‘చలి వణికిస్తోంది. దోమలు రక్తాన్ని పీల్చుతున్నాయి. కంటి మీద కునుకు లేదు. కడుపు నిండా భోజనమూ లేదు.
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ‘చలి వణికిస్తోంది. దోమలు రక్తాన్ని పీల్చుతున్నాయి. కంటి మీద కునుకు లేదు. కడుపు నిండా భోజనమూ లేదు. వచ్చి నాలుగు రోజులవుతోంది. అయినా టోకెన్ దక్కలేదు. వెళ్లిపోదామనుకుంటే పంట అమ్ముకోలేని దుస్థితి. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే పెట్టుబడి కూడా దక్కని దీనస్థితి. దీంతో ఎంత కష్టమైనా వేచివుండక తప్పని పరిస్థితి. ఎన్నాళ్లిలా..’ అంటూ అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ‘న్యూస్‌లైన్’ బృందం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది.
కనగానపల్లి మండలం కేఎన్ పాళ్యంకు చెందిన హరీష్,రామాంజి, రామగిరి మండలం నసనకోటకు చెందిన నారాయణరెడ్డి, రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన సుబ్బరాయుడు, గంగులకుంటకు చెందిన ఈశ్వరమ్మ, గొందిరెడ్డిపల్లికి చెందిన బాబయ్య, పుల్లలరేవు రైతులు వెంకటరామిరెడ్డి, కేశవయ్య, సుబ్బరాయుడు, బొమ్మేపర్తికి చెందిన లింగన్న... ఇలా ఎవరిని పలకరించినా ఇక్కడ పడుతున్న అవస్థలను ఏకరువు పెట్టారు.
వచ్చి నాలుగు రోజులైనా టోకెన్ రాలేదని చెప్పారు. ‘దగ్గర పల్లెల రైతులు కొందరు రోజుకు రెండు సార్లు ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. మరికొందరు ఇక్కడే తింటున్నారు. ఇంటి దగ్గర భార్యా పిల్లలను వదిలేసి వచ్చాం. అక్కడఎద్దులు ఉండటం వల్ల వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గోడౌన్ దగ్గర మాత్రమే వెలుతురు ఉంది. పరిసరాల్లో చిమ్మచీకటి కమ్ముకుంది. విష పురుగుల బారి నుంచి దేవుడే కాపాడాలి. దీనికితోడు పందులు, దోమలు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పెద్దఎత్తున వేరుశనగ కాయలు తీసుకొచ్చి ఎక్కడికక్కడ నెట్లు వేసుకుని... వాటిపైనే పడుకుంటున్నారు.
ఆదివారం వచ్చినా.. ఇంకా టోకెన్ రాలేదు
అరకొరగా పండిన వేరుశనగను అమ్ముకునేందుకు ఆదివారం వచ్చినాను. ఇప్పటికీ టోకెన్ ఇవ్వలేదు. కడుపు నిండా అన్నం కరువైంది. దోమల వల్ల కంటికి నిద్ర కరువైంది. చేసేది లేక జాగరణ చేస్తున్నా.
- వెంకటరామిరెడ్డి, పుల్లలరేవు, రాప్తాడు మండలం
దోమలు రక్తం పీల్చుతున్నాయ్
శుక్రవారం కాయలు వేసుకువచ్చినాను. ఇప్పటికీ పట్టించుకునేవారు లేరు. ఏఓ, తహశీల్దార్ సంతకాల కోసం రెండు రోజులు తిరిగాం. ఇప్పుడు నాలుగు రోజులుగా రేయింబవళ్లు ఇక్కడ ఉంటున్నాం. రాత్రిళ్లు దోమలు రక్తం పీల్చుతున్నాయ్.
- ఈశ్వరమ్మ, గంగులకుంట, రాప్తాడు మండలం