ఈ సమాజంలో ఆడపిల్లలు ఎంతటి అభద్రతతో బతుకీడ్వవలసి వస్తున్నదో చెప్పడానికి యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామం ఇప్పుడొక బండ గుర్తు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎన్ని ఆటంకాలుంటున్నా పంటిబిగువున భరిస్తూ...ఎదిగితీరాలన్న పట్టుదలను ప్రదర్శించే చదువుల తల్లులకు కూడా ఆ గ్రామం ప్రతీక. ఎక్కడేం సమస్యలున్నాయో...ఏ సమస్యల్లో ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నదో పోల్చుకోలేని ప్రజాప్రతినిధుల నిర్లిప్త ధోరణికి ఆ నిస్సహాయ పల్లె ఒక విషాద సంకేతం. నిన్నటివరకూ తమ ఇంటిదీపాల్లా వెలుగులు పంచినవారు హఠాత్తుగా కనుమ రుగయ్యారని, వెతికిపెట్టి పుణ్యం కట్టుకోండయ్యా అని విలపించే తల్లిదండ్రుల్ని అసలే పట్టించు కోని పోలీసుల నిర్లక్ష్య వైఖరికి ఆ ఊరొక నిదర్శనం. హాజీపూర్‌లో అందరి కళ్లూ కప్పి నాలుగేళ్లుగా ఒక మానవ మృగం సాగించిన దారుణాలు విన్నప్పుడు ఎలాంటివారికైనా వెన్నులో చలిపుడు తుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. రాష్ట్ర రాజధాని నగరం నుంచి గంటలోపే చేరగలిగిన ఒక చిన్న గ్రామానికి రవాణా సౌకర్యం లేని కారణంగా... ముగ్గురు చిట్టితల్లులు ఆ మృగం బారినపడ్డారని తెలిసినప్పుడు దిగ్భ్రాంతికలుగుతుంది. మర్రి శ్రీనివాసరెడ్డి అనే నరరూప రాక్షసుడికి చిక్కి తనువు చాలించిన ఆ పిల్లలను తల్చుకున్నప్పుడు ఎంతటివారికైనా దుఃఖం పొంగుకొస్తుంది.
విస్మయం కలిగించే దుర్మార్గాలు ఒక్కొక్కసారి ఎంత యాదృచ్ఛికంగా బయటపడతాయో చెప్పడానికి ఈ సీరియల్ హత్యలే తార్కాణం. నాలుగేళ్లక్రితం హఠాత్తుగా కనుమరుగైన మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి బాలిక కల్పన గురించి పోలీసులు సక్రమంగా పట్టించుకుంటే ఈ వరస హత్యలుండేవి కాదు. అప్పట్లో శ్రీనివాసరెడ్డిపైనే అనుమానాలు కలిగినా సరైన ఆధారాలు లేక వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ అంతకుముందు ఒక వివాహితను వేధించిన ఉదం తంలో గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేశారు. దానిపై కేసు కూడా నమోదైంది. అలాగే కల్పన హత్య జరిగిన కొన్నాళ్లకు 2016లో కర్నూలులో ఒక సెక్స్‌వర్కర్‌ను హత్య చేసిన కేసులో అతడు ముద్దాయి. కల్పన హత్యకు ముందు జరిగిన ఉదంతాన్నిగానీ, తర్వాత జరిగిన హత్యనుగానీ పోలీసులు గమనంలోకి తీసుకుని ఉంటే అతడి దుర్మార్గాలకు అడ్డుకట్టపడేది. గత నెల 25న హాజీపూర్ గ్రామానికే చెందిన శ్రావణి బడికెళ్లి తిరిగివస్తూ అదృశ్యమైన ఉదంతంలో దర్యాప్తు చేస్తుండగా శ్రీనివాసరెడ్డి పొలంలోని పాడుబడ్డ బావి వద్ద ఆమె పుస్తకాల సంచీ లభ్యం కావడం, ఆ మర్నాడు బావిలో ఆమె మృతదేహం బయటపడటంతోపాటు మరో బాలిక అస్థి పంజరం కూడా లభ్యం కావడం వల్ల అతడిపై అనుమానం కలిగింది. బహుశా అంతక్రితం కల్పన మాయమైనప్పుడు వ్యవహరించిన రీతిలోనే అతగాడు అక్కడక్కడే తిరుగాడితే పోలీసులు అనుమానించేవారో లేదో! కానీ పరారీ కావడం వల్ల అనుమానాలు చిక్కబడ్డాయి. ఈ రెండు హత్యల సంగతి వెల్లడయ్యాకే మార్చి 9న మాయమైన మనీషా అనే డిగ్రీ విద్యార్థిని సైతం ఇతడి అకృత్యానికి బలైందని బయట పడింది. మనీషా అదృశ్యంపై ఫిర్యాదుచేస్తే కుటుంబం పరువు పోతుందన్న భయంతో కన్నవారు మౌనంగా ఉండిపోయారు. శ్రీనివాసరెడ్డిని మరింత లోతుగా విచారిస్తే ఇంకేం బయటపడతాయో మున్ముందు చూడాల్సి ఉంది.
తెలంగాణ ఉద్యమప్రాంతం గనుక, నక్సలైట్ల కదలికలు అధికంగా ఉండేవి కనుక ఇక్కడి పల్లెల్లో అందుకు తగ్గట్టే నిఘా ఉండేది. చీమ చిటుక్కుమంటే పోలీసులకు సమాచారం అందేది. కానీ హాజీపూర్ గ్రామం తీరుతెన్నులు చూస్తే ఇప్పుడలాంటి నిఘా ఉన్నట్టు కనబడదు. ఆ గ్రామం లోని కొందరు యువకులు మద్యానికి, గంజాయికి బానిసలు కావడం, శ్రీనివాసరెడ్డి తన పూర్వీ కుల ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడం చూస్తే ఆ పల్లె దిక్కూ మొక్కూ లేని స్థితిలో పడిందని అర్ధమవుతుంది. ఊరి చివర ఒక పాడుబడిన బావి, ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం... ఆ దారి వెంబడే గ్రామానికి చెందిన పిల్లలు నిత్యం వెళ్లాల్సిరావడం వంటివి శ్రద్ధ పెట్టి గమనించి ఉంటే కనీసం అప్పుడప్పుడైనా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఉంచాలని పోలీసులకు అనిపించి ఉండేది. ఒకప్పటి పెద్ద జిల్లాలు తెలంగాణ ఆవిర్భవించాక చిన్న జిల్లాలుగా మారాయి. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ముంగిట్లో ఉంటే వారి సమస్యల్ని తెలుసుకోవడానికి, మరింత సమ ర్ధవంతమైన పాలన అందించడానికి వీలవుతుందన్నది జిల్లాల పునర్వ్యవస్థీకరణలోని ప్రధా నాంశం. కానీ అది ఆచరణలో మరింత పదునెక్కాలని హాజీపూర్ ఉదంతం తెలియజెబుతోంది. కొన్నేళ్లక్రితం మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలో అన్నారం, కొత్తపల్లి గ్రామాల పిల్లలు బస్సు సౌకర్యం లేని కారణంగా చదువు సాగడం లేదని ఆందోళన చేసి ఆ సౌకర్యాన్ని సాధించుకున్నారు. సమస్యలున్నా సర్దుకుపోవడం, రాజీపడటం ఎంత ప్రాణాంతకమో చెప్పడానికి హాజీపూర్ ఉదం తాలు తార్కాణం.
పిల్లలు అదృశమయ్యారన్న ఫిర్యాదులు అందినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలవాటైన పోలీసులకు ఇదొక గుణపాఠం. మాయమైన తమవారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు కాళ్లావేళ్లాప డినా మన దేశంలో పోలీసుల స్పందన అంతంతమాత్రమేనని చాన్నాళ్లనుంచి ఆరోపణలున్నాయి. పదేళ్లక్రితం ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది కూడా. ఏటా వేలాదిమంది పిల్లలు అదృశ్యమవుతున్నా... వారిలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా ఉంటున్నా వెతకడం మాట అటుంచి ఫిర్యాదులు స్వీకరించడానికే పోలీసులు సిద్ధపడటం లేదు. సకాలంలో స్పందించకపో వడం వల్ల దేశంలో ఏటా వేలాదిమంది పిల్లలు వ్యభిచార గృహాల బారినపడుతున్నారు. వెట్టిచా కిరీలో మగ్గిపోతున్నారు. పోలీసులతోపాటు పిల్లల సంరక్షణకు బాధ్యతవహించాల్సిన శాఖల్లోని సిబ్బంది అందరికీ పిల్లల విషయంలో ఫిర్యాదులొచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలి యజెప్పే శిక్షణనివ్వాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలను నివారించడం సాధ్యమవుతుంది.
ఘోరం... దారుణం!
Published Thu, May 2 2019 12:36 AM | Last Updated on Thu, May 2 2019 12:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment