వెంకటగిరి, న్యూస్‌లైన్: దండాలమ్మా..పోలేరమ్మ తల్లీ..మమ్ము చల్లంగా చూడమ్మా.. పోలేరమ్మ తల్లీ.. నామస్మరణతో వెంకటగిరి మార్మోగింది. గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఇసుకేసినా రాలనంత జనంతో పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఊరేగింపు భక్తుల ఆనందోత్సవాలు, కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఊరేగింపు సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం వేకువజామున 4 గంటలకు అమ్మవారి ప్రతిమను జీనిగలవారి వీధి నుంచి ఊరేగింపుగా పోలేరమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ ప్రాంగణంలో తాత్కాలికంగా నిర్మించిన గుడిలో అమ్మవారిని నిలుపు చేశారు.
అప్పటి నుంచి ఊరేగింపు ప్రారంభమయ్యేంత వరకు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఊరేగింపు భక్తుల జయజయధ్వానాల మధ్య కనులపండువగా బజారువీధి, రాజావీధి, శివాలయంవీధి మీదుగా ముందుకు కదిలింది. మల్లమ్మగుడి సమీపంలో అమ్మవారి నిమజ్జనోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పోలేరమ్మ మట్టిని పొందేందుకు భక్తులు పోటీ పడ్డారు. గ్రామపొలిమేర వద్ద పొలి నిర్వహించిన అనంతరం జాతర ముగిసింది. ఈ ఏడాది ఊరేగింపు నిదానంగా సాగడంతో భక్తులు అమ్మవారిని తనివితీరా దర్శించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ మూర్తి, డీఎస్పీ చౌడేశ్వరితో పాటు సీఐలు శ్రీనివాసులురెడ్డి, కేవీ రత్నయ్య, వేమారెడ్డి, ఎస్సై వీరేంద్రబాబు తదితరులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైఎస్సార్‌సీపీ వెంక టగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బల్లి దుర్గాప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాజా కుటుంబీకులు సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర అమ్మవారిని దర్శించుకుని, కానుకలు సమర్పించారు.
పోలీసుల అత్యుత్సాహం
వెంకటగిరి, న్యూస్‌లైన్ :జాతర బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పోలేరమ్మ గుడి వద్ద పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారు.
పలుమార్లు లాఠీలు ఝుళిపించడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సామాన్య భక్తులతో ఓ విధంగా వ్యవహరించిన పోలీసులు తమకు సంబంధించిన వారికి మాత్రం దర్శనం విషయంలో రెడ్‌కార్పెట్ వేశారు. వీఐపీ పాసులు భారీ సంఖ్యలో జారీ చేయడంతో సామాన్యులకు కష్టాలు తప్పలేదు. క్యూల ఏర్పాట్లలోనూ అధికారులు విఫలమయ్యారు. దర్శనం సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ మూర్తి, గూడూరు డీఎస్పీ రాజేశ్వరి పర్యవేక్షించారు. క్యూల పర్యవేక్షణ సమయంలో ఎస్సై రవీంద్రబాబుకు స్వల్పగాయాలయ్యాయి.
అమ్మవారిని దర్శించుకున్న కొమ్మి దంపతులు
వెంకటగిరిటౌన్ : పోలేరమ్మను వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. లక్ష్మయ్యనాయుడుకు దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పులి కృష్ణారెడ్డి సంప్రదాయ స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వెంకటగిరి, కలవాయి మండల కన్వీనర్లు బత్తినపట్ల వీరారెడ్డి, దుంపా రాంచంద్రారెడ్డి, నాయకులు పట్టాభిరామిరెడ్డి, మేరువ సురేంద్ర, సాయినాయుడు, బండి రత్నాకర్‌రెడ్డి, కరణం రమణయ్యనాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, నిడిగింటి రాజశేఖర్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జన జాతర
Published Fri, Sep 27 2013 4:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement