వేరే జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న నాన్‌లోకల్ అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో ఉద్యోగాలు వచ్చినందున ఇక్కడ చేరలేదని, ఇప్పటివరకూ పోస్టింగ్‌లు ఇచ్చిన వారికి రోస్టర్ విధానం ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా అర్హులైన అభ్యర్థులు ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.సోమవారం జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లో కూడా ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. వీరిలో చాలామందికి సచివాలయాల్లో పోస్టులు వచ్చిన నేపథ్యంలో గ్రామ వలంటీర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉం దని, వీటినీ వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు.
1.50 లక్షల వరకు ఇళ్ల లబ్ధిదారులు
నవంబర్ 1 నాటికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించేందుకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి భూసేకరణకు వెళ్తామని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపా రు. ఇప్పటికే జిల్లాలో 85 వేల మంది సొంత స్థలాలు ఉండి ఇళ్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారని, ఇంకా లక్షా 24 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అర్హత ఉన్నట్లు గుర్తించామన్నారు. గ్రామ వలంటీర్లు, ప్రత్యేక అధికారుల సర్వే పూ ర్తి అయ్యిందని, ఇప్పుడు పల్స్ సర్వేతో పోలుస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తి అయితే ఇళ్ల స్థలాలు కావాల్సిన వారి సంఖ్య లక్షన్నర వరకూ చేరుతుందని కలెక్టర్ తెలిపారు.
రైతు భరోసాకు ముమ్మర కసరత్తు
రైతు భరోసాకు ఇప్పటివరకూ 3.27 లక్షల మంది లబ్ధిదారులుగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వీరిలో రైతులు 3.05 లక్షల మంది కాగా 21,900 మంది భూమిలేని సాగుదారులు ఉన్నారని చెప్పారు. డేటా ఎంట్రీ జరుగుతోందని, 5వ తేదీన జాబితాలను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. 8 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అదేరోజు తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. ఇప్పటికే 11,903 మంది తమకు అర్హత ఉందని దర ఖాస్తు చేసుకోగా, 546 మంది అనర్హులంటూ దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
6 లక్షల మందికి కంటి వెలుగు
కంటివెలుగు పథకంలో సుమారు 6 లక్షల మం ది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈనెల 10, 11 తేదీల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ కా ర్యక్రమం నిర్వహిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 14,15,16 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.
13,079 మందికి వాహన మిత్ర
వాహన మిత్ర పథకానికి సంబంధించి జిల్లాలో 13,259 మంది రిజిస్టర్ చేసుకున్నారని వీరిలో 197 తిరస్కరించగా, 13,069 మంది అర్హులుగా తేలిందని కలెక్టర్ తెలిపారు. వీరికి ఈనెల 4న ఏలూరులోనే ముఖ్యమంత్రి చేతులమీదుగా రూ.10 వేల అందిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment