
సాక్షి, బొమ్మలరామారం (ఆలేరు) : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్య కేసు మరోసారి శనివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై ఇటీవల భువనగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కానీ శనివారం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్యల కేసులో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారని, కల్పన, శ్రావణి, మనీషాలపై హత్యకు ముందు అత్యాచారానికి పాల్పడినట్లుగా టెక్నికల్ ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ అందినదని, 300 మంది సాక్షలను విచారించి కోర్టుకు అవసరమైన బలమైన సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు అందజేయడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు మార్గం సుగమం అయినట్టుగా ఓ సమాచారం హల్‌చల్ చేసింది.
వరంగల్ ఘటనలో నిందితుడు ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించడంతో శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి శిక్షలు పడుతాయోనని ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అధికారులు ఈ విషయమై సంప్రదించగా హాజీపూర్ హత్యల కేసులో జరుగుతున్న పరిణామాలను ఎవరో అత్యుత్సహంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారని, పోలీసుల విచారణను సైతం ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదని ఓ సీఐ కేడర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment